కొత్త 2022 రెనో క్విడ్ (2022 Renault Kwid) విడుదల.. ధర కేవలం రూ.4.49 లక్షలు మాత్రమే!!
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న క్విడ్ హ్యాచ్‌బ్యాక్ లో కంపెనీ ఓ కొత్త 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త 2022 రెనో క్విడ్ (New 2022 Model Renault Kwid) హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కారులో కంపెనీ దాని ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్లలో పలు మార్పులు చేర్పులు చేసింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.

రెనో క్విడ్ కారును తొలిసారిగా భారత మార్కెట్లో 2015లో విడుదల చేయబడింది. అప్పటి నుండి ఈ కారు రెనో బ్రాండ్ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా మారింది. భారత మార్కెట్లో రెనో క్విడ్ ఇప్పటికే 4 లక్షలకు పైగా కస్టమర్లకు చేరువైంది. ఇది ప్రధానంగా ఆల్టో వంటి చిన్న కారు వినియోగదారులను ఆకర్షిస్తుంది. రెనో క్విడ్ విజయాన్ని పురస్కరించుకొని కంపెనీ ఇందులో ఓ కొత్త రిఫ్రెష్డ్ 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త 2022 మోడల్ రెనో క్విడ్ మునుపటి మాదిరిగానే 0.8 లీటర్ మరియు 1.0 లీటర్ ఇంజన్ ఆప్షన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో టాప్-ఆఫ్ ది లైన్ అయిన రెనో క్విడ్ క్లైంబర్ ఎడిషన్ ఇప్పుడు కొత్త డ్యూయల్ టోన్ ఫ్లెక్స్ వీల్స్‌తో లభిస్తుంది. అలాగే, ఇందులో కలర్ యాక్సెంట్స్ లో కూడా కంపెనీ కొన్ని మార్పులు చేసింది. క్లైంబర్ రేంజ్ ఇప్పుడు మెటల్ మస్టర్డ్, ఐస్ కూల్ వైట్ విత్ బ్లాక్ కలర్ రూఫ్ తో లభిస్తుంది. సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో మూన్‌లైట్ సిల్వర్ మరియు జాన్‌స్కర్ బ్లూ ఉన్నాయి.

ఈ కొత్త మోడల్ రెనో క్విడ్ కారులో ప్రధానంగా చెప్పుకోదగిన కొత్త ఫీచర్ ఏంటంటే, ఇందులోని కొత్త 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ మీడియానావ్ ఎవల్యూషన్ (MediaNAV Evolution) ఇన్ఫోటైన్‌మెంట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇది ఆండ్రాయిడ్ ఆటో (Android Auto) మరియు ఆపిల్ కార్‌ప్లే (Apple CarPlay) కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఇందులో వీడియో ప్లేబ్యాక్ మరియు వాయిస్ రికగ్నిషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఇందులో RXL (O) అనే ఓ కొత్త వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో (0.8 లీటర్ మరియు 1.0 లీటర్) కూడా అందుబాటులో ఉంటుంది.

రెనో క్విడ్ లో బడ్జెట్ కారు అయినప్పటికీ, కంపెనీ అందులో అనేక అధునాతన ఫీచర్లను అందిస్తుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన సైడ్ మిర్రర్లు, ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి. వీటికి అదనంగా, ఈ కొత్త 2022 రెనో క్విడ్ ఇప్పుడు స్పీడ్ అలర్ట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఇది ఓవర్ స్పీడ్ అలారమ్ తో అమర్చబడి ఉంటుంది.

ఇవి మినహా, కొత్త 2022 మోడల్ రెనో క్విడ్ కారులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు. మునుపటి మాదిరిగానే కొత్త 2022 రెనో క్విడ్ కారు కూడా 2 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 0.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 53 బిహెచ్‌పి పవర్ ను మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పి పవర్ ను మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఈ రెండు ఇంజన్లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

ఇక కారులో లభించే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, సీట్ బెల్ట్ రిమైండర్, ఓవర్‌స్పీడ్ అలర్ట్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. కాగా, కొత్త 2022 మోడల్ లైనప్ లో డ్రైవర్ సైడ్ పైరో అండ్ ప్రిటెన్షనర్‌తో పాటు లోడ్ లిమిటర్ ను స్టాండర్డ్ ఫీచర్ గా జోడించారు.

రెనో క్విడ్ కారులో ప్రధానమైన అంశం దాని మెరుగైన మైలేజ్. ఇందులో 0.8 లీటర్ ఇంజన్ లీటరుకు 22.25 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది (రియల్ వరల్డ్ ఈ సంఖ్య మారే అవకాశం ఉంది). రెనో క్విడ్ మెయింటినెన్స్ ఖర్చు కిలోమీటరుకు 35 పైసలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వారంటీ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారుపై 2 సంవత్సరాలు లేదా 50,000 కిమీ (ఏది ముందుగా ముగిస్తే అది) సమగ్ర వారంటీని అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్ల దీనిని 5 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఇందుకోసం కంపెనీ ఈజీ కేర్ ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఈ అదనపు వారంటీలో 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








