అప్పుడే 10,000 దాటిన 'Tiago EV' బుకింగ్స్.. మరో పదివేలమందికి ఆఫర్: త్వరపడండి
భారతీయ మార్కెట్లో 'టాటా మోటార్స్' (Tata Motors) ఇటీవల విడుదల చేసిన కొత్త 'టాటా టియాగో ఈవి' (Tata Tiago EV) కోసం నిన్నటి నుంచి (అక్టోబర్ 10) బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం ఒకే రోజులో అద్భుతమైన బుకింగ్స్ వచ్చేసాయి. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

టాటా మోటార్స్ తన టియాగో ఈవి కోసం బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగిందని కంపెనీ తెలిపింది. అయితే బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే ఎక్కువమంది కస్టమర్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించే సమయంలో కొన్ని సమస్యలు కూడా తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. చాలామంది కస్టమర్లు ఒకేసారి బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ విధంగా జరిగిందని కంపెనీ తెలిపింది.

కంపెనీ మొదట్లో అందించిన సమాచారం ప్రకారం, మొదట వెల్లడించిన ప్రారంభ ధరలు కేవలం 10,000 యూనిట్లకు మాత్రమే పరిమితం అని తెలిపింది. కానీ ఇప్పుడు ఈ ధరలను 20,000 మంది కస్టమర్లకు పెంచింది. కావున మరో 10,000 మంది కస్టమర్లు ప్రారంభ ధరకే కొత్త టియాగో ఈవి కొనుగోలు చేసుకోవచ్చు.

కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం మొదట్లో అందిన 10,000 యూనిట్ల బుకింగ్స్ లో 2,200 కంటే ఎక్కువ బుకింగ్స్ ఒక్క మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు తెలిపింది. అందులో కూడా ఎక్కువమంది టాప్ స్పెక్ వేరియంట్ అయిన XZ+ టెక్ లక్స్ వేరియంట్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఎక్కువమంది కస్టమర్లు టీల్ బ్లూ మరియు ప్రిస్టైన్ వైట్ టియాగో ఈవిలను బుక్ చేసుకుంటున్నట్లు కూడా సమాచారం.

కొత్త టాటా టియాగో ఈవి కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 21,000 చెల్లించి ఆన్లైన్ లో లేదా కంపెనీ యొక్క అధికారిక డీలర్షిప్ లో గానీ బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభమవుతాయి. అంతకంటే ముందు టెస్ట్ డ్రైవ్స్ డిసెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

కొత్త 'టాటా టియాగో ఈవి' మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్. వీటి ధరల విషయానికి వస్తే టియాగో ఈవి ప్రారంభ ధర రూ. రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

కొత్త టాటా టియాగో ఈవి రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. అవి 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ప్యాక్స్. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఇందులోని 24kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, టియాగో ఈవి 25 kW ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

టాటా టియాగో ఈవి ఫీచర్స్ పరంగా కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇతర టాటా మోటార్స్ వాహనాల మాదిరిగానే టియాగో ఈవి కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది, కావున ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి. కావున టాటా టియాగో ఈవి కొనుగోలుదారుల భద్రతకు ఏ లోటు ఉండదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తిరుగులేని రారాజు టాటా మోటార్స్ ఇప్పుడు మరింత సరసమైన ఎలక్ట్రిక్ కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేయడం వల్ల ఆ స్థానం మరింత పదిలమైంది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం ఒకే రోజులో 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన ఈ కారు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కావున రానున్న రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ కారు మరిన్ని ఎక్కువ బుకింగ్స్ పొందుతుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








