అప్పుడే 50,000 మాగ్నైట్ కార్లను ఉత్పత్తి చేసిన నిస్సాన్, 1,00,000 చేరుకున్న బుకింగ్స్!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) నుండి తాజాగా మార్కెట్లోకి వచ్చిన సరికొత్త ఉత్పత్తి నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite). కంపెనీ ఈ చిన్న ఎస్‌యూవీని డిసెంబర్ 2020 నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో జోరుగా అమ్ముడవుతోంది. నిస్సాన్ ఇండియా ఇప్పటి వరకూ 50,000 యూనిట్ల మాగ్నైట్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది.

ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే 1,00,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో తయారైన నిస్సాన్ మాగ్నైట్, పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అమ్ముడవుతోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చిన ఏడాది కాలంలోనే కంపెనీ దాని ఉత్పత్తి, అమ్మకాలు మరియు బుకింగ్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో నిస్సాన్ మాగ్నైట్ కంపెనీ యొక్క విజయవంతమైన మోడల్ గా నిలిచింది. కంపెనీ దీనిని 15 విదేశీ మార్కెట్లలో విక్రయిస్తుంది.

దేశంలో కోవిడ్-19 అవాంతరాలు మరియు సెమీ కండక్టర్ చిప్ కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, కంపెనీ వాటిని అధిగమించి మాగ్నైట్ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. మాగ్నైట్ రాకతో భారతదేశంలో నిస్సాన్ ఫేట్ కూడా మారిపోయింది. ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయినప్పటికీ, దానికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. మాగ్నైట్ కారణంగా భారతదేశంలో నిస్సాన్ బ్రాండ్ అమ్మకాలు కూడా పెరిగాయి. అంతేకాదు, ఈ మోడల్ కారణంగా దేశంలో నిస్సాన్ ఇండియా మార్కెట్ వాటా కూడా రెట్టింపు అయ్యింది.

నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం దాని స్పోర్టీ డిజైన్ మరియు సరమైన ధర. విడుదల సమయంలో కంపెనీ ఈ కారును కేవలం రూ.5.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరకే విడుదల చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ XE (బేస్), XL (మిడ్), XV (హై) మరియు XV (ప్రీమియం) అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

మాగ్నైట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తుండగా, 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్‌ను మరియు 152 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

ఇకపోతే, ఇందులోని 1.0 లీటర్ న్యాచురల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం, మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 5.76 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి రూ. 9.98 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని రెనో ట్రైబర్ ఎమ్‌పివిని నిర్మించిన CMF-A+ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు. సేఫ్టీలో కూడా ఈ చిన్న కారు శభాష్ అనిపించుకుంది. ఈ కారు కోసం ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో, నిస్సాన్ మాగ్నైట్ కు 5 స్టార్లకు గానూ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకొని, భారతదేశంలో ఓ సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది.

మాగ్నైట్ కారులో లభించే సేఫ్టీ ఫీచర్ల పరిశీలిస్తే, కంపెనీ ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు స్టాండర్డ్ గా లభిస్తాయి. అదనంగా, ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

నిస్సాన్ సర్కిల్ ప్రోగ్రామ్ (Nissan Circle Program)..
నిస్సాన్ ఇండియా తమ వినియోగదారుల కోసం నిస్సాన్ సర్కిల్ ప్రోగ్రామ్ (Nissan Circle Program) పేరిట ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రోగ్రామ్ కింద కంపెనీ తన కస్టమర్లకు రివార్డ్ పాయింట్లను సంపాదించుకునే అవకాశంతో పాటు ప్రత్యేకమైన ఆఫర్‌లను కూడా అందించనుంది. నిస్సాన్ సర్కిల్ ప్రోగ్రామ్ కింద కస్టమర్స్ సంపాదించుకునే రివార్డ్ పాయింట్లను పేటీఎమ్ క్యాష్‌గా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఈ నగదుని కస్టమర్ కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి ఫుడ్, ట్రావెల్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈ ప్రత్యేక కార్యక్రమానని అందుబాటులోకి తెచ్చింది. నిస్సాన్ ప్రారంభించిన ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా ఈ బ్రాండ్ తమ కస్టమర్లతో తమ సంబధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications








