కొత్త తరం 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ విడుదల; ధర కేవలం రూ.55 లక్షలు మాత్రమే..!
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తమ కొత్త తరం 2022 సి-క్లాస్ (2022 Mercedes C-Class) సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ధరలు రూ. 55 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. భారత మార్కెట్లో కొత్త సి-క్లాస్ సెడాన్ మూడు వేరియంట్లలో సి 200, సి 220డి మరియు సి 300డి అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:
2022 మెర్సిడెస్ సి-క్లాస్ సి 200 - రూ.55 లక్షలు
2022 మెర్సిడెస్ సి-క్లాస్ సి 220డి - రూ.56 లక్షలు
2022 మెర్సిడెస్ సి-క్లాస్ సి 300డి - రూ.61 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

పైన పేర్కొన్న మూడు వేరియంట్లలో C 200 వేరియంట్ మాత్రమే పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులోని C 220d మరియు C 300d వేరియంట్లు మాత్రం కేవలం డీజిల్ ఇంజన్‌తోనే లభిస్తాయి. మునుపటి తరం సి-క్లాస్ సెడాన్‌తో పోలిస్తే, ఈ కొత్త 2022 మోడల్ లో కంపెనీ పలు మార్పులు చేర్పులు చేసింది. కంపెనీ ఈ కారును తమ ప్రీమియం ఎస్-క్లాస్ సెడాన్ ఆధారంగా తయారు చేసింది మరియు ఇందులో ఆఫర్ చేస్తున్న ఫీచర్లను బట్టి, మెర్సిడెస్ బెంజ్ ఈ కారును 'బేబీ S-క్లాస్' గా పిలుస్తుంది.

కొత్త 2022 C-క్లాస్ డిజైన్‌ను పెద్ద S-క్లాస్ లిమోసిన్ నుండి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ కారు ముందు భాగంలో గ్రిల్‌కి పక్కగా ఉండే సొగసైన ఎల్ఈడి హెడ్‌లైట్‌లు, మధ్య భాగంలో పెద్ద మెర్సిడెస్ బెంజ్ బ్యాడ్జ్ ఉంటాయి. అలాగే, ఇందులోని సి 300డి వేరియంట్‌లోని గ్రిల్ AMG-లైన్ వెర్షన్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇందులో చాలా చిన్న మెర్సిడెస్ బ్యాడ్జ్‌లను కలిగి ఉంటుంది. కొత్త సి 300డి మరింత అగ్రెసివ్ గా ఉండే ఫ్రంట్ బంపర్‌ను కూడా కలిగి ఉంటుంది.

సైడ్ డిజైన్‌ను గమనిస్తే, కొత్త సి 200 పెట్రోల్ మోడల్ మరియు సి 220డి డీజిల్ మోడళ్లు రెండూ కూడా 17- ఇంచ్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉండగా, సి 300డి 18 ఇంచ్ AMG స్టైల్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొత్త 2022 సి-క్లాస్ ఇంటీయర్లను గమనిస్తే, ఇందులో S-క్లాస్ క్యాబిన్ అనుభూతిని అందించే ఇంటీరియర్ థీమ్ కనిపిస్తాయి.

ఇంటీరియర్ ఫీచర్లలో ప్రధానంగా ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 12.3 ఇంచ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు లేటెస్ట్ MBUX సెటప్‌తో కూడిన 11.9 ఇంచ్ పరిమాణంలో నిలువుగా అమర్చబడిన ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇంకా ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్త సి 200 మరియు సి 220డి వేరియంట్లు సియెన్నా బ్రౌన్, బ్లాక్ మరియు మకియాటో బీజ్ అప్‌హోలెస్ట్రీతో లభిస్తుండగా, సి 300డి వేరియంట్ మాత్రం బ్లాక్ లేదా సియెన్నా బ్రౌన్/బ్లాక్ డ్యూయెల్ టోన్ అప్‌హోలెస్ట్రీతో లభిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సి 200 మరియు సి 220డి వేరియంట్లను కంపెనీ ఆరు విభిన్న కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. వీటిలో సలాటిన్ గ్రే, మొజావే సిల్వర్, హై-టెక్ సిల్వర్, మాన్యుఫాక్తుర్ ఒపలైట్ వైట్, కావాన్‌సైట్ బ్లూ మరియు అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా, సి 300డి వేరియంట్ మాత్రం మాన్యుఫాక్టూర్ ఒపలైట్ వైట్, కావాన్‌సైట్ బ్లూ మరియు అబ్సిడియన్ బ్లాక్ అనే మూడు కలర్లలో మాత్రమే లభిస్తుంది.

ఈ కారులోని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్‌తో అటెన్షన్ అసిస్ట్, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్, యాక్టివ్ లేన్-కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ హైబీమ్ అసిస్ట్ మరియు యాంటీ విప్లాష్ వంటి అనేక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సెడాన్ 4,751mm పొడవు, 1,820mm వెడల్పు మరియు 1,438mm పొడవు ను 2,865mm వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది.

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త 2022 మోడల్ మెర్సిడెస్ బెంజ్ సి 200 వేరియంట్ 1.5-లీటర్ (1,496cc) టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడింది, ఇది 201bhp పవర్ ను మరియు 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 7.3 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది మరియు ఈ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 16.9 కిమీ మైలేజీని అందిస్తుంది.

ఇకపోతే, సి 220డి వేరియంట్ లో 2.0-లీటర్ (1,996cc) టర్బో డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 197bhp పవర్ ను మరియు 440Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.3 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇది లీటరుకు 23 కిమీ మైలేజీని అందిస్తుంది. కాగా, పవర్‌ఫుల్ సి 300డి వేరియంట్‌లోని అదే 1,996cc టర్బోడీజిల్ ఇంజన్ గరిష్టంగా 261.5 bhp శక్తిని మరియు 550Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇది లీటరుకు 20.37 కిమీ మైలేజీని అందిస్తుంది.


Click it and Unblock the Notifications