కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనో (2022 Baleno) బుకింగ్స్ ప్రారంభం.. టీజర్ విడుదల
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India), మార్కెట్లో తమ నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ ల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో (Baleno) లో కంపెనీ ఓ కొత్త మోడల్ ను తీసుకురానున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా, ఈ కొత్త 2022 మోడల్ బాలెనో కోసం కంపెనీ బుకింగ్ లను కూడా ప్రారంభించింది.

మారుతి సుజుకి తమ కొత్త 2022 మోడల్ బాలెనో కారును సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్లతో ఈ ప్రీమియం కారు మరింత ప్రీమియంగా మారనుంది. కొత్త ఫీచర్లతో పాటుగా ఇందులో రిఫ్రెష్డ్ డిజైన్ మరియు కొత్త ఇంటీరియర్లను కూడా ఆశించవచ్చు. కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో, మారుతి సుజుకి బాలెనో యొక్క కొత్త ఫీచర్ 'హెడ్స్ అప్ డిస్‌ప్లే' (Head-up Display) ను కంపెనీ హైలైట్ చేసింది. కంపెనీ ఈ కారును కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లు మరియు అనేక భద్రతా పరికరాలతో తీసుకురానుంది, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉంటాయని అంచనా.

కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనో కారులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం, మారుతి సుజుకి బాలెనో భారత మార్కెట్లో ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.
మారుతి సుజుకి తమ కొత్త కార్లలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ ను పరిచయం చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ గేర్‌బాక్స్ అప్‌డేట్ 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనోకి వర్తిస్తుందో లేదో వేచి చూడాలి. కాగా, మరింత ధృడమైన మరియు మెరుగైన స్టీల్‌తో తయారు చేసిన బాడె ప్యానెళ్లను కొత్త 2022 మారుతి బాలెనోలో ఇన్‌స్టాల్ చేసినట్లు సమాచారం. దీని ముందు భాగం పూర్తిగా రీడిజైన్ చేయబడి ఉంటుంది, ఇందులో మెష్ గ్రిల్ కూడా ఇవ్వబడింది

ఫేస్‌లిఫ్ట్ బాలెనో ముందు భాగంలో హెడ్‌లైట్‌తో పాటు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా ఉంటాయి మరియు పెద్ద ఫ్రంట్ బంపర్, విశాలమైన ఎయిర్ డ్యామ్ మరియు వృత్తాకార ఫాగ్ లైట్లను ఇందులో ఆఫర్ చేయనున్నారు. ఫ్రంట్ బానెట్ కూడా రీడిజైన్ చేయబడినట్లుగా ఉంది మరియు ఇది మునుపటితో పోలిస్తే చాలా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. ఇక వెనుక భాగంలో చేయబోయే మార్పుల విషయానికి వస్తే, ఇందులో రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, L-ఆకారపు టైల్‌లైట్ క్లస్టర్ మరియు ఎల్ఈడి ఇండికేటర్లు మరియు కొత్త రియర్ బంపర్ మొదలైనవి ఉన్నాయి.

సైడ్ డిజైన్ లో కొత్త అల్లాయ్ వీల్స్ మినహా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాగా, కంపెనీ ఈ కారును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటుగా కంపెనీ ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు పరికరాలను కూడా అందించనుంది. క్యాబిన్ లోపల కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఉండొచ్చని సమాచారం. దీనితో పాటు, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ కోసం, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో వంటి ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది.

ఈ కారులో హెడ్స్ అప్ డిస్ప్లే, V-ఆకారపు ఎయిర్ కండిషన్ వెంట్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీనితో పాటుగా యువ కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ ఇందులో కొన్ని ఆధునిక ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం, మారుతి సుజుకి కార్లు అంత సురక్షితంగా పరిగణించబడటం లేదు, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో విటారా బ్రెజ్జా మరియు ఎర్టిగా మోడళ్లు మాత్రమే సురక్షితమైనవిగా గుర్తించబడ్డాయి.

ఈ నేపథ్యంలో, కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనో కారును తయారు చేయడానికి కంపెనీ తమ పాపులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్ యొక్క అప్‌డేట్ వెర్షన్ ఉపయోగించనున్నట్లు సమాచారం. అలాగే మరింత ధృడత్వం కోసం అప్‌గ్రేడ్ చేయబడిన స్టీల్‌తో ఛాసిస్ మరియు బాడీ ప్యానెల్‌లను తయారు చేయనున్నారు. ఈ కొత్త మోడల్ కోసం చేయబోయే తదుపరి క్రాష్ టెస్టులో దీనికి 4-స్టార్ లేదా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాలని కంపెనీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

భద్రత పరంగా చూసుకుంటే, కంపెనీ ఈ చిన్న కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు కెమెరా, హై స్పీడ్ వార్నింగ్ మొదలైనవి ఉన్నాయి. మారుతి సుజుకి తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి బాలెనోను విడుదల చేసినప్పటి నుండి గత డిసెంబర్ 2021వరకూ ఒక మిలియన్ యూనిట్లకు (10 లక్షలకు పైగా) పైగా విక్రయించింది. నెక్సా షోరూమ్ ల ద్వారా విక్రయించబడుతున్న మారుతి సుజుకి బాలెనో అక్టోబర్ 2015 లో భారత మార్కెట్లో ప్రారంభించబడింది.


Click it and Unblock the Notifications








