టాటా మోటార్స్ నుండి కజిరంగా ఎడిషన్స్.. ఓ స్పెషల్ కాజ్ కోసం సరికొత్త స్పెషల్ ఎడిషన్లు..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) లో కొత్త కజిరంగా ఎడిషన్ (Kaziranga Edition) ను పరిచయం చేసింది. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ కోసం ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో, టాటా మోటార్స్ యొక్క నెక్సాన్, సఫారి మరియు హారియర్ వంటి ఇతర మోడల్‌లు కూడా కనిపిస్తాయి, అయితే, కంపెనీ వాటి గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

ఈ టీజర్‌లో, చూపించిన ఈ మోడల్‌ల హెడ్‌లైట్ల సహాయంతో కంపెనీ ఖడ్గమృగం ఆకారాన్ని తయారు చేసింది. ప్రస్తుత IPL 2022 వేలం సమయంలో కంపెనీ ఈ కారును వేలం వేయనుంది మరియు ఇలా వేలం ద్వారా డబ్బు అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park) కు డొనేట్ చేస్తుంది. ఈ క్యాంపైన్ కోసం కంపెనీ తన ప్రొఫైల్ ఫోటోను కూడా మార్చింది, కంపెనీ తమ లోగో స్థానంలో ఖడ్గమృగం యొక్క ఫోటోలను పోస్ట్ చేసింది.

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్స్ కూడా అధికారికంగా ప్రారంభించబడ్డాయి. ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ మీటోర్ బ్రాంజ్ కలర్ ఆప్షన్‌లో రానుంది. ఈ స్పెషల్ ఎడిషన్ లో కొత్త కలర్ ఆప్షన్ మరియు స్పెషల్ గ్రాఫిక్స్ తప్ప డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్లు మొదలైన వాటిలో ఎలాంటి మార్పులు లేవు. టాటా పంచ్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ అయిన క్రియేటివ్ వేరియంట్ ఆధారంగా ఈ స్పెషల్ ఎడిషన్ ను రూపొందించారు.

ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ యొక్క వెనుక విండ్‌షీల్డ్ పై రైనో ఫోటో మరియు కజిరంగా స్కఫ్ ప్లేట్ ఉంటాయి. అదే సమయంలో, దాని ఇంటీరియర్‌లోని గ్లోవ్ బాక్స్‌పై కూడా రైనో ఫోటో ఉంటుంది. ఈ చిన్నపాటి మార్పులు తప్ప, స్టాండర్డ్ టాటా పంచ్ కి ఈ స్పెషల్ ఎడిషన్ కి మధ్య వేరే వ్యత్యాసాలు ఏమీ కనిపించవు. టాటా మోటార్స్ నుండి లభిస్తున్న ఈ ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విక్రయించబడుతోంది. వీటిలో ప్యూర్, అడ్వెంచర్, అకాప్లిష్డ్ మరియు క్రియేటివ్ అనే నాలుగు ట్రిమ్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ ఇటీవలే తమ పంచ్ ఎస్‌యూవీ కోసం 4 రకాల యాక్సెసరీస్ ప్యాక్‌లను కూడా అందుబాటులోకి తెచ్చింది, ఇది కస్టమర్ ఎంచుకునే ట్రిమ్‌లను బట్టి రూ. 30,000 నుండి రూ. 45,000 రేంజ్‌లో ఉంటుంది. ఈ ప్యాకేజీల సాయంతో కస్టమర్లు తమ పంచ్ ఎస్‌యూవీని మరింత ఆకర్షణీయంగా మరియు సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.

టాటా పంచ్ డిజైన్ ను గమనిస్తే, ఇందులో సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, దాని మధ్యలో టాటా బ్రాండ్ లోగో సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు హెడ్‌లైట్లు, ఫోర్-స్పోక్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ వంటి హైలైట్స్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో క్యాబిన్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది.

టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్‌ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటుగా 27 రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ చిన్న కారులో రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ పంక్చర్ రిపేర్ కిట్ మొదలైనవి ఉన్నాయి.

టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీని కంపెనీ యొక్క కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. సైజు పరంగా చూస్తే, కొత్త టాటా పంచ్ 2,445 మిమీ వీల్‌బేస్‌తో 3,827 మిమీ పొడవు, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తును కలిగి ఉంది. ఈ చిన్న ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిమీ మరియు వాటర్ వెండింగ్ కెపాసిటీ 370 మిమీగా ఉంటుంది.

ఇక చివరిగా, ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం టాటా పంచ్ ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్, మూడు సిలిండర్, రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి శక్తిని మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' అనే ప్రత్యేకమైన డ్రైవింగ్ మోడ్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








