ఈ నెలలో [2022 అక్టోబర్] దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కార్లు, ఇవే: చూసారా..!!
2022 అక్టోబర్ నెల దాదాపు ముగిసింది. ఈ నెలలో దేశీయ మార్కెట్లో కొన్ని కార్లు విడుదలయాయ్యి. ఇందులో మహీంద్రా కంపెనీ యొక్క XUV300 టర్బో మోడల్, BYD యొక్క ఎలక్ట్రిక్ SUV మరియు నిస్సాన్ కొత్త మోడల్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

BYD ATTO 3 ఎలక్ట్రిక్ SUV:
ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి పొందిన 'బివైడి' (BYD) కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది, కంపెనీ ఇటీవల ఈ ఎలక్ట్రిక్ SUV ని ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

ఈ ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునే కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది.

కొత్త అటో 3 ఎలక్ట్రిక్ SUV పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ మరియు చిన్న 49.92kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఒక్క ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 80 kW DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 50 నిమిషాల్లో 0 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో టైప్ 2 AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్:
ఈ నెలలో విడుదలైన కార్లలో మహీంద్రా కంపెనీ యొక్క ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్ కూడా ఉంది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 ప్రారంభ ధర రూ. 10.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది W6, W8 మరియు W8(O) అనే మూడు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్ నాలుగు కొత్త కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇందులో 1.2 లీ త్రీ సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 130 పిఎస్ పవర్ మరియు 230 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద ఈ అప్డేటెడ్ ఇంజిన్ ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ కంటే మంచి పనితీరుని అందిస్తుంది.

మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి:
మారుతి సుజుకి ఈ నెలలో తన ఎస్-ప్రెస్సో సిఎన్‌జి ని రూ. 5.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఇది LXi మరియు VXi అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో CNG వెర్షన్ దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ.

S-ప్రెస్సో CNG యొక్క ఇంజిన్ 5300 ఆర్‌పిఎమ్ వద్ద 56.69 పిఎస్ పవర్ అందిస్తుంది. అయితే CNG మోడ్‌లో 3400 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 82.1 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో CNG దాదాపుగా 32.73 కిమీ/కేజీ పరిధిని అందిస్తుంది.

స్కోడా కుషాక్ యానివెర్సరీ ఎడిషన్:
స్కోడా కంపెనీ ఇటీవల తన 'కుషాక్ యానివెర్సరీ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 15.59 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా చాలా వరకు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి. అయితే ఇందులోని స్టీరింగ్ వీల్‌పై 'యానివర్సరీ ఎడిషన్' బ్యాడ్జ్, కొత్త డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్లు, కొత్త కాంట్రాస్ట్ స్టిచింగ్ మరియు క్రోమ్ అప్లిక్ వంటి వాటిని ప్రత్యేకంగా చూడవచ్చు. ఇంజిన్ మరియు పర్ఫామెన్స్ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

నిస్సాన్ కొత్త కార్లు:
నిస్సాన్ కంపెనీ ఇటీవల ఒకేసారి మూడు SUV లను ఆవిష్కరించింది. అవి నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail), నిస్సాన్ కష్కాయ్ (Nissan Qashqai) మరియు నిస్సాన్ జూక్ (Nissan Juke). త్వరలోనే ఎక్స్-ట్రైల్ మరియు కష్కాయ్ ఎస్‌యువిలను టెస్టింగ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే టెస్టింగ్ పూర్తయిన తరువాత నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కంపెనీ యొక్క మొదటి ఎస్‌యువిగా గ్లోబల్ మార్కెట్లో విక్రయించబడుతుంది. ఆ తరువాత కష్కాయ్ మరియు జూక్ విక్రయించబడతాయి.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail) 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్లను పొందే అవకాశం ఉంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త SUV దేశీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

నిస్సాన్ కష్కాయ్ ఎస్‌యువి 12V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటారు సహాయంతో మరియు CVT లేదా 6-స్పీడ్ మాన్యువల్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ మార్కెట్లో విడుదలైన తరువాత విడుదలవుతుంది. ఇది జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

నిస్సాన్ జూక్ 1.0 లీటర్ 3-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. కావున 115 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 10.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ప్యాడిల్ షిఫ్టర్ పొందుతుంది. ఈ కొత్త SUV భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనేది కొంత సందేహం.


Click it and Unblock the Notifications








