సేఫ్టీలో 1 స్టార్ రేటింగ్ వద్ద ఆగిపోయిన మారుతి స్విఫ్ట్
మారుతి సుజుకి యొక్క 'స్విఫ్ట్' దేశీయ మార్కెట్లో ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఇటీవల జరిగిన క్రాష్ టెస్ట్‌లో 'మారుతి స్విఫ్ట్' సేఫ్టీ పరంగా కేవలం 1-స్టార్ రేటింగ్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం జులైలో అమలులోకి వచ్చిన గ్లోబల్ ఎన్‌సిఎపి యొక్క మరింత కఠినమైన ప్రోటోకాల్‌ల క్రింద స్విఫ్ట్, ఇగ్నిస్, ఎస్ ప్రెస్సో మరియు మహీంద్రా స్కార్పియో ఎన్ వంటివి పరీక్షించబడ్డాయి. అయితే ఇందులో మారుతి స్విఫ్ట్ 1 స్టార్ రేటింగ్ దగ్గరే ఆగిపోయింది. క్రాష్ టెస్ట్‌లో పరీక్షించబడిన మోడల్ భారతదేశంలో తయారుచేయబడింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు మరియు సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ అడల్ట్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో 34 పాయింట్లలకు గాను 19.19 పాయింట్లను స్కోర్ చేసింది. అదే సమయంలో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ మరియు సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో వరుసగా 6.3 పాయింట్లు మరియు 12.9 పాయింట్లు వచ్చాయి. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో మారుతి స్విఫ్ట్ డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల మరియు మెడకు మంచి రక్షణను అందించిందని GNCAP తెలిపింది.
అయితే ఈ టెస్ట్‌లో డ్రైవర్ ఛాతీకి లభించే రక్షణ చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించబడింది. అంతే కాకుండా డ్రైవర్ మోకాలు మరియు ప్యాసింజర్ కుడి మోకాలు డ్యాష్‌బోర్డ్ వెనుక కూడా ఆశించిన రక్షణ లేదు. కాగా ప్యాసింజర్ ఎడమ మోకాలికి రక్షణ ఉన్నట్లు తెలిసింది. దీనితోపాటు సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో, తల, ఉదరం మరియు కటి రక్షణ బాగానే ఉన్నప్పటికీ.. ఛాతీకి లభించే రక్షణ చాలా తక్కువగా ఉందని నిర్దారించబడింది.
చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో మారుతి స్విఫ్ట్ 49 పాయింట్లకు గానూ 16.68 పాయింట్లు స్కోర్ చేసింది. ఇందులో డైనమిక్ స్కోర్ 12.82 పాయింట్లు, కాగా CRS (చైల్డ్ రెస్ట్రెయిన్ సిస్టమ్) ఇన్‌స్టాలేషన్ స్కోర్ 3.86 పాయింట్లు. ఇందులో 18 నెలల చైల్డ్ డమ్మీ మరియు 3 ఏళ్ల చైల్డ్ డమ్మీని ఉంచి టెస్ట్ చేశారు. ఈ రెండు డమ్మీలు వెనుకవైపు ఉన్న చైల్డ్ సీట్‌లలో ముందుకు ఎదురుగా కూర్చున్నారు.
3 సంవత్సరాల చైల్డ్ డమ్మీకి చైల్డ్ సీట్లు అధిక ఫార్వర్డ్ మూవ్‌మెంట్‌ను నిరోధించగలిగాయి, కావున చైల్డ్ తలకు మంచి రక్షణను మరియు ఛాతీకి కొంత వరకు రక్షణను ఇవ్వగలిగాయి. అయితే 18 నెలల డమ్మీ యొక్క తల మరియు ఛాతీకి తక్కువ రక్షణ లభించింది. ఈ ఫలితాలు 2018 స్విఫ్ట్ అందించే పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌ను పోలి ఉన్నట్లు అనిపిస్తుంది. స్విఫ్ట్ రెండు ఔట్‌బోర్డ్ రియర్ సీట్లకు మాత్రమే ISOFIX ఎంకరేజ్‌లను కలిగి ఉంది.
నిజానికి ప్రస్తుతం అమలులో ఉన్న గ్లోబల్ NCAP యొక్క కొత్త ప్రోటోకాల్‌లు కారును క్రాష్ టెస్ట్ చేస్తున్నప్పుడు పాదచారుల రక్షణ నిబంధనలను కూడా తప్పనిసరిగా టెస్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ యొక్క స్టాండర్డ్ ఫిట్‌మెంట్, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్, క్రాష్ టెస్ట్ డమ్మీల యొక్క చెస్ట్ లోడ్ రీడింగ్‌లను మరింత కఠినంగా టెస్ట్ చేయడమే కాకుండా, సైడ్ ఇంపాక్ట్ వంటి అనేక అంశాలను కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాయి.
నిజానికి మారుతి స్విఫ్ట్ లో ఆశించిన స్థాయిలో ఫీచర్స్ లేవనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కాగా ఇప్పుడు కొత్తగా అమలులోకి వచ్చిన ఈ గ్లోబల్ NCAP కొత్త ప్రోటోకాల్స్ స్విఫ్ట్ సేఫ్టీ రేటింగ్ ను 1-స్టార్ అని నిర్దారించింది. ఇది భద్రతా ఫీచర్స్ ఎక్కువగా కావాలనుకునే వాహన వినియోగదారులకు అంత అనుకూలమైనది కాకపోవచ్చని ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








