సేఫ్టీలో ఉత్తమ రేటింగ్ పొందిన కార్లు.. ధర రూ. 10 లక్షల కంటే తక్కువే
ధర ఎంత వున్నా ఆలోచించకుండా కొంతమంది తమకు నచ్చిన వాహనాలను కొనేస్తూ ఉంటారు. అయితే వాహనం కొనే ముందు దాని డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా అది భద్రత పరంగా ఎంతవరకు ప్రయాణికులను రక్షించగలదు అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తక్కువ ధర వద్ద లభించే కార్లలో కూడా సేఫ్టీ ఫీచర్స్ కావలసినన్ని అందుబాటులో ఉన్నాయి. కావున దేశీయ విఫణిలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే అత్యంత సురక్షితమైన వాహనాలను (టాటా పంచ్, నెక్సాన్, ఆల్ట్రోజ్, XUV 300, టాటా ఆల్ట్రోజ్) గురించి ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.. రండి.

టాటా పంచ్ (Tata Punch):
అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో టాటా పంచ్ అగ్ర స్థానంలో ఉంది. ఇది 20212 అక్టోబర్ నెలలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తూ ఉంది. టాటా పంచ్ అడల్స్ సేఫ్టీ టెస్ట్‌లో 17 పాయింట్లకు గానూ 16.45 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 40.89 సాధించి మొత్తం మీద సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది.
టాటా పంచ్ మైక్రో SUV డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ వంటివి పొందుతుంది. టాటా పంచ్ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 6 లక్షల నుంచి రూ. 9.54 లక్షల వరకు ఉన్నాయి (ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా).

హోండా జాజ్ (Honda Jazz):
హోండా జాజ్ కూడా భారతీయ మార్కెట్లో ఉన్న అత్యంత సురక్షితమైన వాహనం. ఇది వి, విఎక్స్ మరియు జెడ్ఎక్స్ అనే మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. దీని ధరలు రూ. 8.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 10.41 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంటాయి. ఇది అడల్స్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 13.89 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ 31.84 పాయింట్లు సాధించి మొత్తం మీద సేఫ్టీలో 5-స్టార్ట్ పొందింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 (Mahindra XUV 300):
మహీంద్రా కంపెనీ యొక్క ఎక్స్‌యూవీ 300 అనేది రూ. 10 లక్షల లోపు లభించే అత్యంత సురక్షితమైన కారు. దీని ధర రూ.8.41 లక్షల నుంచి రూ.14.07 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కారు అడల్ట్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 16.42 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 37.44 పాయింట్లు సాధించి మొత్తం మీద సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఆరు ఎయిర్ బ్యాగులు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ఏబీఎస్ విత్ ఈబిడి, ఐసోఫిక్స్ ఎంకరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. XUV 300 రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి.
టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz):
టాటా మోటార్స్ యొక్క ఆల్ట్రోజ్ కూడా దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన వాహనాల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 6.34 లక్షల నుంచి రూ. 10.25 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). సేఫ్టీ పరంగా టాటా ఆల్ట్రోజ్ 5-స్టార్ రేటింగ్ పొందింది. అడల్స్ సేఫ్టీలో ఆల్ట్రోజ్ 17 పాయింట్లకు గానూ 16.13 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 29 పాయింట్లు సాధించింది.
టాటా నెక్సాన్ (Tata Nexon):
సేఫ్టీ అంటేనే చాలామందికి గుర్తొచ్చే కారు టాటా మోటార్స్ యొక్క నెక్సాన్. ఇది అడల్స్ సేఫ్టీలో 17 పాయింట్లకు గానూ 16.06 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 49 పాయింట్లకు గానూ 25 పాయింట్లు సాధించింది. మొత్తం సేఫ్టీలో ఇది 5 స్టార్ రేటింగ్ పొందింది. నెక్సాన్ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 7.70 లక్షల నుంచి రూ. 14.18 లక్షల మధ్య ఉన్నాయి (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).


Click it and Unblock the Notifications








