భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 5 ఎస్‌యూవీలు: గ్రాండ్ విటారా ఫస్ట్.. టాటా నెక్సాన్ లాస్ట్..
ప్రస్తుతం, భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చాలా అధికంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద కార్లను కొనుగోలు చేయాలంటే చాలా మంది ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, పెద్ద ఇంజన్ మరియు అధిక సీటింగ్ సామర్థ్యం కార్లు తక్కువ మైలేజీనిస్తాయనే భావన చాలా మందిలో ఉంది. కానీ, మనదేశంలో పెద్ద ఇంజన్ కలిగి ఉన్నప్పటికీ, అధిక మైలేజీనిచ్చే వాహనాలు కూడా చాలానే ఉన్నాయి.

భారత కార్ మార్కెట్లో ఇప్పుడు ఎస్‍యూవీలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. కానీ, మైలేజ్ సమస్య కారణంగా చాలా మంది వీటికి బదులుగా చిన్న హ్యాచ్‌బ్యాక్‌లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ మరియు హైబ్రిడ్ పవర్‌ట్రైన్ వంటి ఆప్షన్లతో అధిక మైలేజీనిచ్చే పెద్ద కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి భారత మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 అత్యధిక మైలేజీనిచ్చే ఎస్‌యూవీలు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

1. మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ (Grand Vitara)
మారుతి సుజుకి ఇటీవలే భారతదేశంలో తమ మొట్టమొదటి హైబ్రిడ్ కారు గ్రాండ్ విటారాను విడుదల చేసింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సోనెట్ మరియు టాటా హారియర్ వంటి మోడళ్లకు పోటీగా మారుతి సుజుకి తమ గ్రాండ్ విటారాను విడుదల చేసింది. ప్రస్తుతం, ఇది ఈ విభాగంలోనే అత్యధిక మైలేజీనిచ్చే ఎస్‌యూవీగా ఉంది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీతో ఈ విభాగంలోనే అగ్రగామిగా నిలుస్తుంది.

గ్రాండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ఎస్‌యూవీలో 1.5-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 114.5 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో కూడా ఇదే పవర్‌ట్రైన్ ఉంటుంది. ఇదే కారు తక్కువ ధరతో మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అందులోని 1.5-లీటర్, 4-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 101 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 21.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

2. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Hyryder)
వాస్తవానికి, టొయోటా హైరైడర్ మరియు మారుతి గ్రాండ్ విటారా రెండు కూడా ఒకే ఇంజన్‌ను కలిగి ఉండి, రెండు వేర్వేరు బాడీ పార్ట్‌లను కలిగి ఉన్న ఎస్‌యూవీలు. కాబట్టి, హైరైడర్ కూడా మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాదిరగానే ఒకేరకమైన మైలేజీని అందిస్తుంది. హైరైడర్ కూడా మైల్డ్ మరియు హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ కారులో ఉపయోగించిన స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ను టొయోటా స్వతహాగా అభివృద్ధి చేసింది. ఇందులోని 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ సెల్ఫ్ చార్జింగ్‌తో కూడిన పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. కేవలం పెట్రోల్ మోడ్‌లో అయితే ఈ ఇంజన్ 91.1 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 79.1 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హైరైడర్ మైలేజీని లీటరుకు 27.97 కిలోమీటర్లను సాధించడం కోసం, ఈ హైబ్రిడ్ ఇంజన్ యొక్క అవుట్‌పుట్ ను కేవలం 114 బిహెచ్‌పికి పరిమితం చేయబడింది.

3. కియా సోనెట్ డీజిల్ (Kia Sonet)
కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో సోనెట్ కూడా ఒకటి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని డీజిల్ ఇంజన్ మోడల్ లీటరుకు 24.1 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తూ ఈ విభాగంలో అగ్రగామిగా ఉంటుంది. కేవలం మైలేజ్ విషయంలోనే కాకుండా ఈ కారు ఫీచర్ల పరంగా కూడా ఫుల్లీ లోడెడ్‌గా ఉంటుంది.

కియా సోనెట్ రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ మోడళ్లలో 1.2-లీటర్ న్యాచురల్ ఇంజన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా, డీజిల్ ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో రెండు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉంటాయి. వీటిలో (డబ్ల్యుజిటి) వేస్ట్-గేట్ టర్బో మరియు (విజిటి) వేరియబుల్ జియోమెట్రీ టర్బో టెక్నాలజీలు ఉంటాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 9.05 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

4. హ్యుందాయ్ వెన్యూ డీజిల్ (Hyundai Venue)
కియా సోనెట్ మాదిరిగానే హ్యుందాయ్ వెన్యూ కూడా ఒకే రకమైన ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. వెన్యూ లోని డీజిల్ వేరియంట్లు లీటరుకు 23.4 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తూ, భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే ఎస్‌యూవీల జాబితాలో నాల్గవ స్థానంలో లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ ప్రీమియం క్వాలిటీ ఫీచర్లతో ఈ విభాగంలో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.10 లక్షల నుండి ప్రారంభం అవుతాయి.

5. టాటా నెక్సాన్ డీజిల్ (Tata Nexon)
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ దేశంలోనే అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీ అని మనందరికీ తెలిసినదే. అత్యుత్తమ సేఫ్టీ మరియు అధునాతన టెక్ ఫీచర్ల కారణంగా ఈ కారు భారతీయులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ యొక్క డీజిల్ వేరియంట్లు లీటరుకు 21.5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి మరియు మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 7.60 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. ఇది పెట్రోల్ ఇంజన్ మరియూ ప్యూర్ ఎలక్ట్రిక్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది.


Click it and Unblock the Notifications








