భారత మార్కెట్లో యాంబియెంట్ లైటింగ్‌తో లభించే టాప్ 5 సరసమైన కార్లు
భారత కార్ మార్కెట్లో గడచిన రెండు దశాబ్ధాలుగా గమనిస్తే, కార్లు చాలా అత్యాధునికంగా మారాయి. ఒకప్పుడు హై-ఎండ్ లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన అధునిక ఫీచర్లు ఇప్పుడు సాధారణ ఎంట్రీ లెవల్ కార్లలో సైతం అందబాటులోకి వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, విస్తారమైన వినియోగం మరియు సరసమైన ధరలకే లభిస్తున్న ప్రత్యామ్నాయ పరికరాలు మొదలైన అనేక అంశాల కారణంగా, కార్లలో ఉపయోగించే ఫీచర్లు ఇప్పుడు చాలా చవకగా మారాయి. ఫలితంగా, అన్ని రకాల వర్గాల వారికి ఈ అత్యాధునిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

నేటి ఆధునిక కార్లలో కస్టమర్లు కోరుకునే ప్రత్యేకమైన ఇంటీరియర్ ఫీచర్లలో ఒకటి యాంబియెంట్ లైటింగ్ (Ambient Lighting). దీనినే మూడ్ లైటింగ్ అని కూడా పిలుస్తుంటారు. ఇది కారు లోపల ఇంటీరియర్‌లో ఉండే రిఫ్రెషింగ్ ఫీచర్. పేరుకు తగినట్లుగానే ఇది వివిధ రకాల మూడ్‌కి తగినట్లుగా మార్చుకునే సౌకర్యం ఉంటుంది. అయితే, కొన్ని కార్లలో నిర్ధిష్ట రంగులలో మాత్రమే ఈ యాంబియెంట్ లైటింగ్ ఫీచర్ లభిస్తుంది. అలాగే, మరికొన్ని కార్లలో కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది.
మరి, ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న కార్లలో యాంబియెంట్ లైటింగ్ ఫీచర్ కలిగిన టాప్ 5 సరసమైన కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

1. రెనో కైగర్ (Renault Kiger)
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో కైగర్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తున్న సరసమైన కారు. ప్రీమియం ఫీచర్ల విషయంలో ఈ చిన్న కారు కస్టమర్లను ఏ విధంగానూ నిరాశపరచదు. ఫిబ్రవరి 2021లో రెనో ఈ కారును మార్కెట్లో విడుదల చేసింది. రెనో కైగర్ యాంబియంట్ లైటింగ్‌తో పాటు అనేక ఇతర కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లతో లభిస్తుంది.

రెనో కైగర్ టాప్ ఎండ్ ఆర్ఎక్స్‌జెడ్ వేరియంట్‌లో యాంబియంట్ లైటింగ్ ఫీచర్ లభిస్తుంది. ప్రస్తుతం, మార్కెట్లో దీని ధర రూ. 8.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. అంతేకాకుండా, ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్ మరియు ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

2. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun)
జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న లేటెస్ట్ ప్రోడక్ట్ టైగన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ. మార్కెట్లో ఇది చాలా అద్భుతమైన ప్యాకేజీతో విక్రయించబడుతోంది. ఎంట్రీ లెవల్ వేరియంట్లలోనే కంపెనీ మంచి ఫీచర్లను అందిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కంఫర్ట్‌లైన్ ట్రిమ్‌లో కూడా యాంబియెంట్ లైటింగ్ ఫీచర్ లభిస్తుంది. మార్కెట్లో ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని మొత్తం నాలుగు వేరియంట్లు, ఐదు కలర్లు మరియు రెండు ఇంజన్ ఆప్షన్లతో అందిస్తోంది.

టైగన్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్‌లో లభించే ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 8.0 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్‌హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసి వంటి ఫీచర్లు ఉన్నాయి.

3. స్కోడా స్లావియా (Skoda Slavia)
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ స్లావియాను కూడా కంపెనీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందిస్తుంది. ఈ కారులో ప్రీమియం ఇంటీరియర్స్ తో పాటుగా యాంబియంట్ లైటింగ్ ఫీచర్ కూడా లభిస్తుంది. స్కోడా స్లావియా యాంబిషన్ ట్రిమ్‌లో కంపెనీ ఈ మూడ్ లైటింగ్ ఫీచర్‌ను అందిస్తోంది. మార్కెట్లో స్కోడా స్లావియా యాంబిషన్ వేరియంట్ల ధరలు రూ. 12.39 లక్షల నుండి రూ. 13.59 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

అంతే కాకుండా ఈ వేరియంట్‌లో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, అడ్వాన్స్‌డ్ అనలాగ్ డయల్ విత్ MID, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ మరియు ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, కప్‌హోల్డర్‌లతో రియర్ ఆర్మ్‌రెస్ట్, డ్రైవర్ విండో వన్-టచ్ ఆటో అప్/డౌన్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పుష్-బటన్ స్టార్ట్, పాడిల్ షిఫ్టర్స్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

4. స్కోడా కుషాక్ (Skoda Kushaq)
స్కోడా అందిస్తున్న మరొక లేటెస్ట్ కారు కుషాక్ ఎస్‌యూవీ కూడా యాంబియెంట్ లైటింగ్ ఫీచర్‌తో లభిస్తుంది. ఇందులోని యాంబిషన్ ట్రిమ్‌లో కంపెనీ ఈ ఫీచర్ ను అందిస్తోంది. మార్కెట్లో ఈ ట్రిమ్ ధర రూ. 12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. భారత మార్కెట్లో Skoda Kushaq యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్ లలో మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ. 10.49 లక్షల నుండి రూ. 17.59 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

స్కోడా కుషాక్ 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఈఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఈ కారులో ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిషన్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

5. హోండా సిటీ (Honda City)
ఈ జాబితాలో చివరి మది చాలా కాలంగా మార్కెట్లో ఉన్నది హోండా సిటీ సెడాన్. జపనీస్ కార్ బ్రాండ్ హోండా విక్రయిస్తున్న ఈ పాపులర్ సి-సెగ్మెంట్ సెడాన్ యొక్క 5వ తరం మోడల్ లో కంపెనీ యాంబియెంట్ లైటింగ్ ఫీచర్ ను అందిస్తోంది. హోండా సిటీ టాప్-ఎండ్ జెడ్ఎక్స్ ట్రిమ్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మార్కెట్లో దీని ధర రూ. 13.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








