డీజిల్ మోడల్ లేకపోయినా ఎర్టిగా ఎమ్‌పివికి తగ్గని డిమాండ్, ఎక్స్ఎల్6 విషయంలోనూ అదే ట్రెండ్..!
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ మార్కెట్లో కస్టమర్ల నుండి మంచి విశ్వసనీయతను దక్కించుకున్న బ్రాండ్. అధిక సంఖ్యలో వాహనాల ఉత్పత్తి, సరసమైన ధరలు, విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ వంటి అనేక అంశాల కారణంగా ఈ బ్రాండ్ భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అగ్రగామిగా రాణించగలగుతోంది. ప్రతినెలా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 కార్ల జాబితాను పరిశీలిస్తే, అందులో కనీసం 3 నుండి ఐదు కార్ల వరకూ మారుతి సుజుకి బ్రాండ్ కి చెందిన మోడళ్లు ఉంటున్నాయి.

గడచిన సంవత్సరం (2021)లో భారతదేశంలోని ఇతర కార్ కంపెనీల మాదిరిగానే మారుతి సుజుకి కూడా కరోనా సెకండ్ వేవ్, సెమీ కండక్టర్ చిప్ షార్టేజ్ వంటి పలు కారణాల తీవ్ర పరిణామాలను ఎదుర్కుంది. ఏదేమైనప్పటికీ, మారుతి సుజుకి అందిస్తున్న టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ (WagonR) 2021లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత స్థానంలో స్విఫ్ట్ (Swift), బాలెనో (Baleno) మరియు ఆల్టో (Alto) మోడళ్లు ఉన్నాయి.

నిజానికి మారుతి సుజుకి బ్రాండ్ నుండి ఈ బడ్జెట్ కార్లకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు, పైన చెప్పిన కారణాల వలన కొనుగోలుదారులు ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, మారుతి సుజుకి కేవలం బడ్జెట్ ప్యాసింజర్ కార్ విభాగంలోనే కాకుండా ఎమ్‌పివి విభాగంలో కూడా బాగానే రాణిస్తోంది. ఈ కంపెనీ డీజిల్ కార్లను విక్రయించడం నిలిపివేసినప్పటికీ, ఎమ్‌పివి విభాగంలో విక్రయిస్తున్న ఎర్టిగా మోడల్ అమ్మకాల పరంగా బాగా రాణిస్తోంది. గత ఏడాది మారుతి సుజుకి మొత్తం 1,54,310 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది.

మారుతి సుజుకి 2020 లో కేవలం 1,04,185 ఎర్టిగా మరియు ఎక్స్‌ఎల్6 కార్లను మాత్రమే విక్రయించింది. ఆ సమయంతో పోల్చుకుంటే, గడచిన సంవత్సరంలో మారుతి సుజుకి ఎమ్‌పివిల అమ్మకాలు 48 శాతం వృద్ధి చెందాయి. గడచిన 2020 లో కరోనా మొదటి వేవ్ సమయంలో విధించిన లాక్‌డౌన్ మరియు ఆంక్షల కారణంగా 2021లో కంపెనీ అమ్మకాలు క్షీణించాయని చెబుతున్నప్పటికీ, గత 2021లో కూడా ఆటోమొబైల్ రంగానికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయో మనం ఇదివరకే చెప్పుకున్నాం.

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సెమీ కండక్టర్ చిప్‌ల కొరత కారణంగా సెప్టెంబర్ 2021 నుండి ఫ్యాక్టరీ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు మారుతి సుజుకి ఇండియా తెలిపింది. దీంతో గత కొన్ని నెలలుగా మారుతి సుజుకి కార్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. అయితే, మారుతి సుజుకి ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 కార్ల విక్రయాలలో మాత్రం కంపెనీ 2021 నాటికి 1.5 లక్షల మైలురాయిని విజయవంతంగా అధిగమించింది.

గడచిన 2021 లో విక్రయించిన మొత్తం ప్యాసింజర్ కార్లలో ఈ రెండు మోడళ్ల అమ్మకాలే దాదాపు 5 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మారుతి సుజుకి ప్రస్తుత సంవత్సరంలో (2022) కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలను మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది. ఈ రెండు మోడళ్లను మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ను అందించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా, ఈ ఇండో-జపనీస్ కంపెనీ తన కార్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ను కూడా పరిచయం చేయాలని చూస్తోంది.

ప్రస్తుతం మారుతి సుజుకి తమ కార్లలో 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను ఉపయోగిస్తోంది. అయితే, భవిష్యత్తులో దాని స్థానంలో కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను ప్రవేశపెట్టేందుకు చూస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో, కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో రాబోయే రెండవ మారుతి సుజుకి కారుగా ఎర్టిగా ఎమ్‌పివి ఉంటుందని మేము భావిస్తున్నాము. కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను ముందుగా విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది మే లేదా జూన్ నెలల నాటికి విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ప్రీమియం ఎమ్‌పివిలో కూడా ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో కూడిన అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జాను కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ గేర్‌బాక్స్ మెరుగైన పవర్ డిస్ట్రిబ్యూషన్ మరియు మైలేజ్ ను అందిస్తుందని సమాచారం.

ఎర్టిగా అప్‌గ్రేడ్ విషయానికి వస్తే, దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో కంపెనీ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులను చేసే అవకాశం ఉంది. అలాగే, ఇందులో చిన్నపాటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ ని కూడా ఆశించవచ్చు. మారుతి ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ధరలు ప్రస్తుతం రూ.8.12 లక్షల నుండి రూ.10.85 లక్షల వరకు ఉన్నాయి. ఈ ధరలతో ఇది మార్కెట్లో అత్యంత సరసమైన ప్రీమియం 7-సీటర్ ఎమ్‌పివిగా, టొయోటా ఇన్నోవా క్రిస్టాకు గట్టిగా పోటీగా నిలుస్తోంది.

ఇక ఎర్టిగా యొక్క ప్రీమియం వెర్షన్ అయిన మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును మారుతి యొక్క Nexa ప్రీమియం క్వాలిటీ అవుట్‌లెట్ల ద్వారా విక్రయిస్తోంది. మారుతి ఎక్స్ఎల్6 ప్రస్తుతం కేవలం 6-సీటర్ వెర్షన్ లో మాత్రమే విక్రయించబడుతోంది. ఇది ఎర్టిగా ఎమ్‌పివి కన్నా ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. రెండవ వరుస కెప్టెన్ సీట్లను కలిగి ఉండే XL6 యొక్క ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరలు రూ.10.14 లక్షల నుండి రూ.12.02 లక్షల మధ్యలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications