కుషాక్ (Kushaq) ఎస్‌యూవీలో అప్పుడే ఓ వేరియంట్‌ను డిస్‌కంటిన్యూ చేసిన స్కోడా (Skoda)
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో నుండి తాజాగా భారత మార్కెట్లోకి వచ్చిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ స్కోడా కుషాక్ (Skoda Kushaq) లో కంపెనీ అప్పుడే ఓ వేరియంట్ ను డిస్‌కంటిన్యూ చేసింది. స్కోడా కుషాక్ స్టైల్ ట్రిమ్ లో కంపెనీ 2 ఎయిర్‌బ్యాగ్‌ల వేరియంట్ డిస్‌కంటిన్యూ చేసింది. దీంతో ఇప్పుడు స్టైల్ ట్రిమ్ కేవలం 6 ఎయిర్‌బ్యాగ్‌ల వేరియంట్ గా మాత్రమే అందుబాటులో ఉంది. స్కోడా కుషాక్ స్టైల్ 6 ఎయిర్‌బ్యాగ్స్ మోడల్ ను కంపెనీ గతేడాది నవంబర్‌లో ప్రవేశపెట్టింది.

ఆరు ఎయిర్‌బ్యాగ్ లు కలిగిన స్కోడా కుషాక్ స్టైల్ వేరియంట్ ధర 2 ఎయిర్‌బ్యాగ్‌ల మోడల్ ధర కంటే రూ. 40,000 ఎక్కువగా ఉంటుంది మరియు అదే సమయంలో, ఇది 2021 వెర్షన్ కంటే రూ. 70,000 ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అయితే, స్కోడా కుషాక్ యాక్టివ్ మరియు యాంబిషన్ వేరియంట్‌లను కంపెనీ ఇప్పటికీ 2 ఎయిర్‌బ్యాగ్‌లతో విక్రయిస్తోంది. సెమీ కండక్టర్ చిప్స్ కొరత కారణంగా కంపెనీ తమ కుషాక్ ఎస్‌యూవీలో ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ ఫీచర్‌ను తొలగించింది.

సెమీకండక్టర్ల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ జాక్ హోలిస్ తెలిపారు. కంపెనీ తన వెబ్‌సైట్‌ను కూడా అప్‌డేట్ చేసింది మరియు ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ స్థానంలో మాన్యువల్ సైడ్ మిర్రర్లను ఇన్‌స్టాల్ చేసింది. ఈ మార్పు వలన స్కోడా కుషాక్ ధరలు కూడా తగ్గాయి. ఇప్పుడు స్కోడా కుషాక్ స్టైల్ వేరియంట్‌పై రూ. 15,000 వరకూ తగ్గింపు లభిస్తోంది, అందులో ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ కి బదులుగా మ్యాన్యువల్ సైడ్ మిర్రర్స్ అందించడమే ఈ మార్పుకు కారణం.

ఈ ధరల తగ్గింపు 2022 మోడల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటీవలి జనవరి నాటికి స్కోడా కుషాక్ ధరలు రూ. 19,000 నుండి రూ. 29,000 వరకు పెరిగినందున కుషాక్ యొక్క స్టైల్ వేరియంట్‌పై మాత్రమే కంపెనీ తగ్గింపు అందిస్తోంది. కాగా, ఇందులోని యాంబిషన్ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు, కాబట్టి స్టైల్ మినహా, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇతర వేరియంట్‌లపై ఈ ధర తగ్గింపు ప్రయోజనాన్ని పొందలేరు.

ప్రస్తుతం, స్కోడా కుషాక్ యొక్క అన్ని వేరియంట్‌లు మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్‌లతో అందించబడుతున్నాయి. స్కోడా కుషాక్ మొత్తం 7 వేరియంట్లలో యాంబియంట్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 1.0 లీటర్ 3 సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన MQB-A0-IN డిజైన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కంపెనీ తమ స్కోడా కుషాక్‌ను తయారు చేసింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని కూడా ఇదే ప్లాట్‌ఫారమ్ పై తయారు చేశారు. ఈ ఎస్‌యూవీ తయారీలో ఉపయోగించే విడిభాగాలలో 95 శాతం భాగాలను స్థానికంగానే సేకరిస్తోంది. భవిష్యత్తులో దీనిని 100 శాతానికి పెంచాలని కంపెనీ యోచిస్తోంది.

స్కోడా కుషాక్ డిజైన్ విషయానికి వస్తే, ఈ కారు ముందు భాగంలో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉండే బోనెట్ వండి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే, వెనుక భాగంలో సన్నటి ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్పాయిల్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, పెద్ద రియర్ బంపర్, సైడ్‌లో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు పై భాగంలో సన్‌రూఫ్ వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.

కుషాక్ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, కుషాక్ టాప్-ఎండ్ వేరియంట్లలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. స్కోడా ఆటో ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో 60,000 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కుషాక్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ 20,000 కంటే ఎక్కువ యూనిట్లు బుక్ చేయబడ్డాయి.

భారత మార్కెట్లో కుషాక్ ఎస్‌యూవీని దాని పోటీ ధర మరియు సెగ్మెంట్‌లో కెల్లా అత్యుత్తమమైన ఫీచర్ల కారణంగా కస్టమర్లు దీనిని ఇష్టపడుతున్నారని స్కోడా తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో స్కోడా ఆటో తమ కుషాక్ ఎస్‌యూవీ ధరను రూ. 19,000 నుండి రూ. 29,000 వరకూ పెంచింది. ప్రస్తుతం మార్కెట్లో స్కోడా కుషాక్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.18.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








