ఏప్రిల్ 6న టాటా మోటార్స్ (Tata Motors) నుండి మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. టీజర్ చూడండి!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) మరో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం, టాటా మోటార్స్ ఇప్పటికే తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ కార్లను కలిగి ఉంది. వీటిలో టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) మరియు టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) మోడళ్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు టాటా మోటార్స్ తమ తదుపరి ఎలక్ట్రిక్ ఉత్పత్తికి సంబంధించి ఓ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ దీనిని ఏప్రిల్ 6న ఆవిష్కరించనుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి టాటా మోటార్స్ విడుదల టీజర్ ను చూస్తుంటే, ఇది కంపెనీ నుండి రాబోయే కొత్త EV కోసం కాన్సెప్ట్ షోకేస్ కావచ్చని తెలుస్తోంది. ఈ టీజర్ లో కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ కారు యొక్క స్లోపింగ్ రూఫ్‌లైన్ మరియు స్లాట్డ్ సర్ఫేస్ వంటి కొన్ని డిజైన్ అంశాలను హైలైట్ చేసింది. ఇంకా ఇందులో స్పోర్టీ ఫ్రంట్ బంపర్‌ను కూడా చూపించారు, ఇది లెక్సస్ వంటి ప్రీమియం కార్ల డిజైన్ ను తలపించేలా ఉంటుంది. టీజర్‌లో ఈ చిన్నపాటి అంశాలు మినహా వేరే ఇతర వివరాలు ఇంకా తెలియదు.

వాస్తవానికి, టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవీలో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను విడుదల చేయవచ్చని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కంపెనీ విడుదల చేసిన ఈ టీజర్ ను చూస్తుంటే, మాత్రం ఇది అప్‌గ్రేడెడ్ నెక్సాన్ ఈవీ మాదిరిగా కాకుండా, పూర్తిగా సరికొత్త ఎలక్ట్రిక్ కారులా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ టీజర్‌లో వచ్చే కాన్సెప్ట్ గురించి పెద్దగా తెలుసుకోవడం కష్టమే అయినప్పటికీ, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఏదో ఒక రూపంలో స్పోర్టీ యుటిలిటీ వాహనంగా విడుదల చేయబడుతుందని ఊహాగానాలు ఎక్కువగా విపిస్తున్నాయి.

టాటా మోటార్స్ 2025 నాటికి పది కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు 2021 సంవత్సరంలో ప్రకటించింది. వీటిలో కంపెనీ ఇప్పటికే నెక్సాన్ ఈవీ మరియు టిగోర్ ఈవీ మోడళ్లను విక్రయిస్తోంది. అలాగే, కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరియు టాటా పంచ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లను విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఈ టీజర్‌లో చూపించిన ఎలక్ట్రిక్ వాహనం పూర్తిగా కొత్త EV కాన్సెప్ట్ అని మరియు ఇది కంపెనీ యొక్క అతిపెద్ద ఎలక్ట్రిఫైడ్ మోడల్ అని విశ్వసిస్తున్నారు.

టాటా మోటార్స్ విక్రయిస్తున్న నెక్సాన్ EV మరియు టిగోర్ EV లతో ఈ బ్రాండ్ భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇవి రెండూ కూడా కంపెనీ విక్రయిస్తున్న వాటి పెట్రోల్ వెర్షన్ల యొక్క ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్లుగా ఉన్నాయి. మాస్ మార్కెట్ ఈవీల విభాగంలో ఎక్కువగా సబ్ కాంపాక్ట్ మోడళ్లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, టాటా మోటార్స్ ఇంకా ప్రీమియం ఈవీ విభాగంలోకి ప్రవేశించలేదు. ఈ విభాగంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా (హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్) మరియు ఎమ్‌జి మోటార్ ఇండియా (MG ZS EV) కంపెనీల ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నాయి.
వీటికి తోడుగా, భారతదేశపు అతిపెద్ద యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిపై పని చేయడం ప్రారంభించింది. మహీంద్రా అండ్ మహీంద్రా రాబోయే జూలై 2022 నెలలో తమ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కాన్సెప్ట్ మోడల్‌లను వెల్లడిస్తుందని సమాచారం.

టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్ కూడా వస్తోంది..
ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ విక్రయిస్తున్న నెక్సా ఈవీలో కంపెనీ ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని సమాచారం. కొత్తగా రాబోయే ఈ టాటా నెక్సాన్ ఈవీ కారులో కంపెనీ పెద్ద 40 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించనుంది. పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా ఈ కారు బరువు సుమారు 100 కిలోలు పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో కంపెనీ కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ కూడా చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న టాటా నెక్సాన్ ఈవీలో కంపెనీ 30.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తోంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. అయితే, వాస్తవ ప్రపంచంలో ఈ ఎలక్ట్రిక్ కారును నడిపే తీరు, ప్రాంతం వంటి వివిధ అంశాలను బట్టి ఈ రేంజ్ మారుతూ ఉంటుంది. రద్దీగా ఉండే సిటీ ప్రాంతాలలో నిత్యం సంచరించే వారికి, చిన్నపాటి దూర ప్రయాణాల చేసే వారికి నెక్సాన్ ఈవీ చాలా ఆచరణీయంగా ఉంటుంది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారులో 127.23 బిహెచ్‌పి గరిష్ట పవర్ మరియు 245 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 3 ఫేజ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను ఉపయోగించింది. ఇది కారులోని ఆన్-బోర్డ్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఆప్షన్ తో కూడిన టాటా నెక్సాన్ ఈవీ కేవలం 9.14 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారును 25 kW ఫాస్ట్ డిసి ఛార్జింగ్ సాయంతో కేవలం ఒక గంటలోనే 0 నుండి 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ 3.3 kW ఏసి ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








