మాగ్నైట్ కస్టమర్లకు షాక్.. రూ.30,500 మేర పెరిగిన ధరలు.. రూ.5.84 లక్షలకు చేరుకున్న ప్రారంభ ధర
జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ (Nissan), భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ (Magnite) ఎస్‌యూవీ ధరలను భారీగా పెంచేసింది. ఏడాది క్రితం కేవలం రూ.5.49 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో లభించిన ఈ కారు ధరలు, ప్రస్తుతం రూ.5.84 లక్షల నుండి ప్రారంభం (బేస్ XE వేరియంట్ కోసం) అవుతున్నాయి. ఏప్రిల్ 2022 నెలలో నిస్సాన్ మాగ్నైట్ ధరలను రూ.30,500 వరకూ పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ధరల పెంపు తర్వాత టాప్-ఎండ్ XV ప్రీమియం టర్బో సివిటి వేరియంట్ ధర రూ. 9.99 లక్షలకు చేరుకుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో కూడిన 'XL' వేరియంట్ అత్యధిక ధర పెంపును అందుకుంది. ఇంతకుముందు, ఈ మోడల్ ధర రూ. 8.56 లక్షలు కాగా, రూ.30,500 ధరల పెంపు అనంతరం దీని ధర రూ. 8.86 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చేరుకుంది. అలాగే, ఇందులో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో కూడిన 'XV ప్రీమియం' వేరియంట్ అత్యల్ప ధర పెంపును అందుకుంది. ఈ మోడల్ ధరలను రూ. 1,999 మేర పెరిగి, రూ. 9.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చేరుకుంది.

నిస్సాన్ మాగ్నైట్‌లో వేరియంట్ల వారీగా పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
| Nissan Magnite | New Price | Old Price | Difference |
| XE | ₹5,84,999 | ₹5,76,500 | ₹8,499 |
| XL | ₹6,76,499 | ₹6,52,500 | ₹23,999 |
| XV | ₹7,29,000 | ₹7,14,000 | ₹15,000 |
| XL Turbo | ₹7,89,999 | ₹7,67,500 | ₹22,499 |
| XV Premium | ₹8,14,499 | ₹7,94,000 | ₹20,499 |
| XV Turbo | ₹8,43,999 | ₹8,29,000 | ₹14,999 |
| XL Turbo CVT | ₹8,86,999 | ₹8,56,500 | ₹30,499 |
| XV Premium Turbo | ₹9,23,899 | ₹9,09,000 | ₹14,899 |
| XV Turbo CVT | ₹9,25,999 | ₹9,18,000 | ₹7,999 |
| XV Premium Turbo CVT | ₹9,99,999 | ₹9,98,000 | ₹1,999 |

ఇదిలా ఉంటే, నిస్సాన్ ఇండియా గత సంవత్సరం దేశీయ మార్కెట్లో తమ మాగ్నైట్ ఎస్‌యూవీని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 50,000 యూనిట్లను తయారు చేసినట్లు ప్రకటించింది. భారతదేశంలో తయారైన మాగ్నైట్ కారును కంపెనీ 15 విదేశీ మార్కెట్లలో కూడా విక్రయిస్తుంది. భారత మార్కెట్లో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం కంపెనీ 1 లక్ష కంటే ఎక్కువ బుకింగ్‌లను కూడా అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. అంటే, ఈ ఎస్‌యూవీ డెలివరీ కోసం ఇంకా దాదాపు 50 వేల మందికి పైగా కస్టమర్లు వేచి ఉన్నట్లు తెలుస్తోంది.

మాగ్నైట్ విషయానికి వస్తే, ఈ సబ్ 4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, భారతదేశంలోని నిస్సాన్ బ్రాండ్‌కు ఓ గేమ్-ఛేంజర్ మోడల్‌గా నిలిచింది. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో మాదిరిగానే నిస్సాన్ కూడా భారత మార్కెట్లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్న సమయంలో, మాగ్నైట్ మార్కెట్లోకి వచ్చి మిరాకిల్ చేసింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక అమ్మకాలతో కంపెనీకి కాసుల వర్షం కురిపిస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ విజయానికి ప్రధాన కారణం దాని స్పోర్టీ డిజైన్ మరియు సరమైన ధర.

ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ XE (బేస్), XL (మిడ్), XV (హై) మరియు XV (ప్రీమియం) అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్‌ను మరియు 152 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

టర్బో పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇది లీటరుకు 20 కిమీ మైలేజీని మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లీటరుకు 17.7 కిమీ మైలేజీని అందిస్తుంది. ఇకపోతే, నిస్సాన్ మాగ్నైట్ యొక్క 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది మరియు లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

రెనో ట్రైబర్ ఎమ్‌పివిని నిర్మించిన CMF-A+ ప్లాట్‌ఫారమ్‌పైనే నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా తయారు చేశారు. ఈ చిన్న కారు కోసం ఇటీవల నిర్వహించిన ఏషియన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో, నిస్సాన్ మాగ్నైట్ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుని, ఈ విభాగంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు, 360 డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

నిస్సాన్ మాగ్నైట్ టాప్ ఎండ్ వేరియంట్లలో 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, డోర్లపై సిల్వర్ క్లాడింగ్, కప్‌హోల్డర్‌లతో కూడిన వెనుక సీటు ఆర్మ్‌రెస్ట్‌లు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్-బిల్ట్ నావిగేషన్, వైర్‌లెస్ మిర్రర్ లింక్ మరియు వీడియో ప్లేతో కూడిన 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, పవర్ బూట్, రియర్ విండో వైపర్ మరియు డీఫాగర్ మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








