డీలర్ల వద్దకు చేరుకుంటున్న మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG).. డెలివరీలకు అంతా సిద్దం..!
మారుతి సుజుకి నుండి తాజాగా మార్కెట్లోకి వచ్చిన సరికొత్త సిఎన్‌జి మోడల్ స్విఫ్ట్ సిఎన్‌జి (Maruti Suzuki Swift CNG) ఇప్పుడు డీలర్ల వద్దకు చేరుకోవడం ప్రారంభించింది. కంపెనీ తమ స్విఫ్ట్ సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్‌ను ఆగస్ట్ 12వ తేదీన మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ఇప్పుడు ఈ సిఎన్‌జి కారును కస్టమర్లకు డెలివరీ చేసేందుకు మారుతి సుజుకి తమ డీలర్ల స్టాక్ యార్డులకు పంపిణీ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే, త్వరలోనే ఇది కస్టమర్లకు డెలివరీ చేయబడుతోందని తెలుస్తోంది.
Recommended Video
మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కారుని రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులో స్విఫ్ట్ సిఎన్‌జి విఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 7.77 లక్షలు కాగా, స్విఫ్ట్ సిఎన్‌జి జెడ్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 8.45 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మారుతి సుజుకి అందిస్తున్న ఇతర సిఎన్‌జి మోడళ్లతో పోలిస్తే, స్విఫ్ట్ సిఎన్‌జి కాస్తంత ఖరీదైనదిగా ఉంటుంది. అయినప్పటికీ, ఈ సిఎన్‌జి కార్లు అధిక మైలేజీనిస్తూ, తక్కువ రన్నింగ్ కాస్ట్ ను కలిగి ఉండి, దీర్ఘకాలంలో చాలా పొదుపుగా ఉంటాయి.

స్విఫ్ట్ సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్‌ను స్టాండర్డ్ మోడల్ నుండి వేరుగా ఉంచేందుకు కంపెనీ వీటిపై S-CNG బ్యాడ్జ్‌ని అంటిస్తుంది. అలాగే, ఈ కార్లకు కుడివైపున సిఎన్‌జి ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్ ఉంటుంది. ఈ రెండు మార్పులు మినహా ఈ సిఎన్‌జి వేరియంట్ స్టాండర్డ్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సిఎన్‌జి వేరియంట్ స్విఫ్ట్ కారులో సిఎన్‌జి ఫ్యూయెల్ ట్యాంక్ బూట్ స్పేస్‌లో అమర్చబడి ఉంటుంది. ఫలితంగా, స్టాండర్డ్ మోడల్ కన్నా ఈ సిఎన్‌జి మోడల్‌లో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది.

ఇతర సిఎన్‌జి కార్లలో మాదిరిగా కాకుండా, మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కారులోని సిఎన్‌జి ఫ్యూయెల్ ట్యాంక్ చాలా తక్కువగా ఉంచబడింది. ఫలితంగా, ఇది హ్యాచ్‌బ్యాక్ యొక్క గురుత్వాకర్షణ కేంద్రాన్ని కొద్దిగా మెరుగుపరుస్తుంది. అలాగే, ఈ కారులో స్పేర్ వీల్‌ను సులభంగా యాక్సెస్ చేయడం కోసం దానిని సిఎన్‌జి ట్యాంక్ ముందు భాగంలో ఉంచబడింది. ఈ సిఎన్‌జి మోడల్‌లో తుప్పు పట్టకుండా ఉండటానికి స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులను ఉపయోగించారు. అంతేకాకుండా, వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన వైరింగ్ జీన్‌ను ఉపయోగించారు మరియు సిఎన్‌జి ఇంధనాన్ని ఫిల్ చేస్తున్నప్పుడు ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా ఉండటానికి కంపెనీ ఓ మైక్రో స్విచ్‌ను కూడా ఈ కారులో ఇన్‌స్టాల్ చేసింది.

మారుతి సుజుకి అందిస్తున్న సిఎన్‌జి కార్లన్నీ కూడా నాణ్యమైన సిఎన్‌జి కన్వర్షన్ కిట్లను కలిగి ఉంటాయి. కంపెనీ ఈ టెక్నాలజీని ఎస్-సిఎన్‌జి అనే పేరుతో పిలుస్తుంది. మారుతి సుజుకి యొక్క అన్ని సిఎన్‌జి మోడళ్లు కూడా డ్యూయల్ ఇండిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్‌లు (ECU) మరియు ఉత్తమ పనితీరు మరియు మైలేజ్ కోసం వాంఛనీయ వాయు-ఇంధన నిష్పత్తిని అందించే ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి.

ఇక మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి యొక్క ఇంజన్ పనితీరును గమనిస్తే, ఇందులోని 1.2 లీటర్ కె-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి ఇంజన్ సిఎన్‌జి మోడ్ లో గరిష్టంగా 76.5 బిహెచ్‌పి శక్తిని మరియు 98.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. అయితే, ఇదే ఇంజన్ పెట్రోల్ మోడ్‌లో 89 పిఎస్ శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‌జి ఇంధనంతో ఇది కేజీకి 30.90 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది. కాగా, పెట్రోల్ వెర్షన్ స్విఫ్ట్ లీటరుకు 23.20 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి మోడల్ లో లభించే ఫీచర్ల విషయానికొస్తే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్లు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆసక్తిగల కస్టమర్లు ఈ సిఎన్‌జి స్విఫ్ట్ మోడల్ ను మారుతి సుజుకి అరెనా డీలర్‌షిప్ నుండి కానీ లేదా వెబ్‌సైట్ నుండి కానీ బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వారికి కంపెనీ ముందుగా డెలివరీ చేస్తుంది. అలాగే, మారుతి సుజుకి తమ కొత్త స్విఫ్ట్ సిఎన్‌జి కోసం ఓ ప్రత్యేకమైన నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. కొత్త స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అన్ని కలిపి ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ. 16,499 నుండే ప్రారంభమవుతుంది. అంటే ప్రతినెలా వినియోగదారులు పై మొత్తాన్ని చెల్లించడం ద్వారా స్విఫ్ట్ కారు కొంత కాలం పాటు లీజుకు తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








