ఆరు నెలల్లో 6 కొత్త కార్లను విడుదల చేయనున్న Maruti Suzuki.. అవేంటో చూద్దాం రండి..!!
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) దేశీయ మార్కెట్లో తమ ప్రోడక్డ్ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఇటీవలి కాలంలో మారుతి సుజుకి కొన్ని కొత్త కార్లను మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో కొత్త తరం సెలెరియో, సెలెరియో సిఎన్‌జి, కొత్త 2022 బాలెనో మరియు డిజైర్ సిఎన్‌జి వంటివి ఉన్నాయి. ప్రస్తుతం, కంపెనీ యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 15 కార్లు ఉన్నాయి. వీటిలో ఏడు ప్యాసింజర్ మోడళ్లలో సిఎన్‌జి వెర్షన్లు కూడా లభిస్తున్నాయి.

ఇవన్నీ కాదన్నట్లు, మారుతి సుజుకి ఇప్పుడు కొత్తగా రానున్న ఆరు నెలల్లో మరో 6 కొత్త కార్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. బిఎస్6 నిబంధనల తర్వాత మారుతి సుజుకి డీజిల్ కార్లను నిలిపివేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిఎన్‌జి మోడళ్ల సంఖ్యను కంపెనీ క్రమంగా పెంచుతోంది. సమాచారం ప్రకారం, బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో కూడా కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్ ను విడుదల చేయనుంది. మరి మారుతి సుజుకి నుండి రాబోయే ఆ ఆరు కొత్త కార్లు ఏవో తెలుసుకుందాం రండి.

1. మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki Ertiga Facelift)
ప్రస్తుతం, భారత ఎమ్‌పివి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి సుజుకి ఎర్టిగా లో కంపెనీ అప్‌డేటెడ్ మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ త్వరలోనే కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లతో మార్కెట్లోకి రానుంది. ఇది ఇటీవలే ఈ విభాగంలో విడుదలైన కియా కారెన్స్ ఎమ్‌పివికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కొత్త ఎర్టిగా మోడల్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కెమరాలకు చిక్కింది. ఇది ప్రస్తుత 1.5 లీటర్ ఇంజన్‌తో పాటుగా కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో రావచ్చని సమాచారం.

2. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki XL6 Facelift)
మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివికి పెద్దన్నగా చెప్పబడే ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను ప్రవేశపెట్టనుంది. మారుతి ఎర్టిగా అప్‌డేట్ అవుతున్నందున, కంపెనీ దాని ఆధారంగా తయారు చేసిన ప్రీమియం ఎమ్‌పివి మారుతి ఎక్స్ఎల్6 ను కూడా అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కొత్త గ్రిల్ మరియు కొత్త బంపర్‌లతో కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అప్‌డేటెడ్ మారుతి ఎక్స్ఎల్6 మునుపటిలా కేవలం 6 సీట్లతోనే కాకుండా, కొత్తగా 7 సీట్ల కాన్ఫిగరేషన్ తో కూడా అందుబాటులోకి రావచ్చని అంచనా.

3. సరికొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (New Maruti Suzuki Vitara Brezza)
మారుతి సుజుకి మాతృ సంస్థ అయిన జపనీస్ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ల కోసం కొత్త సుజుకి విటారాను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో, ఈ కొత్త తరం సుజుకి విటారా ఆధారంగా, కంపెనీ భారతదేశంలో కూడా తమ విటారా బ్రెజ్జాను అప్‌డేట్ చేయవచ్చని భావిస్తున్నారు. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ బ్రెజ్జా త్వరలోనే భారతదేశంలో ప్రారంభించబడుతుందని నమ్ముతారు. ఇది కూడా అదే గ్లోబల్ సి-ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది. అయితే, ఈ అప్‌డేట్ చేయబడిన ఎస్‌యూవీలో మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ ను అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా, దీని పేరులో విటారాను కూడా తొలగించవచ్చని సమాచారం.

4. మారుతి సుజుకి బాలెనో సిఎన్‌జి (Maruti Suzuki Baleno CNG)
మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయించే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోలో కంపెనీ ఇటీవలే తమ కొత్త 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ లో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. డిజైన్, ఫీచర్ మార్పులు మినహా ఇందులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, మారుతి సుజుకి ఇప్పుడు తమ నెక్సా రేంజ్ కార్లను కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్లతో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. సమాచారం ప్రకారం, కంపెనీ ముందుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడిన మారుతి సుజుకి బాలెనోను త్వరలో లాంచ్ చేయవచ్చు.

5. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో డ్యూయల్‌జెట్ (Maruti Suzuki S-Presso DualJet)
మారుతి సుజుకి అప్‌డేట్ చేయబోయే కార్ల లిస్టులో ఎస్-ప్రెస్సో పేరు కూడా ఉంది. కంపెనీ ఈ కొత్త ఎస్-ప్రెసో మోడల్ ను డ్యూయల్‌జెట్ ఇంజన్‌తో అప్‌డేట్ చేయవచ్చని చెలుస్తోంది. ప్రస్తుతం ఈ మైక్రో-ఎస్‌యూవీ / హ్యాచ్‌బ్యాక్ 1.0 లీటర్ కె10బి పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది, ఇది 68 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అప్‌డేట్ తర్వాత ఇది కొత్త 1.0 లీటర్ కె10సి డ్యూయెల్ జెట్ ఇంజన్ ను పొందే అవకాశం ఉంది. ఈ కొత్త ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

6. మారుతి సుజుకి ఇగ్నిస్ డ్యూయల్‌జెట్ (Maruti Suzuki Ignis DualJet)
అప్‌డేటెడ్ మారుతి ఎస్-ప్రెసో మాదిరిగానే, నెక్సా షోరూమ్ ల ద్వారా కంపెనీ విక్రయిస్తున్న మారుతి ఇగ్నిస్ కారులో కూడా కంపెనీ డ్యూయల్‌జెట్ ఇంజన్ ను పరిచయం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఈ చిన్న కారులో 1.2 లీటర్ కె12ఎఎమ్ ఇంజన్ ను ఉపయోగిస్తోంది, ఇది గరిష్టంగా 83 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అప్‌డేట్ అనంతరం, ఈ కొత్త కారులో కంపెనీ 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ ఇంజన్‌ని ఉపయోగించవచ్చని సమాచారం.

మారుతి సుజుకి నుండి రాబోయే ఇతర కార్లు
మారుతి సుజుకి పైన పేర్కొన్న 6 కార్లతోపాటు మరికొన్ని కొత్త కార్లు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా జపనీస్ కంపెనీ టొయోటా మరియు మారుతి సుజుకి భాగస్వామ్యంతో నిర్మించబడుతున్న ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఉంది. ఇది ప్రస్తుతం భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఇదే కాకుండా, కంపెనీ ఓ కొత్త తరం మారుతి సుజుకి ఆల్టో కారుపై కూడా పని చేస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








