అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలోకి కొత్త అతిధులు.. టైగన్ మరియు కుషాక్
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాహనాలకు డిమాండ్ బాగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందిస్తూ కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లుగా టాటా నెక్సాన్, ఆల్ట్రోజ్, మహీంద్రా XUV700 మొదలైనవి ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో రెండు కార్లు చేరాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరిన ఆ రెండు కార్లు 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) యొక్క 'టైగన్' (Taigun) మరియు స్కోడా (Skoda) కంపెనీ యొక్క 'కుషాక్' (Kushaq). ఇవి రెండు ఇప్పుడు గ్లోబల్ NCAP టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. అయితే అడల్ట్ సేఫ్టీలో మాత్రమే కాకుండా పిల్లల సేఫ్టీలోనూ ఇవి రెండూ 5 స్టార్ రేటింగ్ సాధించడం గమనార్హం.

నిజానికి కుషాక్ మరియు టైగన్ రెండూ కూడా అప్‌డేట్ చేయబడిన టెస్టింగ్ ప్రోటోకాల్ కింద పరీక్షించబడిన మొదటి కార్లు. ఇందులో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు గానూ 29.34 పాయింట్లు సాధించి 5 స్టార్ రేటింగ్ పొందగా, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో కూడా మంచి స్కోరింగ్ చేసింది. ఇందులో ఈ రెండు కార్లు 49 పాయింట్లకు గానూ 42 పాయింట్లు సాధించాయి.

ఈ రెండు కార్లలో డ్రైవర్లకు మరియు ప్రయాణీకులకు కూడా మంచి రక్షణ లభిస్తుందని నిర్దారించబడింది. ఇందులో తల మరియు మెడకు మంచి ప్రొటక్షన్ లభిస్తుంది. అంతే కాకుండా డ్రైవర్ యొక్క ఛాతీకి మరియు ప్రయాణికుల ఛాతీకి కూడా మంచి రక్షణ లభిస్తుంది.

కుషాక్ మరియు టైగన్ రెండు SUV లోనూ వెనుక సీట్లపై ISOFIX మౌంట్ పాయింట్లను అందించబడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఆధునిక కాలంలో ఈ రెండు SUV లు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కార్లుగా నిలిచాయి.

కుషాక్ మరియు టైగన్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన సందర్భంగా స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO 'పియూష్ అరోరా' మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ రెండు కార్లు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించడం చాలా సంతోషంగా ఉంది, భారతదేశంలో తయారు చేయబడిన MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ అద్భుతంగా ఉందన్నారు. కావున ఈ రెండు కార్లు ప్రయాణికులకు మంచి రక్షణ కల్పిస్తాయి.

క్రాష్ టెస్ట్ లో ఉపయోగించిన ఈ రెండు కార్లు రెండు-ఎయిర్‌బ్యాగ్ వెర్షన్‌లు. అయితే సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం ఆరు-ఎయిర్‌బ్యాగ్ వెర్షన్ ఉపయోగించబడింది.
గ్లోబల్ ఎన్‌సిఎపి సెక్రటరీ జనరల్ అలెజాండ్రో ఫురస్ మాట్లాడుతూ.. గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించడం చాలా అభినందనీయం. వాహన వినియోగదారులు యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకున్న స్కోడా మరియు వోక్స్‌వ్యాగన్ చొరవను మేము అభినందిస్తున్నామన్నారు.

కుషాక్ మరియు టైగన్ కేవలం సేఫ్టీలో మాత్రమే కాదు మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. అయితే స్కోడా కుషాక్ 1.0 లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. దీని ధర రూ. 11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఇక ఫోక్స్‌వ్యాగన్ టైగన్ విషయానికి వస్తే, ఇందులో కూడా రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఒకటి 1.0-లీటర్ TSI ఇంజన్ మరొకటి 1.5-లీటర్ TSI ఇంజన్. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. ధరల విషయానికి వస్తే ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రారంభ ధరలు రూ. 11.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో కుషాక్ మరియు టైగన్ స్థానం సంపాదించాయి. ఇది నిజంగానే హర్సిన్చాదగ్గ విషయం. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకుసాగుతున్న ఈ రెండు కార్లు సేఫ్టీలో మంచి రేటింగ్ పొందటం వల్ల మరిన్ని ఎక్కువ అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








