అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 10 సిఎన్‌జి కార్లు: ధరలు, మైలేజ్ వివరాలు
భారతదేశంలో దాదాపు ఐదు నెలల విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తిరిగి పెరగడం ప్రారంభించాయి. గడచిన 8 రోజుల్లో ఇప్పటికే 7 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రతిరోజు లీటరుపై కనీసం 80 పైసల చొప్పున చమురు కంపెనీలు పెట్రోల్ ధరను పెంచుతూ వస్తున్నాయి. ఇలా ఇప్పటికే లీటరుపై రూ.5 లకు పైగా ధరను పెంచేశాయి. ఈ పెంపు ఇంతటితో ఆగదని, రానున్న రోజుల్లో లీటరు పెట్రోల్/డీజిల్ ధర సుమారు రూ.15-20 వరకూ పెరగవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే ఇది రూ.120 లకు చేరువలో ఉంది. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండి, సిఎన్‌జి ఇంధనంతో నడిచే కార్లు చాలానే ఉన్నాయి. సిఎన్‌జి ఇంధనం తక్కువ ధరకు లభించడమే కాకుండా, పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే అత్యధిక మైలేజీని కూడా అందిస్తాయి. మరి భారత్‌లో లభిస్తున్న ఆ టాప్ 10 బెస్ట్ మైలేజీనిచ్చే సిఎన్‌జి కార్లు ఏవో చూద్దాం రండి..!

1. టాటా టియాగో సిఎన్‌జి (Tata Tiago CNG)
భారతదేశంలో సిఎన్‌జి కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసిన టాటా మోటార్స్, ఇప్పుడు తొలిసారిగా సిఎన్‌జి కార్ల విభాగంలోకి ప్రవేశించింది. ఈ బ్రాండ్ రెండు సిఎన్‌జి కార్లను మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో మొదటిది టాటా టియాగో సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 6.09 లక్షల నుండి రూ.7.52 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ సిఎన్‌జి వెర్షన్‌లోని 1.2-లీటర్, త్రీ-సిలిండర్ రెవోట్రాన్ ఇంజన్ గరిష్టంగా 73 బిహెచ్‌పి శక్తిని మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేజీ సిఎన్‌జికి గరిష్టంగా 26.49 కిమీ మైలేజీని ఇస్తుంది.

2. టాటా టిగోర్ సిఎన్‌జి (Tata Tigor CNG)
టాటా మోటార్స్ అందిస్తున్న రెండవ సిఎన్‌జి మోడల్ టాటా టిగోర్ సిఎన్‌జి కాంపాక్ట్ సెడాన్. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 7.69 లక్షల నుండి రూ.8.29 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ సిఎన్‌జి వెర్షన్ కూడా 1.2-లీటర్, త్రీ-సిలిండర్ రెవోట్రాన్ ఇంజన్‌తో లభిస్తుంది. కాకాపోతే, ఈ ఇంజన్ గరిష్టంగా 69 బిహెచ్‌పి శక్తిని మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా కేజీ సిఎన్‌జికి గరిష్టంగా 26.49 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

3. హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి (Hyundai Aura CNG)
భారతదేశంలో మారుతి సుజుకి తర్వాత అత్యధికంగా సిఎన్‌జి కార్లను అందించే కంపెనీ హ్యుందాయ్. ఈ కొరియన్ కార్ బ్రాండ్ అందిస్తున్న హ్యుందాయ్ ఆరా, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో లభిస్తుంది. మార్కెట్లో ఈ సిఎన్‌జి కారు ధర రూ.7.74 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఇది స్టాండర్డ్ మోడల్‌లో ఉపయోగించిన అదే 1.2 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ సిఎన్‌జి ఇంధనంపై గరిష్టంగా 69 బిహెచ్‌పి శక్తిని మరియు 95.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సిఎన్‌జి ఇంధనంపై గరిష్టంగా కేజీకి 28.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి (Hyundai Grand i10 Nios CNG)
హ్యుందాయ్ నుండి లభిస్తున్న మరొక సిఎన్‌జి మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.7.07 లక్షల నుండి 7.60 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది కూడా 1.2-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. సిఎన్‌జి ఇంధనంపై ఈ ఇంజన్ గరిష్టంగా 69 బిహెచ్‌పి శక్తిని మరియు 95.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సిఎన్‌జి ఇంధనంపై కేజీకి 28.5 కిమీ మైలేజీని ఇస్తుంది.

5. హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి (Hyundai Santro CNG)
హ్యుందాయ్ బ్రాండ్ నుండి లభిస్తున్న సిఎన్‌జి కార్లలో అత్యధిక మైలేజీనిచ్చే మోడల్ శాంత్రో సిఎన్‌జి. మార్కెట్లో ఈ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ యొక్క సిఎన్‌జి శ్రేణి ధరలు రూ. 6.09 లక్షల నుండి రూ. 6.38 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 1.1-లీటర్ ఇంజన్ ఉపయోగించారు. సిఎన్‌జి ఇంధనంతో ఇది గరిష్టంగా 60 బిహెచ్‌పి శక్తిని మరియు 85.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేజీ సిఎన్‌జితో ఈ కారు 30.48 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది.

6. మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి (Maruti Suzuki Dzire CNG)
మారుతి సుజుకి నుండి లేటెస్ట్‌గా వచ్చిన సిఎన్‌జి మోడల్ ఈ డిజైర్ ఎస్-సిఎన్‌జి. మార్కెట్లో ఈ సిఎన్‌జి కారు ధరలు రూ. 8.14 లక్షల నుండి రూ. 8.82 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 1.2-లీటర్ కె12ఎమ్ డ్యూయెల్ జెట్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 77 బిహెచ్‌పి శక్తిని మరియు 98.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కారు కేజీ సిఎన్‌జికి 31.12 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

7. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి (Maruti Suzuki S-Presso CNG)
మారుతి సుజుకి అందిస్తున్న మరొక చిన్న సిఎన్‌జి కారు ఎస్-ప్రెసో సిఎన్‌జి. మార్కెట్లో దీని ధరలు రూ. 5.24 లక్షల నుండి రూ. 5.56 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 1.0-లీటర్ కె10బి పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 58 బిహెచ్‌పి శక్తిని మరియు 78 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేజీ సిజిఎన్‌తో 31.2 కిమీ మైలేజీని ఇస్తుంది.

8. మారుతి సుజుకి ఆల్టో 800 సిఎన్‌జి (Maruti Suzuki Alto 800 CNG)
మారుతి సుజుకి బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే కారు ఆల్టోలో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్ ను కూడా విక్రయిస్తోంది. చాలా కాలంగా మార్కెట్లో ఉన్న ఈ సిఎన్‌జి మోడల్ ధరలు ప్రస్తుతం రూ. 4.89 లక్షల నుండి రూ. 4.95 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 796 సిసి, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగించారు. సిఎన్‌జి ఇంధనంతో ఈ ఇంజన్ 40 బిహెచ్‌పి శక్తిని మరియు 60 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేజీ సిఎన్‌జితో ఈ కారు 31.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

9. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి (Maruti Suzuki Wagon R CNG)
మారుతి సుజుకి ప్రోడక్ట్ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాల్ బాయ్ కారు వ్యాగన్‌ఆర్‌లో కూడా సిఎన్‌జి మోడల్ అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 6.35 లక్షల నుండి రూ. 6.81 లక్షల మధ్యలో ఉన్నాయి. సిఎన్‌జి వేరియంట్‌లోని 1.0-లీటర్ 3-సిలిండర్, డ్యూయల్-జెట్ ఇంజన్ గరిష్టంగా 57 బిహెచ్‌పి శక్తిని మరియు 82.1 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేజీ సిఎన్‌జితో 34.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

10. మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి (Maruti Suzuki Celerio CNG)
ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కొత్త తరం మారుతి సెలెరియోలో కూడా సిఎన్‌జి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ. 6.58 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. ఈ కారులో 1.0 లీటర్ కె10సి డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో విక్రయించబడుతోంది. ఈ ఇంజన్ సిఎన్‌జి ఇంధనంతో గరిష్టంగా 57 బిహెచ్‌పి శక్తిని శక్తిని మరియు 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‌జి ఇందనంతో ఈ కారు గరిష్టంగా కేజీకి 35.60 కిమీ మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








