ఇంకెంత కాలం ఈ వెయిటింగ్.. మా డబ్బులు మాకు ఇచ్చేయండి: టెస్లాను బుక్ చేసుకున్న ఇండియన్ కస్టమర్స్!
అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా (Tesla) చాలా ఏళ్లుగా భారతదేశంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే, మనదేశంలో తన కంపెనీ పేరును కూడా రిజిస్టర్ చేసిన టెస్లా, వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మాత్రం వెనుకాడుతోంది. అయితే, వాస్తవానికి టెస్లా 2016లోనే తమ చవకైన ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ 3 (Tesla Model 3) కోసం భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని ఇతర దేశాల నుండి కూడా బుకింగ్‌లను స్వీకరించింది. ఆ సమయంలో కేవలం 1000 డాలర్లకే (సుమారు రూ.60-65 వేలు) టెస్లా మోడల్ 3 కోసం బుకింగ్‌లను ఓపెన్ చేసింది.

ఆ సమయంలో, భారతదేశం నుండి కూడా కొందరు ఔత్సాహికులు టెస్లా మోడల్ 3 కారుని బుక్ చేసుకున్నారు. అయితే, ఈ అమెరికన్ కంపెనీ మాత్రం వారికి చుక్కలు చూపిస్తోంది. ఈ కంపెనీ ఇంత వరకూ టెస్లా కార్లను భారతదేశంలో విడుదల చేయడం గురించి కానీ లేదా వాటి డెలివరీల గురించి కానీ ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ నేపథ్యంలో, కస్టమర్లు గడచిన ఆరేళ్లుగా తమ డబ్బు వాపసు (రీఫండ్) కోసం టెస్లా కంపెనీని పదేపదే అడిగుతూ, కంపెనీ నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో విసిగివేసారి పోయారు.

ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలకు టెస్లా మోడల్ 3 కార్లు డెలివరీ చేయబడ్డాయి
టెస్లా నేరుగా భారతదేశంలో ఒక్క మోడల్ 3 కారును కూడా డెలివరీ చేసి ఉండకపోవచ్చు, కానీ ఈ కారు ప్రపంచంలోని అనేక దేశాలలో డెలివరీ చేయబడుతోంది. తాజా సమాచారం ప్రకారం, టెస్లా గ్లోబల్ మార్కెట్‌లో 3 లక్షలకు పైగా మోడల్ 3 కార్లను డెలివరీ చేసింది. వాస్తవానికి టెస్లాకు భారతదేశంలో సక్సెస్ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం మనదేశం అనుసరిస్తున్న దిగుమతి సుంకాల విషయంలో టెస్లా సంతోషంగా లేదు. అందుకే, తమ కార్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టడంపై కంపెనీ ఇంకా ఓ తుది నిర్ణయానికి రాలేదు.

బుకింగ్ అమౌంట్‌ని రీఫండ్ చేయమంటున్న ఇండియన్ కస్టమర్స్
ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఆరేళ్ల క్రితం టెస్లా మోడల్ 3 కారును బుక్ భారతీయ కస్టమర్లు, ఇక ఇంత వరకూ వేచి ఉన్నది చాలు, తమ డబ్బును తమకు తిరిగి ఇచ్చేయమని టెస్లా కంపెనీని కోరుతున్నారు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించబడిన ఓ కథనం ప్రకారం, టెస్లా మోడల్ 3ని బుక్ చేసిన చాలా మంది భారతీయ కస్టమర్‌లు ఇప్పుడు రీఫండ్‌లను కోరుతున్నారు. వారంతా డబ్బు వాపసు కోసం టెస్లా కంపెనీని చాలాసార్లు అభ్యర్థించినా, ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు.

కొందరైతే తాము మోసపోయామని గుర్తించడానికి ఆరేళ్ల సమయం పట్టిందని, ఇలాంటి గౌరవప్రదమైన కంపెనీలు తమను ఇలా మోసం చేస్తాయని తాము ఊహించలేదని చెబుతున్నారు. టెస్లా కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లు రీఫండ్ కోసం కంపెనీకి చాలాసార్లు మెయిల్ చేయాల్సి వచ్చిందని, అయినప్పటికీ కంపెనీ నుండి వచ్చిన స్పందన మాత్రం చాలా నిరాశాజనకంగా ఉందని చెప్పారు. కాగా, ఈ కంపెనీ గత ఏడాది కొంత మంది కస్టమర్లకు ఈ రీఫండ్ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు సమాచారం.

టెస్లా భారతదేశంలోనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటున్న ప్రభుత్వం
టెస్లా గత ఏడాది బెంగళూరులో తన కార్యాలయాన్ని ప్రారంభించడంతో భారతదేశంలో త్వరలోనే టెస్లా కార్ల ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుందనే వార్తలు వచ్చాయి. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా టెస్లా 2021 ప్రారంభం నుండి భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. అయితే, ఆ తరువాత టెస్లా మాత్రం చైనాలో తయారు చేసిన కార్లను భారతదేశానికి దిగుమతి చేసుకుంటామని చావు కబురు చల్లగా చెప్పింది. భారతదేశంలో దిగుమతి చేసుకునే విదేశీ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా ఉంటోంది.

ఇతర కంపెనీలకు వర్తించిన ప్రయోజనాలే టెస్లాకు వర్తిస్తాయని, ఈ విషయంలో టెస్లాకు ప్రత్యేక తాంబూలం అంటూ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇదే విషయంపై టెస్లా మరియు భారత ప్రభుత్వానికి మధ్య దాదాపు ఏడాది కాలంగా చర్చలు సాగుతూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రకారం, టెస్లా మనదేశంలో ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం వలన అటు కంపెనీకి ఇటు దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. టెస్లా ప్రకారం, మన పొరుగు దేశమైన చైనాలో తయారు చేసిన కార్లను ఇక్కడి దిగుమతి చేసుకోవడం వలన కంపెనీ ఉత్పాదక వ్యయం తగ్గుతుంది మరియు ఇరు దేశాల మధ్య వ్యాపారం పెరుగుతుంది.

భారత్ వద్దు.. చైనానే ముద్దు అంటున్న టెస్లా!
భారతదేశంలో ప్లాంట్ ఏర్పాటు గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని టెస్లా, చైనాలో మాత్రం తమ ప్లాంట్లను విస్తరించేందుకు ప్లాన్స్ కూడా చేసేస్తోంది. టెస్లా సంస్థకు ఇప్పటికే చైనాలోని షాంగైలో ఓ ప్లాంట్ ఉంది, కాగా ఇప్పుడు ఈ ప్లాంట్ పక్కనే మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టెస్లా నవంబర్ 2021 లో, షాంఘైలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తమ ఫ్యాక్టరీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఏషియా మార్కెట్ల నుండి పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి ఈ కొత్త ప్లాంట్ సహాయపడుతుంది. కాగా, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిన తర్వాత, ప్రతి సంవత్సరం ఈ ప్లాంట్ నుండి ఒక మిలియన్ ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేయబడతాయని అంచనా.


Click it and Unblock the Notifications








