మారుతి సుజుకి ఎస్-క్రాస్ (S-Cross) ఖేల్ ఖతమ్.. దుకాణం బంద్..! మరి ఆల్టర్నేటివ్ ఏంటి..?
భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎస్-క్రాస్ (S-Cross) క్రాసోవర్ ను మార్కెట్ నుండి తొలగించి వేసింది. మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్ విటారా (Grand Vitara) రావడంతో ఎస్-క్రాస్ అటకెక్కింది. చాలా కాలంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో జరగకపోవడంతో కంపెనీ ఈ మోడల్‌ని శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

ప్రస్తుతం, మారుతి సుజుకి ఎస్-క్రాస్ యొక్క చివరి స్టాక్ నెక్సా (Nexa) డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతోంది. పెండింగ్ ఆర్డర్లను క్లియర్ చేసిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం. మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా ఈ మోడల్‌ను తొలగించివేశారు. దీన్నిబట్టి చూస్తుంటే, ఎస్-క్రాస్ ఇక తిరిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఎస్-క్రాస్ స్థానాన్ని మారుతి సుజుకి తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఆధారంగా తయారు చేయబోయే బాలెనో క్రాస్‌తో రీప్లేస్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి, సుజుకి ఎస్-క్రాస్ ఐరోపా మార్కెట్లో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా ఉంది. కానీ, ఇది భారతదేశంలో మాత్రం కంపెనీ ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో, కంపెనీ ఈ మోడల్ ను భారత మార్కెట్ నుండి తొలగించాలని నిర్ణయించింది. మారుతి సుజుకి భారతదేశంలో దాదాపు 1.7 లక్షల యూనిట్ల ఎస్-క్రాస్ ప్రీమియం క్రాస్‌ఓవర్‌లను విక్రయించింది. అయితే, ఇతర మారుతి సుజుకి కార్ల విక్రయాలతో పోలిస్తే, ఈ సంఖ్య చాలా చిన్నది.

భారత మార్కెట్లో వినియోగదారులు ఎస్‌యూవీలను ఇష్టపడినంతగా క్రాసోవర్ వాహనాలను ఇష్టపడలేదు. అందుకే, ఈ (క్రాసోవర్) విభాగంలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు విజయాలను సాధించలేకపోయాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మారుతి సుజుకి కూడా వచ్చి చేరింది. మారుతి సుజుకి ఎస్-క్రాస్ ముందు వైపు నుండి గంభీరంగా కనిపించినప్పటికీ, దాని వెనుక వైపు వ్యాగన్ లాంటి డిజైన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అయితే, ఎస్-క్రాస్ చూడచానికి చాలా వరకూ ఎస్‌యూవీ ఆకారంలోనే కనిపిస్తుంది. నిటారుగా ఉండే ఫ్రంటే ప్రొఫైల్ మరియు ఫ్లాట్‌గా కనిపించే బానెట్ వలన ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది మరియు మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. అంతే కాకుండా, అదనపు ఎస్‌యూవీ అప్పీల్ కోసం కొత్త సుజుకి ఎస్-క్రాస్ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ కూడా ఉంటుంది. లోపలి భాగంలో యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో పాటుగా అనేక ఇతర సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉండేది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ మొదటిసారిగా మార్కెట్లో ప్రారంభించబడిన సమయంలో ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో విక్రయించబడింది. బేస్ ఇంజన్ 88 బిహెచ్‌పి గరిష్ట శక్తి మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.3-లీటర్, 4-సిలిండర్, మల్టీజెట్ డీజిల్ యూనిట్. తదుపరి ఇంజన్ ఆప్షన్ పెద్ద 1.6-లీటర్, 4-సిలిండర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్, ఇది 118 బిహెచ్‌పి శక్తిని శక్తి మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బిఎస్6 నిబంధనల అమలు తర్వాత ఈ రెండు ఇంజన్లు డిస్‌కంటిన్యూ చేయబడ్డాయి.

ప్రస్తుతం, కొత్త తరం సుజుకి ఎస్-క్రాస్ మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.4 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందించబడింది.

ఎస్-క్రాస్ క్రాసోవర్ స్థానాన్ని రీప్లేస్ చేయనున్న బాలెనో క్రాస్
ఇదిలా ఉంటే, డిస్‌కంటిన్యూ అవుతున్న ఎస్-క్రాస్ స్థానాన్ని మారుతి సుజుకి నుండి అత్యంత పాపులర్ అయిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఆధారంగా రూపొందించబడుతున్న క్రాసోవర్ మోడల్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలెనో క్రాస్ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే వైటిబి అనే కోడ్ నేమ్‌తో అభివృద్ది చేస్తున్నారు. వచ్చే ఏడాది ఢిల్లీలో జరగబోయే 2023 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ క్రాసోవర్ కారును ప్రదర్శించే అవకాశం ఉంది. బాలెనో క్రాస్ అధికారిక ఆవిష్కరణ అనంతరం ఒక నెల తర్వాత ఇది షోరూమ్‌లను చేరుకోవచ్చని భావిస్తున్నారు.

సరికొత్త 2023 మారుతి సుజుకి బాలెనో క్రాస్ ను సుజుకి యొక్క గ్లోబల్ సి ప్లాట్‌ఫారమ్‌కు ఆధారమైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాదిరిగా కాకుండా, కంపెనీ యొక్క ప్రస్తుత హార్ట్‌టెక్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించబడుతుందని సమాచారం. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో బ్రాండ్ యొక్క బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ తిరిగి పరిచయం చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ఇంజన్ ఇప్పుడు కొత్త BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది.

కొత్త బాలెనో క్రాస్ లోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో శక్తివంతమైన వేరియంట్ కోరుకునే వారి కోసం 103 బిహెచ్‌పి శక్తిని అందించే 1.5 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. గేర్‌బాక్స్ ఆప్షన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు లేటెస్ట్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








