వెనుక సీటులో కూర్చునే వారికి సీట్ బెల్టులు, అలారమ్ తప్పనిసరి.. త్వరలో మార్గదర్శకాలు: నితిన్ గడ్కరీ
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ వెనుక సీటులో కూర్చుని ప్రయాణిస్తూ, సీట్ బెల్టు ధరించని కారణంగా చనిపోయారన్న వార్తల నేపథ్యంలో, ఇప్పుడు ప్రభూత్వం కూడా సీట్ బెల్టు నిబంధలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ హై-ప్రొఫైల్ కార్ యాక్సిడెంట్ నేపథ్యంలో, ఇకపై కార్లలో ఏ సీటులో కూర్చున్న వారైనా సరే తప్పనిసరిగా సీటు బెల్టు ధరించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
Recommended Video
ఇటీవలి కాలంలో భారతదేశంలో రోడ్డు భద్రత విషయంలో నియమాలు చాలా కఠినంగా మారుతున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై భారీ జరిమానాలు మరియు చట్టపరమైన శిక్షలు విధించబడుతున్నాయి. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ఇప్పటికీ సీట్‌బెల్ట్‌లను ధరించడం తప్పనిసరి కాదు, కాబట్టి చాలామంది సీట్‌బెల్ట్‌లను ధరించరు. అనేక మెట్రోపాలిటన్ నగరాలు ముందు కూర్చున్న వారు సీటు బెల్ట్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి, కానీ వెనుక కూర్చున్న వారికి అలాంటి నియమం లేదు.

అయితే, సైరస్ మిస్త్రీ మరణంతో ప్రభుత్వం మేల్కొంది. ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. కార్లలో సీట్ బెల్టుల వాడకానికి సంబంధించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది. వాహన తయారీదారులు కూడా కార్లలో వెనుక సీట్లకు తప్పనిసరిగా త్రీ-పాయింట్ సీట్ బెల్టులను అమర్చాలని మరియు ప్రయాణీకులు వాటిని ధరించకపోతే నిరంతరాయంగా అలారం మ్రోగేలా అలారం సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖా మంత్రి నితిగ్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR) ప్రకారం, కారులో కూర్చున్నప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. సిఎమ్‌విఆర్ యొక్క రూల్ 138 (3) ప్రకారం, వాహనం కదులుతున్నప్పుడు "ముందు సీటులో కూర్చున్న వ్యక్తులు లేదా వెనుక సీట్లలో కూర్చున్న వ్యక్తులు తప్పనిసరిగా సీటు బెల్ట్‌లను ధరించాలి". సీటు బెల్ట్ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.1,000 జరిమానా విధించేలా ప్రభుత్వం మోటారు వాహనాల నిబంధనలలో ఒక నిబంధనను తెచ్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకులు సీట్ బెల్ట్‌లను ఉపయోగించడం వల్ల 25 శాతం మరణాలను నివారించవచ్చని, అంతేకాకుండా ఇది ముందు సీటులో ఉండే ప్రయాణీకులకు అదనపు గాయాలు కాకుండా లేదా వారు మరణించ కుండా ఉంచడంలో కూడా సహకరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. వెనుక సీటులో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రాణాంతకమైన గాయాలు కాకుండా చూసుకోవచ్చు. కారు ఢీకొన్న సందర్భంలో, వెనుక సీటులో ఉండే వారు ముందు సీటుతో లేదా డ్యాష్‌బోర్డ్‌తో ఢీకొనకుండా బకిల్ చేయడంలో ఇది సహాయపడుతుంది.

సీట్ బెల్టులు ధరించకపోతే భారీ జరిమానాలు
కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్ట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని నిబంధన ఇప్పటికే అమలులో ఉందని, అయితే ప్రజలు దానిని పాటించడం లేదని గడ్కరీ అన్నారు. ఇకపై కారులో వెనుక సీటులో కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని, అలా చేయనట్లయితే భారీ జరిమానాలు విధించబడుతాయని ఆయన హెచ్చరించారు. కారులో ముందు సీట్లలో కూర్చున్న వారు సీటు బెల్టు పెట్టుకుంటారని, అయితే వెనుక సీటులో కూర్చున్న వారు సీటు బెల్ట్‌ను విస్మరిస్తున్నారని, ఇది ప్రమాద సమయంలో ప్రాణాంతకంగా మారుతుందని గడ్కరీ అన్నారు.

వెనుక సీట్ల కోసం కూడా సీట్ బెల్ట్ రిమైండర్స్
ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న కార్లలో ఫ్రంట్ సీట్లకు మాత్రమే సీట్ బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి. ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణీకులు సీట్ బెల్టులు ధరించకపోతే, అవి ధరించే వరకూ కారులో అలారం మ్రోగుతూనే ఉంటుంది. అయితే, ఇవే కార్లలో వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకులు సీట్ బెల్టు ధరించకపోయినా అలారం మ్రోగదు. ఇకపై, కొత్తగా తయారయ్యే కార్లలో వెనుక సీట్లలో ఉన్న సీట్ బెల్టులకు కూడా అలారం (రియర్ సీట్ బెల్ట్ రిమైండర్) తప్పనిసరి కానుంది. అంటే, వెనుక సీట్లలో ఎవరైనా కూర్చుని, వారు సీట్ బెల్ట్ ధరించకపోతే, వారు సీట్ బెల్ట్ ధరించేంత వరకూ నిరంతరాయంగా అలారం మ్రోగుతూనే ఉంటుంది. ఇందుకోసం కార్ల కంపెనీలకు ఆదేశాలు ఇస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు.

6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా తప్పనిసరి
ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న కార్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం) మాత్రమే తప్పనిసరి చేయబడ్డాయి. అయితే, దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మరియు ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చడం వల్ల కారు తయారీ ఖర్చు మరియు దాని రిటైల్ ధర పెరుగుతుందన్న ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. కారు ధరల కన్నా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం మరింత ముఖ్యమని చెప్పారు. ఒక్కో ఎయిర్ బ్యాగ్ ఖరీదు కేవలం రూ.1000 మాత్రమే ఉంటుందని, కాబట్టి రూ.6,000 వేలతో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను సులువుగా అందించవ్చచని ఆయన అన్నారు. ఉత్పత్తి, డిమాండ్ పెరిగే కొద్దీ ఖర్చు క్రమంగా తగ్గుతుందని గడ్కరీ చెప్పారు.


Click it and Unblock the Notifications








