ఇకపై మీ బిఎస్6 పెట్రోల్ కారుకి కూడా సిఎన్‌జి కిట్ అమర్చుకోవచ్చు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం!
భారతదేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత డీజిల్ కార్ల తయారీ చాలా ఖరీదైన ప్రక్రియగా మారింది. దీంతో తయారీదారులు డీజిల్ కార్లను తయారు చేయడాన్ని పూర్తిగా నిలిపివేయడం లేదా వాటి ఉత్పత్తిని భారీగా తగ్గించడం చేశారు.
Recommended Video
ఇటీవలి కాలంలో డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సిఎన్‌జి కార్ల వినియోగం ఊపందుకుంది. డీజిల్ కార్ల ధరతో పోలిస్తే సిఎన్‌జి కార్ల ధర చాలా తక్కువగా ఉండటం, సిఎన్‌జి కార్లు అందించే మైలేజ్ ఎక్కువగా ఉండటం మరియు ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సిఎన్‌జి ఇంధన విరివిగా లభించడం మొదలైన అంశాలు కస్టమర్లను సిఎన్‌జి కార్లను కొనేలా ప్రోత్సహిస్తున్నాయి.

ప్రస్తుతం, మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ వంటి కంపెనీలు తమ కార్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లతో కూడిన వాహనాలను అందిస్తున్నాయి. తయారీదారులు తమ ఫ్యాక్టరీలలో అమర్చే ఈ సిఎన్‌జి కిట్‌లో ఎంతో నాణ్యమైనవి మరియు సరైన ప్రమాణాలకు లోబడి ఉంటాయి. అయితే, కస్టమర్లు కావాలనుకుంటే, బయటి మార్కెట్లో లభించే థర్డ్ పార్టీ సిఎన్‌జి కిట్‌లను కూడా తమ వాహనాలలో అమర్చుకోవచ్చు. కానీ, మొన్నటి వరకూ ఇలా వాహనాలలో థర్డ్ పార్టీ సిఎన్‌జి లేదా ఎల్‌పిజి కిట్‌లను అమర్చుకోవడానికి ప్రభుత్వ అనుమతి ఉండేది కాదు. కాగా, ఇప్పుడు ప్రభుత్వం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఒకవేళ మీరు కొత్త BS-6 (భారత్ స్టేజ్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణమైన) పెట్రోల్ కారుని నడుపుతున్నట్లయితే, ఇప్పుడు మీరు మీ కారులో CNG లేదా LPG కిట్‌ను అమర్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే BS-6 వాహనాల్లో కూడా ఈ తరహా కిట్‌లను అమర్చడానికి అనుమతిని ఇచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, BS-VI వాహనాల్లో CNG/LNG రెట్రోఫిట్‌మెంట్ కిట్‌ల ఏర్పాటును ఆమోదించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, 3.5 టన్నుల బరువున్న BS-VI పెట్రోల్ మరియు డీజిల్ కార్లలో CNG / LNG రెట్రోఫిట్‌మెంట్ కిట్‌లను అమర్చవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

పెట్రోల్ వాహనాలలో సిఎన్‌జి లేదా ఎల్‌పిజి రెట్రోఫిట్‌మెంట్ కోసం, సదరు వాహన యజమాని తన వాహనం రిజిస్టర్ అయిన RTO కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా అనుమతి పొందిన తర్వాత సదరు వాహన యజమాని తన పెట్రోల్ కారులో ఎలాంటి ఇబ్బంది లేకుండా థర్డ్ పార్టీ నుండి సిఎన్‌జి లేదా ఎల్‌పిజి కిట్‌ను అమర్చుకోవచ్చు. సిఎన్‌జి లేదా ఎల్‌పిజితో నడిచే వాహనాలు పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇతర శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల కంటే తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి.

కాబట్టి, సిఎన్‌జి ఇంధనం పర్యావరణ అనుకూల ఇంధనంగా పరిగణించబడుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సిఎన్‌జి ఇంధనంతో నడిచే వాహనాలు తక్కువ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, పర్టిక్యులేట్ మెటీరియల్ మరియు స్మోక్ (పొగ)ను విడుదల చేస్తాయి. కాబట్టి, పెట్రోల్ లేదా డీజిల్ వంటి ఇంధనాలతో పోలిస్తే, సిఎన్‌జి ఇంధన వలన పర్యావరణానికి చాలా తక్కువ మొత్తంలో మాత్రమే నష్టం కలుగుతుంది. పెట్రోల్, డీజిల్ ఇంధన ధరతో పోలిస్తే సిఎన్‌జి ఇంధన ధర తక్కువగా ఉంటుంది మరియు అది అందించే మైలేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సిఎన్‌జి కార్ల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. సిఎన్‌జి కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కార్ల తయారీ కంపెనీలు కూడా తమ ప్రోడక్ట్ లైనప్‌లో అధికంగా సిఎన్‌జి కార్లు ఉండేలా చూస్తున్నాయి. ఇప్పటికే, ఈ విభాగంలో మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ కంపెనీలు ఉన్నాయి. అయితే, ఇతర బ్రాండ్ కార్లలో కూడా సిఎన్‌జి కిట్‌లను అమర్చుకునే వెసలుబాటు ఉన్నప్పటికీ, సదరు కంపెనీలు మాత్రం ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ లను అందించడం లేదు.

ఈ నేపథ్యంలో, పెట్రోల్ తో నడిచే కార్లలో సిఎన్‌జి కిట్‌లను అమర్చాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. పెట్రోల్ కంటే సిఎన్‌జి పొదుపుగా ఉంటుంది కాబట్టి, పెట్రోల్‌తో నడిచే కారులో సిఎన్‌జి కిట్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, కారు రన్నింగ్ కాస్ట్‌లో భారీగా ఆదా చేసుకోవచ్చు. పెట్రోల్-ఆధారిత కార్లలో మాత్రమే సిఎన్‌జి కిట్ లను అమర్చుకోవడానికి అనుమతి ఉంటుంది మరియు డీజిల్ కార్లలో సిఎన్‌జి లేదా ఎల్‌పిజి కిట్‌లను అమర్చడం అసాధ్యం. పెట్రోల్ కారులో CNG కిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వాటి రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే సదరు మోడిఫైడ్ CNG కారు చెల్లుబాటు అవుతుంది. ఇందుకోసం ధరఖాస్తుదారులు ఆర్టీఓలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మీ కారులో సిఎన్‌జి కిట్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు, మీరు మీ కారు రిజిస్టర్ చేయబడిన స్థానిక RTO నుండి అనుమతి తీసుకోవాలి. దీని కోసం, మీరు కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), బీమా పాలసీ కాపీ, CNG/LPG కిట్ కోసం ఇన్వాయిస్ మరియు మీ KYCతో పాటు స్థానిక RTOకి ఒక ఫారమ్‌ను సమర్పించాలి. CNG కిట్ కోసం ఇచ్చిన దరఖాస్తులోని అన్ని పత్రాలను తనిఖీ చేసిన తర్వాత దరఖాస్తుదారునికి రసీదు ఇవ్వబడుతుంది. ఆ తర్వాత మీరు మీ కారులో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, మీరు కారు బీమా కంపెనీకి కూడా ఆ విషయాన్ని తెలియజేయాలి.

బీమా కంపెనీకి సమాచారం అందించేటప్పుడు మీరు మీ కారు యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇప్పటికే ఉన్న బీమా సర్టిఫికేట్ మరియు మీ స్వీయ-ధృవీకరించబడిన KYC కాపీని బీమా కంపెనీకి సమర్పించాలి. మీరు అందించిన సమాచారం ప్రకారం, బీమా కంపెనీ మీ వాహనానికి కొత్త బీమా సర్టిఫికేట్‌ను జారీ చేస్తుంది. మీరు కారులో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడంతో పాటు, కారు రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్‌లలో పైన పేర్కొన్న మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి. అలా చేయడంలో విఫలమైతే, ప్రమాద సమయంలో బీమా క్లెయిమ్‌ను చెల్లించడానికి బీమా కంపెనీ నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








