టాటా మోటార్స్ నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ ఇదే: పేరు 'టాటా కర్వ్' (Tata Curvv)
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) తన కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు 'టాటా కర్వ్' (Tata Curvv) ను అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారుకి అద్భుతమైన కూపే డిజైన్ అందించింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

టాటా మోటార్స్ ఈ కొత్త మరియు ఆధునిక ఎలక్ట్రిక్ కారును మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌ని అద్భుతమైన ప్రాక్టికాలిటీ మరియు పెద్ద క్యాబిన్ స్పేస్‌తో కంపెనీ పరిచయం చేసింది. ఇది మంచి పరిధిని కూడా అందించే అవకాశం ఉంది.

ఈ కొత్త 'టాటా కర్వ్' (Tata Curvv) భారతీయ మార్కెట్లో 2024 నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV స్పోర్టీ కూపే బాడీ స్టైల్‌తో రానుంది. ఈ స్టైల్ ఇంతకు ముందు హై-ఎండ్ లగ్జరీ సెగ్మెంట్ కార్లలో మాత్రమే కనిపించింది. అయితే ఇప్పుడు రానున్న ఈ కొత్త కారు ఆ డిజైన్ పొందుతుంది.

'టాటా కర్వ్' (Tata Curvv) ఆవిష్కరణ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మరియు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ MD 'శైలేష్ చంద్ర' మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అమితంగా పెరుగుతుంది. ఈ విభాగంలో తమ ఉనికిని చాటుకోవడానికి కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది, అన్నారు.

కొత్త 'టాటా కర్వ్' (Tata Curvv) అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, టాటా Curvv మిడ్-సైజ్ SUV పైన మరియు ప్రీమియం SUV సెగ్మెంట్ క్రింద ఉంచబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక పుల్ ఛార్జ్ తో దాదాపుగా400 నుంచి 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని, కంపెనీ తెలిపింది. టాటా Curvv వేగవంతమైన ఛార్జింగ్ తో పాటు వెహికల్-టు-వెహికల్ (V2V) మరియు వెహికల్-టు-లోడ్ (V2L) ఛార్జింగ్ రెండింటికీ మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ముందు భాగంలో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ వంటి వాటిని పొందుతుంది. ఇవి బోనెట్ క్రీజ్ మొత్తం వెడల్పులో కనిపిస్తాయి. అంతే కాకూండా అంచుల వద్ద ఉన్న ఓఆర్‌విఎమ్ (ORVM) ల వరకు ముందుకు సాగుతాయి. ప్రైమరీ హెడ్‌లైట్‌లు కారు బంపర్‌పై అమర్చబడి ఉంటాయి మరియు హెడ్‌లైట్ యూనిట్ ట్రైయాంగిల్ షెల్‌లో ఉంచబడుతుంది.

టాటా మరియు EV లోగోలు దాని వెనుక భాగంలో కనిపిస్తుంది. అంతే కాకుండా వంపు తిరిగిన విండ్‌షీల్డ్ మరియు సొగసైన రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌ను కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఆకర్షణను మరింత పెంచడంలో సహాయపడతాయి.

టాటా కర్వ్ లోపలి భాగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌లో రెండు డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇందులో ఒకటి డ్రైవర్ సమాచారం కోసం కాగా, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ కోసం ఉపయోగపడుతుంది. ఇందులోని టూ స్పోక్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్‌స్ కలిగి ఉండటమే కాకుండా ఇతర సిస్టమ్స్ కంట్రోల్ చేయడానికి కంట్రోల్ టచ్ ప్యానెల్ కూడా కనిపిస్తుంది.

టాటా మోటార్స్ యొక్క 'టాటా కర్వ్' ఎలక్ట్రిక్ SUV అనేది కంపెనీ యొక్క లేటెస్ట్ ఉత్పత్తి. ఆటో మొబైల్ రంగం విద్యుదీకరణ దిశగా సాగుతున్న సమయంలో టాటా మోటార్స్ కూడా ఈ దిశగా తన అడుగులను సాగిస్తోంది. భారతీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ ఆధునిక ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే భారతీయ మార్కెట్లోని ఎలక్ట్రిక్ కార్లకు భిన్నంగా ఉంటుంది.టాటా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే టాటా ప్రియులు ఈ టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇంకా కొంత కాలం వేచి ఉండక తప్పదు.


Click it and Unblock the Notifications








