రష్యాలో ఆస్తులన్నీ ఒక్క యూరోకి అమ్మేసిన నిస్సాన్.. కారణం ఏమిటంటే?
వాహన తయారీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న జపనీస్ కంపెనీ 'నిస్సాన్' (Nissan) ఇప్పుడు రష్యాలో తన కార్యకలాపాను నిలిపివేయడానికి సిద్ధమైపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ తన రష్యాలోని మొత్తం వ్యాపారాన్ని NAMI అనే ప్రభుత్వ యాజమాన్య సంస్థకు విక్రయించింది. ఇంతకీ నిస్సాన్ కంపెనీ రష్యా నుంచి నిష్క్రమించడానికి కారణం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిస్సాన్ కంపెనీ రష్యాలో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్న సందర్భంగా కంపెనీ యొక్క మొత్తం వ్యాపారాలను కేవలం 1 యూరో లేదా సుమారు $0.97 కి NAMI సంస్థకు విక్రయిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో కంపెనీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

రష్యాలో తన వ్యాపారం నిలిపివేస్తే దాదాపు $687 మిలియన్ల నష్టాన్ని కంపెనీ చవి చూడాల్సి వస్తుంది. ఇది అక్కడి ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం తప్పకుండా కొంత మేర ఉంటుంది. అయితే కంపెనీ రష్యా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రకారం, కంపెనీ యొక్క తన 2,000 మంది ఉద్యోగులకు 12 నెలల ఉద్యోగ భద్రతను అందిస్తుంది. ఇదే ఒప్పందం ప్రకారం కంపెనీ మరో ఆరు సంవత్సరాల్లో తిరిగి తన ఆస్తులను కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు నిస్సాన్ మోటార్ సీఈఓ మకోటో ఉచిడా తెలిపారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారంగా తమ పూర్తి సహకారాలను అందించిన రష్యా భాగస్వాములకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ప్రస్తుతం కొన్ని క్లిష్టమైన పరిస్థుతుల వల్ల నిలిపివేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం తరువాత రష్యాపైన అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా నష్టాల బాట పట్టాయి. ఇందులో భాగంగానే నిస్సాన్ దేశంలోని దాని ఉత్పత్తి సౌకర్యాలను నిలిపివేయవలసి వచ్చింది. ఇది కంపెనీకి ఎక్కువ నష్టాన్ని కలిగించింది.

నిజానికి కంపెనీ ఆస్తులను విక్రయించడం ద్వారా నిస్సాన్ రష్యా మార్కెట్‌ను విడిచిపెడితే భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత కంపెనీ 2022 మార్చి నుండి రష్యన్ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసే దశకు చేరిపోయింది.

ఇదిలా ఉండగా నిస్సాన్ మాత్రమే కాకుండా మరో జపనీస్ కార్ తయారీదారు అయిన మిత్సుబిషి కూడా రష్యన్ మార్కెట్ నుండి నిష్క్రమించాలని ఆలోచిస్తోంది. అయితే ఈ విషయాన్ని మిత్సుబిషి అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ అనుకున్నట్లు రష్యా మార్కెట్ వదిలివేస్తే వాటి మధ్య ఉన్న సంబంధంలో పెద్ద మార్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.

నిస్సాన్ కంపెనీ రెనాల్ట్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. మొత్తం మీద కంపెనీ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని నిస్సాన్ తెలిపింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు తెలుసు. ఈ ప్రభావం వాహన తయారీ సంస్థల మీద కూడా పడింది. ఈ కారణంగానే నిస్సాన్ కంపెనీ తన వ్యాపారాలను రష్యాలో నిలిపివేసింది. అయితే రానున్న రోజుల్లో కంపెనీ దీనిపైనా ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటుందా.. లేదా అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది. అప్పటివరకు దీనికి సంబంధించిన అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








