కొత్త సంవత్సరం అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన Skoda.. పూర్తి వివరాలు
2022 వ సంవత్సరం మొదట నెల ముగిసింది. ఈ తరుణంలో ఆటోమొబైల్ కంపెనీలు వాటి అమ్మకాల నివేదికలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) 2022 జనవరి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్కోడా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 జనవరి నెలలో కంపెనీ యొక్క అమ్మకాలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీ 2022 జనవరిలో మొత్తం 3,009 యూనిట్ల వాహనాలను విడుదల చేసింది. గత ఏడాది 2021 జనవరి నెల కంటే కూడా ఇప్పుడు కంపెనీ యొక్క అమ్మకాలు 200 శాతం ఎక్కువ నమోదయ్యాయి.

నెలవారీ విక్రయాల పరంగా 2022 జనవరి నెల అమ్మకాలు కొంత తగ్గినట్లు తెలుస్తుంది. స్కోడా ఆటో 2021 డిసెంబర్ నెలలో మొత్తం 3,234 యూనిట్ల కార్లను విక్రయించింది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి స్కోడా కుషాక్ చాలావరకు దోహదపడింది. ఇది కాంపాక్ట్ SUV విభాగంలో కంపెనీ యొక్క మొదటి పోటీదారు మరియు భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.

స్కోడా ఆటో త్వరలోనే కొత్త స్కోడా స్లావియా సెడాన్ విడుదలచేయనుంది. కొత్త స్కోడా స్లావియా కూడా కంపెనీ యొక్క అమ్మకాలను మెరుగుపరచడానికి చాలావరకు దోహదపడుతుంది. అదే విధంగా ఇటీవల కాలంలో కంపెనీ కొత్త 2022 కొడియాక్ ను విడుదల చేసింది. స్కోడా కుషాక్ మాదిరిగానే స్కోడా స్లావియా సెడాన్ కూడా MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.

కొత్త స్కోడా స్లావియా సెడాన్ రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో మార్కెట్లోకి విడుదల కానుంది. ఇందులో మొదటిది 1.0-లీటర్, త్రీ-సిలిండర్ TSI పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.5-లీటర్, ఫోర్-సిలిండర్ TSI పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. అదే విధంగా స్కోడా కొడియాక్ మూడు ట్రిమ్ స్థాయిలలో వస్తుంది మరియు 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది. స్కోడా కొడియాక్ ప్రీమియం SUV విభాగంలోకి వస్తుంది కాబట్టి, ఈ కారు రూ. 34.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయబడింది.

స్కోడా కంపెనీ యొక్క అమ్మకాలను గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ.. కంపెనీ యొక్క అమ్మకాలు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కస్టమర్లు మా పైన ఉంచుకున్న నమ్మకం అన్నారు. అంతే కాకూండా 2022 లో ఇదే విధంగా ముందుకు వెళ్ళడానికి మరియు కస్టమర్లకు ఎప్పటికప్పుడు సరైన సేవలను అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు.

2022 కోడియాక్ ఫేస్‌లిఫ్ట్ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ల టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త SUV యొక్క అన్ని వేరియంట్లు కూడా స్టాండర్డ్‌గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతాయి. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

2022 స్కోడా కొడియాక్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని డ్యాష్‌బోర్డ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పోలి ఉంటుంది. అంతే కాకూండా స్కోడా యొక్క కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో కూడా ఉంది. ఇందులో మూడు వరుసల సీటింగ్ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.

కొత్త కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.
2022 స్కోడా కొడియాక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,697 మిమీ, వెడల్పు 1,882 మిమీ మరియు ఎత్తు 1,665 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2022 స్కోడా కొడియాక్ SUV కి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ దీని ధర ఆధారంగా ఫేస్‌లిఫ్టెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది దేశీయ మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








