కొత్త హ్యుందాయ్ వెన్యూ 2022 మోడల్ విడుదల.. ధర కేవలం రూ.7.53 లక్షలు మాత్రమే!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai), భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ (Venue) లో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ (2022 Hyundai Venue) రిఫ్రెష్డ్ డిజైన్ మరియు రివైజ్డ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దేశీయ విపణిలో ఈ కొత్త హ్యుందాయ్ కారు ధరలు రూ.7.53 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

హ్యుందాయ్ ఈనెల ఆరంభంలోనే తమ కొత్త 2022 వెన్యూ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీని రూ.21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో కానీ లేదా హ్యుందాయ్ ఇండియా వెబ్‌సైట్ లో క్లిక్ టు బై ప్లాట్‌ఫారమ్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ E, S, S+/S(O), SX, మరియు SX (O) అనే ఐదు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
| Venue Engine | Variant | Price |
| Kappa 1.2 MPi Petrol | E 5MT | ₹7,53,100 |
| Kappa 1.0 Turbo GDi Petrol | S (O) iMT | ₹9,99,900 |
| U2 1.5 CRDi Diesel | S+ 6 MT | ₹9,99,900 |

డిజైన్ అప్‌డేట్స్..
కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ముందు మరియు వెనుక వైపున రిఫ్రెష్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ముందు బాగంలో పెద్ద పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్ డిజైన్‌తో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్-ఎండ్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇందులో అవే స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో కూడిన కొత్త ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, బానెట్ క్రింది భాగంలో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బంపర్ క్రింది భాగంలో సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులతో ఇది ముందు వైపు నుండి చాలా కొత్తగా కనిపిస్తుంది.

అలాగే, దీని రియర్ డిజైన్ కూడా రివైజ్ చేయబడింది. వెనుక వైపు కొత్త L-ఆకారపు ర్యాప్‌రౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు ఈ రెండు టెయిల్ ల్యాంప్స్ ను కలుపుతూ పోయే సన్నటి ఎల్ఈడి లైట్ స్ట్రిప్, రీప్రొఫైల్ చేయబడిన రియర్ బంపర్, కొత్త 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, సిల్వర్ కలర్ రూఫ్ రెయిల్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌తో ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 7 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, పోలార్ వైట్, ఫాంటమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, ఫైరీ రెడ్ మరియు ఫైరీ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ (డ్యూయల్-టోన్) కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

ఫీచర్ అప్‌డేట్స్..
ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బేజ్ కలర్ థీమ్‌తో కూడిన క్యాబిన్ ను కలిగి ఉంటుంది. ఈ కారులో 4-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్లూలింక్ కనెక్టింగ్ టెక్నాలజీ ద్వారా 60 కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ టెక్ ఫీచర్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

హోమ్-టూ-కార్.. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్..
కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూలో సెగ్మెంట్లో కెల్లా మొదటిగా అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో కూడిన హోమ్ టు కార్ ఫంక్షన్ అనే ప్రత్యేకమైన ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కమాండ్ ఆధారితంగా పనిచేస్తుంది. ఇది ఇంగ్లీష్ మరియు హిందీలో వాయిస్ కమాండ్స్ ను అనుమతిస్తుంది. ఈ హోమ్ టు కార్ ఫీచర్ సాయంతో కస్టమర్ తమ ఇంటిలో ఉండే అమేజాన్ అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్ డిజైజ్ ను ఉపయోగించి వాయిస్ కమాండ్ సాయంతో కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కారులోని ఏసి (ఎయిర్ కండిషనింగ్) ను రిమోట్ గా స్టార్ట్ చేయవచ్చు.
అంతేకాకుండా, ఈ హోమ్ టూ కార్ ఫీచర్ సాయంతో అనేక ఇతర ఫీచర్లను కూడా ఈ వాయిస్ కమాండ్స్ ని ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. వీటిలో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేయడం, డోర్‌లను రిమోట్ గా అన్‌లాక్ లేదా లాక్ చేయడం, వాహనం యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడం, ఫైండ్ మై కార్ ఫీచర్‌ని యాక్సెస్ చేయడానికి అలాగే టైర్ ప్రెజర్ మరియు ఫ్యూయల్ లెవెల్ మానిటరింగ్ సిస్టమ్‌ల నుండి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి కూడా ఈ హోమ్ టూ కార్ వాయిస్ కమాండ్‌లను ఉపయోగించవచ్చు.

హ్యుందాయ్ వెన్యూలో కంపెనీ మరొక ఫస్ట్ సెగ్మెంట్ ఫీచర్ ను కూడా అందిస్తోంది. అదే, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్. ఈ సెగ్మెంట్లోని ఇతర కార్లలో ఇలాంటి ఫీచర్ అందుబాటులో లేదు. ఈ ఫీచర్ సాయంతో డ్రైవర్ తన సీటును తన డ్రైవింగ్ పొజిషన్‌కు తగినట్లుగా యాంత్రికంగా సర్దుబాటు చేసుకోచ్చు. అలాగే, సేఫ్టీ విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM) మరియు హిల్-అసిస్ట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

ఈ కొత్త 2022 మోడల్ వెన్యూలో హ్యుందాయ్ అందిస్తున్న మరొక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, ఈ కారులో ఆరు విభిన్నమైన యాంబియెంట్ సౌండ్స్ ఉంటాయి. సౌండ్స్ ఆఫ్ నేచర్ అని పిలువబడే ఈ ఫీచర్ లో ఆరు రకాల ప్రకృతి శబ్ధాలు ఉంటాయి. ఇవి పక్షుల అరుపులు లేదా సముద్రం ఒడ్డున నీరు చేసే అలజడి శబ్ధం లాంటి లేదా గాలి చేసే శబ్ధం మాదిరిగా ఆరు రకాల శబ్ధాలను కారులోని స్పీకర్ల ద్వారా ప్లే చేస్తుంది. ఇవి మనస్సుకి ఎంతో హాయిని ఇస్తాయని కంపెనీ చెబుతోంది. విదేశాలలో విక్రయించబడే జెనిసిస్ వంటి లగ్జరీ కార్లలో ఇలాంటి ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ఇంకా ఇందులో రిక్లైనింగ్ రియర్ సీటు, ఎయిర్ ప్యూరిఫైయర్, వెనుక ప్రయాణీకుల కోసం వెనుక ఏసి వెంట్‌లు మరియు వాటి క్రింద బాగంలో ఉంచబడిన డ్యూయల్ USB C-స్లాట్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్యాడిల్ షిఫ్టర్లు, కస్టమైజబల్ థీమ్‌లతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బిల్ట్-ఇన్ నావిగేషన్‌తో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లను సపోర్ట్ టెక్నాలజీ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ ఆప్షన్స్, డ్రైవ్ మోడ్స్..
కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఇదివరకటి మాదిరిగానే మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. వీటిలో రెండు పెట్రోల్ ఇంజన్లు మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మొదటిది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని మరియు 113.8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, రెండవది మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ త్రీ-సిలిండర్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజ. ఈ ఇంజన్ గరిష్టంగా 120 పిఎస్ పవర్ ను మరియు 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ వెన్యూలో లభిస్తున్న ఏకైక డీజిల్ ఇంజన్ ఆప్షన్ 1.5-లీటర్ యూనిట్. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్ శక్తిని మరియు 240 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఎకో మోడ్ లో ఈ ఎస్‌యూవీ అధిక మైలేజీనిస్తుందని, వేగం కోరుకునే వారి కోసం స్పోర్ట్ మోడ్ చక్కగా సూట్ అవుతుందని, ప్రశాంతంగా డ్రైవ్ చేయాలనుకునే వారికి నార్మల్ మోడ్ ఇటు ఎకో మరియు అటు స్పోర్ట్ మోడ్‌ల మధ్య సమతౌల్యాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
కాంపిటీషన్ మరియు వారంటీ..
హ్యుందాయ్ వెన్యూ భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఇప్పటికే అగ్రగాములుగా ఉన్న టాటా నెక్సాన్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. హ్యుందాయ్ వెన్యూపై కంపెనీ మూడేళ్ల స్టాండర్డ్ వారంటీని మరియు బ్లూలింక్ యాప్ కోసం మూడేళ్ల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

హ్యుందాయ్ వెన్యూ 3 లక్షల యూనిట్లు..
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఉన్సూ కిమ్ మాట్లాడుతూ.. వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసినప్పటి నుండి ఇప్పడి వరకూ 3,00,000 యూనిట్లు వెన్యూ కార్లను విక్రయించామని, వీటిలో దాదాపు 2,50,000 యూనిట్లను భారతదేశంలోనే విక్రయించామని మిగిలిన వాటిని పలు గ్లోబల్ మార్కెట్లలో విక్రయించామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో హ్యుందాయ్ విక్రయించే ప్రతి మూడు వెన్యూ కార్లలో రెండు భారతదేశంలో తయారైనవే అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








