అయ్యయ్యో.. ఇలా జరిగిందేంటి: 'టిగోర్ ఈవి' ని అక్కడే వదిలేసి ఇంటికెళ్లిన ఓనర్.. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తిరుగులేని ఉత్పత్తులను ప్రవేశపెట్టిన 'టాటా మోటార్స్' (Tata Motors) ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ఏకంగా 80 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ ప్రస్తుతం 'టాటా నెక్సాన్ ఈవి, టాటా టిగోర్ ఈవి మరియు టాటా టియాగో ఈవి' అనే మూడు ఎలక్ట్రిక్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలు విభాగంలో కలిగి ఉంది.

సాధారణంగా ఏ కారైనా ఏదో ఒక రోజు అనుకోని ఇబ్బందిని తప్పకుండా ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వినియోగదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఎలక్ట్రిక్ కార్లలో ఛార్జింగ్ మరియు ఛార్జింగ్ కి సంబంధించిన ఇతర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇటీవల ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఇటీవల ఒక టాటా టిగోర్ ఈవి కారు ఛార్జింగ్ వేసిన సమయంలో ఛార్జింగ్ ప్లగ్ అక్కడే ఇరుక్కు పోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని టాటా టిగోర్ ఈవి వినియోగదారుడు 'నైట్‌మేర్' అని పేర్కొన్నాడు. ఈ వీడియోని మిస్టర్ సింటో ఆంటోని యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసారు.

టాటా టిగోర్ ఈవి ఓనర్ తన కుటుంబముతో కలిసి ట్రిప్ వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆ ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక రెస్టారెంట్ వద్ద ఆహరం తీసుకోవడానికి ఆగారు. అయితే ఆ సమయంలో తమ ఎలక్ట్రిక్ కారుకి సమీపంలో అక్కడే ఉన్న ఒక ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయాలనీ నిర్ణయించుకున్నారు.

అనుకున్న విధంగానే ఆ కార్ ఓనర్ తన ఎలక్ట్రిక్ కారుకి ఛార్జింగ్ వేసుకున్నాడు, కానీ ఛార్జింగ్ ప్లగ్ తీసే సమయంలోనే ఆటంకం ఎదురైంది. ఎందుకంటే ఛార్జింగ్ వేసినప్పుడు సులభంగానే వేశారు, కానీ తీసే సమయంలో ఆ ప్లగ్ బయటకు రాలేదు. ఆ ప్లగ్ ఆ ఛార్జింగ్ పిన్ లోనే ఇరుక్కుపోయింది. ఆ సమయంలో అతనికి ఇంకా ఏం చేయాలో తోచలేదు. మొత్తానికి ఆ ఛార్జర్ ఆ కారుకే అతుక్కుపోయింది.

ఇలాంటి సంఘనటనలే గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే కొంతమంది ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు ఇటువంటి సమస్యలను రూపుమాపడానికి మాన్యువల్ ఓవర్‌రైడ్ స్విచ్‌ని అందిస్తారు. అయితే టాటా టిగోర్ ఈవిలో మాత్రం ఈ స్విచ్ వీల్ వాల్ ఏరియా లోపలి భాగంలో ఉంటుంది, కాబట్టి ఛార్జింగ్ సమయంలో కొంత కష్టంగానే ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల భద్రత కూడా కొంచెం కఠినమనే చెప్పాలి, కావున ఇది మొత్తం బురద మరియు దుమ్ము వంటి వాటితో నిండిపోయి ఉంది.

టాటా టిగోర్ ఈవి ఓనర్ మాన్యువల్ ఓవర్‌రైడ్ స్విచ్‌ని యాక్సెస్ చేయడానికి వీల్ వాల్ ప్రాంతాన్ని మొత్తం శుభ్రం చేయాల్సి వచ్చింది. చివరకు మాన్యువల్ ఓవర్‌రైడ్ స్విచ్ ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఎంత ప్రయత్నించినా ఛార్జింగ్ గన్ బయటకు రాకుండా పోవడం చేత ఏదైనా మెకానిక్ షాప్ ఉందేమో అని కూడా వెతికారు, కానీ ప్రయిజనం లేకుండా పోయింది. చివరకు ఆ కారుని అక్కడే వదిలి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి ఇల్లు కూడా దగ్గరలోనే ఉండటం వల్ల వారు ఆ కారుని అక్కడే వదిలి ఉదయం తీసుకోవచ్చని వెళ్లిపోయారు.

ఈ సంఘటనను ఎదుర్కొన్న టాటా టిగోర్ ఈవి ఓనర్ ఇల్లు దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ కారుని అక్కడే వదిలి వెళ్లగలిగారు, అలా కాకూండా ఏదైనా దూరంగా ఉండే ప్రాంతంలో ఇలాంటి అనుభవం ఎదురై ఉంటే వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది.

ఇక టాటా టిగోర్ ఈవి విషయానికి వస్తే, XE, XM మరియు XZ+ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఈవీ సెడాన్ ను జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించి తయారు చేసింది. ఇది ఒక పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు.

ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 kW శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. చార్జింగ్ సమయం విషయానికి వస్తే, కొత్త టిగోర్ ఈవీని 25kW ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 65 నిముషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. 15A ప్లగ్ పాయింట్ ద్వారా బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

టాటా టిగోర్ EV శ్రేణి ధరల విషయానికి వస్తే, బేస్ వేరియంట్ అయిన XE ట్రిమ్ ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా), కాగా టాప్ వేరియంట్ అయిన XZ+ ధర రూ. 13.64 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటాయి.


Click it and Unblock the Notifications








