ఈ 5 కార్లు భారతదేశంలోనే తయారవుతాయి.. కానీ ఇక్కడ మాత్రం అమ్ముడుకావు..!
ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో భారతదేశం కూడా ఒకటి. మనదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. అనేక జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో కార్ల వ్యాపారం చేస్తున్నాయి. అయితే, భారతదేశంలో తయారు చేయబడిన అన్ని కార్లు మనదేశంలో విక్రయించబడవని మీకు తెలుసా? అవును, వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఇది వాస్తవం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వాహనాలు కేవలం అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే విక్రయించబడుతాయి, కానీ అవి భారత్‌లో మాత్రం విక్రయించబడవు. అలాంటి ఓ ఐదు కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

1. సుజుకి జిమ్నీ (Suzuki Jimny)
సుజుకి జిమ్నీ పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడుతోంది. జపాన్ మార్కెట్‌తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చిన్న ఎస్‌యూవీకి భలే డిమాండ్ ఉండి. మూడు డోర్లు నాలుగు సీట్లు కలిగిన ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ తయారీకి జపాన్ కంపెనీ సుజుకి, భారతదేశాన్ని తమ గ్లోబల్ హబ్ గా మార్చుకుంది. భారతదేశంలో లభించే విడిభాగాలు మరియు తక్కువ తయారీ ఖర్చు కారణంగా సుజుకి ఈ కారును మనదేశంలో ఉత్పత్తి చేసి, పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఆఫ్-రోడర్ మోడల్‌లలో సుజుకి జిమ్నీ కూడా ఒకటి కొన్ని దేశాలు సుజుకి జిమ్నీ కోసం సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ ను కూడా కలిగి ఉంటాయి. జిమ్నీ అంతర్జాతీయ మార్కెట్లలో విజయం సాధించినప్పటికీ మరియు స్థానిక ఔత్సాహికుల నుండి బలమైన ఆసక్తిని కలిగి ఉన్నప్పటికీ, మారుతి సుజుకి మాత్రం ఈ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి వెనుకాడుతోంది. ఇందులో ఓ 5-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ విషయంపై కంపెనీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

2. మహీంద్రా స్కార్పియో గెట్అవే (Mahindra Scorpio Getaway)
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా భారతదేశంలో తయారు చేసే మహీంద్రా స్కార్పియో గెట్‌అవే పికప్ ట్రక్కును ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో విక్రయించడం లేదు. అయితే, ఒకప్పుడు ఇది మనదేశంలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉండేది. మహీంద్రా స్కార్పియో గెట్‌అవే 2007లో భారతదేశంలో విడుదల చేయబడింది. అయితే, ఆ సమయంలో మనదేశంలో ప్రీమియం లైఫ్ స్టైల్ పికప్ వాహనాలకు డిమాండ్ అంత బలంగా లేదు.

నిజానికి, భారత్‌లో పికప్ ట్రక్కును ఓ కమర్షియల్ వెహికల్ గానే చూస్తారే తప్ప, విదేశాలలో మాదిరిగా లైఫ్ స్టైల్ యుటిలిటీ వాహనంగా చూడరు. ఈ భావన కారణంగానే, భారతదేశంలో విడుదలైన చాలా పికప్ ట్రక్కులు ఇప్పటికీ విజయాలను సాధించలేకపోతున్నాయి. మహీంద్రా స్కార్పియో గెట్‌అవే ఇదే కారణం చేత ఇక్కడి మార్కెట్ నుండి తొలగిపోయింది.

అయితే, ఇది ఇప్పటికీ పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్, నేపాల్ మరియు ఇండోనేషియా వంటి మార్కెట్లలో మహీంద్రా స్కార్పియో గెట్‌అవే పికప్ ట్రక్కు అమ్ముడవుతోంది. ఇటీవలే, మహీంద్రా స్కార్పియో గెట్‌అవే హిమాలయాల్లో పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది. దీంతో మహీంద్రా ఈ మోడల్‌ను మరోసారి భారతదేశంలో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.

3. మహీంద్రా రోక్సర్ (Mahindra Roxor)
మహీంద్రా స్కార్పియో గెట్‌అవే కొంత కాలం వరకైనా భారతదేశంలో విక్రయించబడింది. కానీ, మహీంద్రా రోక్సర్ మాత్రం అలా కాదు, ఇది అసలు భారతదేశంలో ఎప్పుడూ విక్రయించబడలేదు. ఈ మోడల్ మునుపటి తరం మహీంద్రా థార్ డిఐ మోడల్ పై ఆధారపడి ఉంటుంది.

మహీంద్రా రోక్సర్ యూఎస్ మార్కెట్లో గంటకు 88.5 కిమీ (55mph) ఎలక్ట్రానిక్ గా పరిమితం చేయబడిన టాప్ స్పీడ్ తో వినోదభరితమైన, ఆఫ్-హైవే వాహనంగా విక్రయించబడింది. మహీంద్రా రోక్సర్ దాదాపు కల్ట్ లాంటి ఫాలోయింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది అధిక మైలేజీనిచ్చే 2.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.

4. టయోటా రూమియన్ (Toyota Rumion)
జపనీస్ కార్ బ్రాండ్ టయోటా భారతదేశంలో మారుతి సుజుకి బాలెనో మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కార్లను రీబ్యాడ్జ్ చేసి టయోటా గ్లాంజా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ పేర్లతో విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, టయోటా ఇదే ట్రెండ్ ను పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అనుసరిస్తోంది. మారుతి సుజుకి ఎర్టిగా యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ ను టయోటా రూమియన్ పేరుతో కంపెనీ విదేశీ మార్కెట్లలో విక్రయిస్తోంది.

మారుతి సుజుకి మరియు టయోటా కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, మారుతి సుజుకి ఎర్టిగా ను టొయోటా రీబ్యాడ్జ్ చేసి కొత్త పేరు మరియు టొయోటా బ్యాడ్జ్ తో దీనిని విదేశీ మార్కెట్లలో విక్రయిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది టొయోటా అందిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి ఇన్నోవా క్రిస్టాకి దిగువన విక్రయిస్తోంది. ఓ నివేదిక ప్రకారం, టొయోటా తమ రూమియన్ ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేస్తుందని సమాచారం.

5. టయోటా బెల్టా (Toyota Belta)
ఎర్టిగా మరియు రూమియన్ మాదిరిగానే టయోటా బెల్టా కూడా మారుతి సుజుకి విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్. టయోటా ప్రస్తుతం ఈ మోడల్ ను మధ్య-ప్రాచ్య మార్కెట్లలో విక్రయిస్తోంది. భారతదేశంలో టయోటా బెల్టా సెడాన్‌ను లాంచ్ చేయడానికి అధికారిక ప్రణాళికలు లేనప్పటికీ, టొయోటా తన ప్రోడక్ట్ లైనప్ లోని ఖాళీని పూరించడానికి భవిష్యత్తులో ఈ మోడల్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








