టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz CNG)లో కూడా సిఎన్‌జి వెర్షన్.. మరికొద్ది రోజుల్లోనే విడుదలయ్యే ఛాన్స్..
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో తమ సిఎన్‌జి ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరించుకోవాలని చూస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో టియాగో (Tata Tiago) మరియు టిగోర్ (Tata Tigor) మోడళ్లలో సిఎన్‌జి వెర్షన్లను ప్రవేశపెట్టిన టాటా, ఇప్పుడు తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ (Tata Altroz) లో కూడా ఓ సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి మోడల్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.
Recommended Video
తాజాగా, టెస్టింగ్ దశలో ఉన్న టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి (Tata Altroz CNG) కెమెరాకు చిక్కింది. టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క సిఎన్‌జి వెర్షన్ భారతదేశంలో ఉద్గార పరీక్ష పరికరాలతో పరీక్షించబడుతోంది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ప్లేట్‌తో ఇది ముంబై వీధులలో టెస్టింగ్ చేయబడుతోంది. సాధారణంగా టెస్టింగ్ చేయబడే వాహనాలను పూర్తిగా క్యామోఫ్లేజ్ చేస్తారు. అలాంటిది, ఈ ఆల్ట్రోజ్ సిఎన్‌జి వేరియంట్‌పై ఎలాంటి క్యామోఫ్లేజ్ లేదు. దీన్నిబట్టి చూస్తుంటే, ఇది త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టాటా మోటార్స్ ఇప్పటికే తమ టియాగో మరియు టిగోర్ మోడళ్లలో ఐసిఎన్‌జి (iCNG) టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఆల్ట్రోజ్ కూడా అదే పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది కాబ్టటి, ఇందులో సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టడం పెద్ద ఖర్చుతో కూడున్న పనేమి కాదు. ప్రస్తుతం, భారతదేశంలో డీజిల్ కార్ల వినియోగం తగ్గుముఖం పట్టడంతో, అధిక మైలేజ్ కోరుకునే వినియోగదారులు సిఎన్‌జి వాహనాల కోసం పరుగులు తీస్తున్నారు. పవర్ తగ్గినా పర్లేదు, మైలేజ్ పెరుగుతుందనే భావనతో వీటిని కొనేవారి సంఖ్య పెరుగుతోంది.

టాటా మోటార్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, కంపెనీ విక్రయిస్తున్న టియాగో, టిగోర్ మోడళ్లలో దాదాపు సగానికిపై డిమాండ్ వాటి సిఎన్‌జి వేరియంట్ల నుండే వస్తోంది. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే ఆల్ట్రోజ్ సిఎన్‌జి కూడా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి విడుదలతో, టాటా మోటార్స్ భారతదేశంలో పెరుగుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన మార్కెట్ వాటాను మరింత విస్తరించుకోవడానికి ఎదురుచూస్తోంది.

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క సిఎన్‌జి వెర్షన్ టాటా టియాగో సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్ మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కాంపాక్ట్ సెడాన్‌లకు శక్తినిచ్చే అదే ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. అంటే, రాబోయే టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి మోడల్‌లో కూడా 1.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. టియాగో మరియు టిగోర్ సిఎన్‌జి మోడళ్లలోని ఈ పెట్రోల్ ఇంజన్ 84.82 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అయితే, ఈ మోడళ్లలోని సిఎన్‌జి వేరియంట్లలో ఈ పవర్ టార్క్ గణాంకాలు స్వల్పంగా తగ్గుతాయి. సిఎన్‌జి ఇంధనంతో ఈ ఇంజన్ 73 బిహెచ్‌పి పవర్‌ను మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

ప్రస్తుతం, టాటా టియాగో ఐసిఎన్‌జి ఐదు వేరియంట్లలో లభిస్తోంది. వాటి ధరలు రూ.6.30 లక్షల నుండి రూ.7.73 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. టాటా టిగోర్ ఐసిఎన్‌జి కూడా ఐదు వేరియంట్లో లభిస్తుంది మరియు వాటి ధరలు రూ.5.99 లక్షల నుండి రూ.7.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే టాటా ఆల్ట్రోజ్ ఐసిఎన్‌జి కూడా నాలుగు లేదా ఐదు వేరియంట్లలో విడుదల కావచ్చని భావిస్తున్నారు.

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌లలో టాటా ఆల్ట్రోజ్ కూడా ఒకటి. ఇది గ్లోబల్-ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో అడల్ట్ సేఫ్టీ కోసం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే, టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో iRA కార్ కనెక్టెడ్ టెక్నాలజీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ తో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.5-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 90 బిహెచ్‌పి పవర్‌ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ వెర్షన్ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి మరియు భారతదేశంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఉన్న ఏకైక హ్యాచ్‌బ్యాక్. టాటా ఆల్ట్రోజ్ కారుకి మంచి ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఇందులో సిఎన్‌జి వెర్షన్ లేకపోవడం వల్ల దేశంలోని చాలా మంది పట్టణవాసులకు ఇది తక్కువ ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలో, ఆల్ట్రోజ్ యొక్క సిఎన్‌జి వేరియంట్‌ను ప్రారంభించడంతో, టాటా మోటార్స్ టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించగలదని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








