భారత్‌లో నిస్సాన్ (Nissan) కొత్త కార్పోరేట్ ఆఫీస్ ఓపెన్.. ఈ జపనీస్ బ్రాండ్ దశ తిరగనుందా?
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా (Nissan Motor India), చాలా కాలంగా భారతదేశంలో ఓ స్థిరమైన బ్రాండ్ గా నిలదొక్కుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న సంగతి మనకు తెలిసినదే. ప్రస్తుతం, ఈ బ్రాండ్ భారతదేశంలో మాగ్నైట్ మరియు కిక్స్ అనే రెండు కార్లను మాత్రమే విక్రయిస్తోంది. వీటిలో కిక్స్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, మాగ్నైట్ అమ్మకాలు మాత్రం సప్లయ్ కి మించి సాగుతున్నాయి. అయితే, రానున్న రోజుల్లో భారత్‌లో నిస్సాన్ భవితవ్యం పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, ఈ జపనీస్ బ్రాండ్ ఇప్పుడు భారతదేశంలో తమ కొత్త కార్పోరేట్ హెడ్‌క్వార్టర్స్ ను ప్రారంభించడమే.

భారతదేశంలోని గురుగ్రామ్ లో నిస్సాన్ ఇండియా తన కొత్త కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని (Nissan Corporate Headquarters) ను ప్రారంభించింది. గురుగ్రామ్‌లో ఉన్న నిస్సాన్ ఇండియా యొక్క కొత్త కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ సేల్స్, మార్కెటింగ్, ఆఫ్టర్‌సేల్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ మరియు కార్పోరేట్ కమ్యూనికేషన్‌లతో సహా కీలకమైన విధులను నిర్వహిస్తుంది. భారతదేశంలో ఇటీవలే తమ చవక కార్ బ్రాండ్ డాట్సన్ ను నిలిపివేసిన తర్వాత, నిస్సాన్ ఇండియా నుండి ఇది చాలా పెద్ద సానుకూల నిర్ణయంగా తెలుస్తోంది మరియు ఇది భారత్‌లో నిస్సాన్ బ్రాండ్ పై భారీ అంచనాలను పెంచుతోంది.

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జపాన్‌లోని నిస్సాన్ మోటార్ కో లిమిటెడ్ యొక్క భారతీయ అనుబంధ సంస్థగా 2005లో స్థాపించబడింది. దాని భారతీయ విభాగంగా, నిస్సాన్ ఇండియా భారతీయ మార్కెట్లో అన్ని కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. నిస్సాన్ 2005లో తమ అద్భుతమైన ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail) ఎస్‌యూవీని ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తమ వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన నిస్సాన్ టియానా (Nissan Teana) ప్రీమియం సెడాన్ సెగ్మెంట్ లో గట్టి పోటీదారుగా నిలిచింది.

నిస్సాన్ ఇండియా తన భారత ప్రయాణంలో GT-R మరియు 370Z వంటి కొన్ని పాపులర్ స్పోర్ట్స్ కార్లను కూడా ఇక్కడి మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ ప్రీమియం కార్లు అమ్మకాల పరంగా ఆశించిన ఫలితాలను చూపకపోవడం మరియు అధిక దిగుమతి సుంఖాల కారణంగా ఈ ఇంపోర్టెడ్ కార్ల ధరలు కూడా అధికంగా ఉండటంతో ఇవి మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి. ఆ తర్వాతి కాలంలో నిస్సాన్ బ్రాండ్ నుండి నిస్సాన్ మైక్రా, ఎవాలియా, సన్నీ, టెర్రానో మొదలైన మోడళ్లు వచ్చాయి. అయితే, ఇవి కూడా మార్కెట్లో మంచి ఆదరణను నోచుకోలేకపోయాయి.

నిస్సాన్ తమ గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా, భారత్ వంటి బడ్జెట్ కార్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, ఐకానిక్ బడ్జెట్-ఫ్రెండ్లీ బ్రాండ్ డాట్సన్ (Datsun) 2014లో భారతదేశం వేదికగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ బ్రాండ్ నుండి వచ్చిన డాట్సన్ గో అండ్ డాట్సన్ గో+ కార్లు మొదట్లో మంచి పనితీరును చూపించినప్పటికీ, క్రమంగా వీటికి డిమాండ్ మందగించింది. డాట్సన్ లైనప్ ను విస్తరిస్తూ ఈ బ్రాండ్ రెడి-గో (Redi-Go) పేరుతో ఓ అధునాతన హ్యాచ్‌బ్యాక్ ను 2016లో పరిచయం చేయబడింది. అమ్మకాల పరంగా కూడా ఇది మంచి పనితీరు కనబరిచింది. అయినప్పటికీ, ఇది భారతీయ మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.

ఈ నేపథ్యంలో, నిస్సాన్ తమ డాట్సన్ బ్రాండ్ ను భారతదేశంలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది మరియు ఈ బ్రాండ్ అమ్మకాలు కూడా దాదాపుగా వెంటనే ఆగిపోయాయి. నిస్సాన్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో మాగ్నైట్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ, కిక్స్ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు లెజెండరీ నిస్సాన్ GT-R స్పోర్ట్స్ (ఇంపోర్టెడ్) కార్లను మాత్రమే విక్రయిస్తోంది.

భారతదేశంలో నిస్సాన్ ఇండియా యొక్క 17 ఏళ్ల ప్రయాణాన్ని చూస్తే, ఇది ఈ బ్రాండ్ కు ఓ వినాశకరమైన ముగింపులా కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడి మార్కెట్లో కొత్త మోడళ్లను ప్రారంభించడం ద్వారా కోల్పోయిన తన పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని కంపెనీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో నిస్సాన్ మరియు రెనో సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒరగడమ్ ప్లాంట్ ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. ఈ ప్లాంట్లో నిస్సాన్ మాగ్నైట్, నిస్సాన్ కిక్స్, రెనో క్విడ్ మరియు రెనో కైగర్ వంటి కార్లు ఉత్పత్తి అవుతున్నాయి.

కాగా, ఇప్పుడు నిస్సాన్ గురుగ్రామ్‌లో ఓ కొత్త కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ ను ప్రారంభించడాన్ని చూస్తుంటే, నిస్సాన్ ఇండియాకు మంచి రోజులు రానున్నాయని తెలుస్తోంది. ఇది వరల్డ్‌మార్క్ గురుగ్రామ్‌లో ఉంది, అక్కడ ఇది కొత్త అభివృద్ధి చెందుతున్న కమర్షియల్ అండ్ లీజర్ హబ్ గా ఉంది. కొత్త కార్పొరేట్ ప్రధాన కార్యాలయం సౌకర్యవంతమైన వర్క్‌స్టేషన్‌లను కలిగి ఉంది, ఇది వినూత్న పర్యావరణ వ్యవస్థను నడపడానికి సహాయపడుతుంది. ఇది నిస్సాన్ ఇండియా యొక్క ఇతర సౌకర్యాలతో కమ్యూనికేట్ చేయడానికి హై-టెక్ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను కూడా కలిగి ఉంది.

ఈ కార్పోరేట్ హెడ్‌క్వార్టర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోర్రెస్ మాట్లాడుతూ "ఈ కొత్త కార్యాలయం సానుకూలత, ఆవిష్కరణ మరియు జట్టు కృషితో కూడిన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. నిస్సాన్ ఇండియా యొక్క కొత్త కార్యాలయం మొదటగా మన ప్రజల తత్వశాస్త్రంపై నిర్మాణాన్ని కొనసాగిస్తుంది మరియు మా ఉద్యోగుల యొక్క ఆవిష్కరణలు మరియు ఆలోచనలను ప్రోత్సహించేలా ఉంటుంది" అని అన్నారు.


Click it and Unblock the Notifications








