ఈ నెలలో [2022 నవంబర్] దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త కార్లు.. పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి, గత నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్, మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి మరియు నిస్సాన్ కొత్త కార్లు విడుదలయ్యాయి. కాగా ఈ నెలలో (2022 నవంబర్) కూడా దేశీయ విఫణిలో విడుదల కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

జీప్ గ్రాండ్ చెరోకీ:
అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ కంపెనీ 'జీప్' (Jeep) దేశీయ విఫణిలో 'గ్రాండ్ చెరోకీ' ని ఈ నెల 11 న (2022 నవంబర్ 11) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త గ్రాండ్ చెరోకీ ఇప్పటికే గ్లోబెల్ మార్కెట్లో 5 సీటర్ మరియు 7 సీటర్ మోడల్స్ లో విక్రయిస్తోంది. కాగా భారతీయ మార్కెట్లో ఇది కేవలం 5 సీటర్ వేరియంట్ గా మాత్రమే విడుదలకానుంది.

జీప్ గ్రాండ్ చెరోకీ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్/సాండ్ మరియు స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇంజిన్ యొక్క పవర్ అవుట్‌పుట్స్ ఇంకా వెల్లడికాలేదు. అంతే కాకూండా ధరలు కూడా తెలియాల్సి ఉంది.

BYD అటో 3:
చైనా కార్ తయారీ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ SUV 'ఆటో 3' (Atto 3) ని ఇప్పటికే అధికారికంగా ఆవిష్కరించింది. కాగా ఈ ఎలక్ట్రిక్ SUV ని ఈ నెల 16 న లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది దేశీయ విఫణిలో రూ. 20 నుంచి రూ. 25 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త అటో 3 ఎలక్ట్రిక్ SUV పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ మరియు చిన్న 49.92kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఈ SUV గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్:
భారతీయ మార్కెట్లో 'టొయోట' (Toyota) కంపెనీ కొత్త 'హైక్రాస్' (Hycross) ఎమ్‌పివిని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం, 2022 నవంబర్ 25 న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనుంది. కాగా ఈ ఇన్నోవా హైక్రాస్ 2023 లో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 2.0 లీటర్ లేదా 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందే అవకాశం ఉంటుంది. ఇందులోని హైబ్రిడ్ ఇంజన్ కారణంగా ఇది ఖచ్చితంగా మంచి మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న దీని ఇంజిన్ 166 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా త్వరలోనే వెల్లడవుతుంది.

ప్రవైగ్ ఈవి ఎస్‌యువి:
EV స్టార్టప్ బ్రాండ్ ప్రవైగ్ భారత మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ SUV ని పరిచయం చేయడానికి సిద్దమైపోతోంది. ఇది ఈ నెల 25 న ఆవిష్కరించబడే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV కి సంబంధించిన చాలా వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 504 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని, కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఫోర్స్ గూర్ఖా 5 డోర్స్:
ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన ఫోర్స్ మోటార్స్ యొక్క గూర్ఖా రానున్న రోజుల్లో 5 డోర్స్ వెర్షన్ గా విడుదల కానుంది. ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ SUV కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్-గేట్ మౌంటెడ్ ల్యాడర్ మరియు స్పేర్ వీల్, ట్వీక్డ్ రియర్ బంపర్ మరియు రూఫ్ రాక్ వంటి విజువల్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.


Click it and Unblock the Notifications








