Tata ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి గట్టి షాక్.. భారీగా పెరిగిన Nexon EV ధరలు
టాటా మోటార్స్ నుండి ఎలక్ట్రిక్ కారును కొనాలని చూస్తున్న కంపెనీ గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవలే విడుదల చేసిన టిగోర్ ఈవీ (Tata Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్ ఇప్పుడు తమ నెంబర్ వన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ధరను కూడా రూ.25,000 పెంచింది. నెక్సాన్ ఈవీ యొక్క అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ రూ. 25,000 వరకు పెంచింది. తాజా ధరల పెంపు అనంతరం మార్కెట్లో నెక్సాన్ ఈవీ ధరలు రూ. 14.54 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ కార్ల ధరల పెంపునకు గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఏది ఏమైనప్పటికీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా కమోడిటీ ధరలు వేగంగా పెరగడం మరియు అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ బలహీనపడటం వంటి కారణాల వలన భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనం నెక్సాన్ ఈవీ యొక్క ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ధరల పెంపు తర్వాత టాటా నెక్సాన్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 17.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది.

దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ మూడు వేరియంట్లలో (XM, XZ+, XZ+ Lux) లభిస్తోంది. వీటితో పాటుగా కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Dark Edition) ను కూడా పరిచయం చేసింది. ఈ డార్క్ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొత్తంగా నెక్సాన్ ఈవీ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
వాటి ధరల వివరాలు ఉన్నాయి:
టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ఎమ్ : రూ.14.54 లక్షలు
టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్+ : రూ.15.95 లక్షలు
టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్+ లగ్జరీ : రూ.16.95 లక్షలు
టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్+ : రూ.16.29 లక్షలు
టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్+ లగ్జరీ : రూ.17.15 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

కస్టమర్లు నెక్సాన్ ఈవీని కొనుగోలు చేసే రాష్ట్రం మరియు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆ రాష్ట్రం అందించే సబ్సిడీలను బట్టి ఆన్-రోడ్ ధరలు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోండి. టాటా నెక్సాన్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంగా ఉంది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించింది. గడచిన జనవరి నాటికి టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాలు 13,500 యూనిట్ల విక్రయాల మార్కును దాటిందని కంపెనీ తెలిపింది.

టాటా నెక్సాన్ ఈవీని కంపెనీ తొలిసారిగా జనవరి 2020 లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, టాటా ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్ లో వినియోగదారుల కోసం టిగోర్ ఈవీ (Tata Tigor EV), నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉండగా ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ఎక్స్‌ప్రెస్-టి (Tata Xpress-T EV) ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో టాటా మోటార్స్ మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

చిప్ కొరత, కోవిడ్-19 ను సైతం లెక్క చేయలేదు!
గత రెండేళ్లుగా దేశంలో సెమీకండక్టర్ చిప్ కొరత మరియు కోవిడ్-19 తెచ్చిన అవాంతరాలు ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ వాటన్నింటినీ అధిగమించి నెక్సాన్ ఈవీ విజయానికి బాటలు వేసింది. ఏప్రిల్ 2021 నాటికి కంపెనీ మొత్తం 4,000 యూనిట్ల టాటా నెక్సాన్ ఈవీ కార్లను విక్రయించింది. ఆ తర్వాత తొమ్మిది నెలల్లో, ఈ ఎలక్ట్రిక్ కారు కోసం భారతదేశం అంతటా ఉన్న టాటా షోరూమ్‌ల నుండి ప్రతి నెలా వెయ్యి యూనిట్లకు పైగా ఆర్డర్‌లు వచ్చాయి. ఇది ప్రజలు నెమ్మదిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మారుతున్న ట్రెండ్ ను సూచిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ - 312 కిలోమీటర్ల రేంజ్
టాటా నెక్సాన్ ఈవీ విజయానికి ప్రధాన కారణం అందులోని శక్తివంతమైన బ్యాటరీ రేంజ్ సుదీర్ఘమైన రేంజ్. ప్రస్తుతం, నెక్సాన్ ఈవీలో కంపెనీ 30.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తోంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. అయితే, వాస్తవ ప్రపంచంలో ఈ ఎలక్ట్రిక్ కారును నడిపే తీరు, ప్రాంతం వంటి వివిధ అంశాలను బట్టి ఈ రేంజ్ మారుతూ ఉంటుంది. రద్దీగా ఉండే సిటీ ప్రాంతాలలో నిత్యం సంచరించే వారికి, చిన్నపాటి దూర ప్రయాణాల చేసే వారికి నెక్సాన్ ఈవీ చాలా ఆచరణీయంగా ఉంటుంది.

టాటా నెక్సాన్ ఈవీ - పెర్ఫార్మెన్స్, చార్జింగ్ టైమ్
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారులో 127.23 బిహెచ్‌పి గరిష్ట పవర్ మరియు 245 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 3 ఫేజ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను ఉపయోగించారు. ఇది కారులోని ఆన్-బోర్డ్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఆప్షన్ తో కూడిన టాటా నెక్సాన్ ఈవీ కేవలం 9.14 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారును 25 kW ఫాస్ట్ డిసి ఛార్జింగ్ సాయంతో కేవలం ఒక గంటలోనే 0 నుండి 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ 3.3 kW ఏసి ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ - 400 కిమీ రేంజ్
ఎమ్‌జి మోటార్ విక్రయిస్తున్న జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) లో కంపెనీ ఓ లాంగ్ రేంజ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఇప్పుడు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే అప్‌డేటెడ్ టాటా నెక్సాన్ ఈవీపై పనిచేస్తోంది. కొత్తగా రాబోయే ఈ టాటా నెక్సాన్ ఈవీ కారులో కంపెనీ పెద్ద 40 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించనుంది. పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా ఈ కారు బరువు సుమారు 100 కిలోలు పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








