భారత సైన్యంలో మారుతి జిప్సీ స్థానాన్ని భర్తీ చేయడానికి వేరే మేడ్ ఇండియా కార్లే లేవా..?
మారుతి సుజుకి సంస్థ కొన్ని సంవత్సరాల క్రితం భారత మార్కెట్లో విక్రయించిన తమ పాపులర్ జిప్సీ (Maruti Gypsy) ఎస్‌యూవీని కొన్ని కారణాల వలన డిస్‌కంటిన్యూ చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, ఈ పాపులర్ ఎస్‌యూవీ ఇప్పటికీ భారత సైన్యంలో అధికారిక వాహనంగా సేవలు అందిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, భారత సైన్యంలో కూడా మారుతి జిప్సీని దశలవారీగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. మారుతి జిప్సీ 1980 కాలంలో పరిచయం చేయబడింది, ఆ తర్వాత 2019లో పూర్తిగా ఉత్పత్తి నిలిపివేయబడింది.

మారుతి జిప్సీ ఇండియన్ ఆర్మీ నుండి వెళ్లిపోనున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మార్కెట్లో వేరే ఇతర మోడళ్లు లేవా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి మనదేశంలోని కొన్ని స్వదేశీ ఆటోమొబైల్ కంపెనీలు అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యాలు కలిగిన వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటిని కొద్దిగా ట్వీక్ చేసినట్లయితే, ఇండియన్ ఆర్మీ కోసం ఇవి ఎంతో అనువైన వాహనాలుగా ఉంటాయి. మరి ఆ మేడ్ ఇన్ ఇండియా.. మేడ్ ఫర్ ఆర్మీ వాహనాలు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

1. మహీంద్రా థార్ (Mahindra Thar)
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న కొత్త తరం థార్ ఎస్‌యూవీ ఇటు ఆన్-రోడ్ మరియు అటు ఆఫ్-రోడ్ ప్రయోజనాలకు రెండింటికీ చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీ స్టాండర్డ్ 4x4 డ్రైవ్‌ట్రైన్‌ను కలిగి ఉండి, అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. మహీంద్రా థార్ చాలా కాలంగా మారుతి జిప్సీకి గట్టి ప్రత్యర్థిగా ఉంది మరియు కాబట్టి, భారత సైన్యంలో జిప్సీ స్థానాన్ని సమర్థవంతంగా రీప్లేస్ చేయగలదనేది మా అభిప్రాయం.

వాస్తవానికి, మారుతి సుజుకి జిప్సీ కంటే కూడా మహీంద్రా థార్ చాలా ఆధునికమైన ఇంజన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. మారుతి జిప్సీ కంటే కూడా ఇది ప్రస్తుత కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే అధునాతన పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తుంది. ఇందులోని 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే, ఇందులోని 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, గరిష్టంగా 130 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్‌లు తక్కువ రేషియో గేర్‌బాక్స్ మరియు ఎలక్ట్రానిక్ హబ్ లాక్‌తో కూడిన స్టాండర్డ్ ఫోర్-వీల్-డ్రైవ్ (4WD) సిస్టమ్‌తో అందించబడతాయి.

2. ఫోర్స్ గూర్ఖా (Force Gurkha)
మహీంద్రా థార్‌కు గట్టి పోటీనిచ్చే మరొక దేశీయ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ ఫోర్స్ గుర్ఖా. ఇది పేరుకు తగినట్లుగానే ఎలాంటి పరిస్థితులలో నైనా గుర్ఖా విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలదు. ఫోర్స్ గూర్ఖా సాధారణ కస్టమర్లకు అమ్మకానికి అందుబాటులోకి రావడానికి ముందు 1990ల చివరలో సైన్యం కోసం ట్రయల్ రన్ చేయబడింది. కంపెనీ, ఇటీవలే గడచిన 2021 సంవత్సరంలో ఈ మోడల్ ను చాలా అధునాతనంగా తీర్చిదిద్ది, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో విడుదల చేసింది. ఇది జిప్సీ స్థానాన్ని రీప్లేస్ చేయడానికి ఓ అత్యుత్త మోడల్ గా పరిగణించవచ్చు.

అయినప్పటికీ, ఇది ఇప్పటికీ పాత మోడల్ మాదిరిగానే మొత్తం అదే సైజు, అదే మెర్సిడెస్ బెంజ్ ఇంజన్ మరియు ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంటుంది. కానీ, ఇందులోని లేటెస్ట్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఇందులో తాజాగా జోడించిన డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కార్నరింగ్ ల్యాంప్స్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అనేక కొత్త ఫీచర్లు దీనిని మరింత సురక్షితంగా మారుస్తాయి. ఇంకా ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ స్నార్కెల్, 700 మిమీ వాటర్ వెండింగ్ మరియు 35 డిగ్రీల ఏటవాలులను సులువుగా అధిరోహించగల సత్తా వంటి శక్తి సామర్థ్యాలు దీని సొంతం.

3. రాబోయే మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny)
మారుతి సుజుకి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న జిమ్నీ ఎస్‌యూవీని ప్రస్తుతం భారతదేశంలోనే తయారు చేస్తోంది. వాస్తవానికి, కంపెనీ ఈ మోడల్ కోసం భారత మార్కెట్ ను తమ గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా మార్చుకుంది. భారత మార్కెట్లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోడళ్లలో మారుతి సుజుకి జిమ్నీ కూడా ఒకటి. జపనీస్ మార్కెట్లో ఇది 3-డోర్ మరియు 4-సీటర్ వెర్షన్‌గా విక్రయించబడుతోంది. కాగా, భారత మార్కెట్ కోసం కంపెనీ 4-సీటర్ మరియు 5-డోర్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక మార్కెట్లోకి వచ్చినట్లయితే, ఇది ఆర్మీలో జిప్సీ స్థానాన్ని సులువుగా భర్తీ చేయగలదు.

ప్రస్తుతం, తయారవుతున్న జిమ్నీ ఎస్‌యూవీ నాల్గవ తరానికి చెందినది. దీని కాంపాక్ డిజైన్, లాడర్ ఫ్రేమ్ అండర్‌పిన్నింగ్‌లు మరియు రెట్రో స్టైలింగ్‌తో ఇది సుజుకి జిప్సీ లాంటి డిఎన్ఏను కలిగి ఉంటుంది. ఇందులో శక్తివంతమైన మైల్డ్-హైబ్రిడ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగించారు. ఇది పవర్‌తో పాటుగా మంచి మైలేజీని కూడా డెలవరీ చేస్తుంది. అంతేకాకుండా, ఇది పాత తరం జిప్సీ కంటే కూడా మరింత సురక్షితమైనదిగా ఉంటుంది. సుజుకి జిమ్నీ లాడర్ ఫ్రేమ్ ఛాసిస్, సాలిడ్ ఫ్రంట్ మరియు రియర్ యాక్సిల్స్ మరియు త్రీ-లింక్ ఫ్రంట్ మరియు రియర్ సస్పెన్షన్ సెటప్‌తో ఆఫ్-రోడింగ్‌కు అత్యుత్తమంగా ఉంటుంది.

4. బెస్పోక్ మిలిటరీ-స్పెక్ మహీంద్రా బొలెరో నియో 4x4 (Mahindra Bolero Neo 4x4)
ప్రస్తుతం, మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ పోలీస్ ఫ్లీట్‌లో పాత జీప్ స్థానాలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసినదే. ఇదే మోడల్ ఇండియన్ ఆర్మీకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే, ఇండియన్ ఆర్మీ కోసం దీనికి మరింత ఆధునిక పేరును ఉపయోగించవచ్చు. స్టాక్ మోడల్‌లోని బొలెరో నియోలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు. అయితే, దీనికి మెకానికల్‌గా లాకింగ్ రియర్ డిఫరెన్షియల్ మరియు మల్టీ టెర్రైన్ టెక్నాలజీ (MTT)తో ఆఫ్-రోడర్‌గా మారగల సామర్థ్య మాత్రం ఉంది.

కాబట్టి, మహీంద్రా ఈ బొలెరో నియో ఎస్‌యూవీకి ఆఫ్-రోడ్ సామర్థ్యాలను మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ను జోడించినట్లయితే, ఇది ఆర్మీ కోసం పరిగణలోకి తీసుకునే అత్యుత్తమ వాహనాలలో ఒకటిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో కూడా స్టాండర్డ్ మహీంద్రా బొలెరో మాదిరిగానే అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి శక్తిని మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. మహీంద్రా దీనికి సరైన 4WD సిస్టమ్‌ను ఇస్తే, మహీంద్రా బొలెరో నియో భారత సైన్యానికి మంచి ఎంపికగా ఉంటుంది.

5. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ (Jeep Compass Trailhawk)
అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ విక్రయిస్తున్న కంపాస్ ట్రైల్‌హాక్ ఎస్‌యూవీ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మోడల్ కాకపోయినప్పటికీ, కంపెనీ దీనిని స్థానికంగా భారతదేశంలోనే అసెంబుల్ చేస్తోంది. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఈ జాబితాలో అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ అయినప్పటికీ, ఇది మీరు భారతదేశంలో కొనుగోలు చేయగల చౌకైన ట్రయల్-రేటెడ్ జీప్ గా ఉంటుంది. ఇందులోని విలాసవంతమైన ఇంటీరియర్స్, మంచి రైడింగ్ క్వాలిటీ మరియు కఠినమైన భూభాగాలపై సైతం సులువుగా ప్రయాణించగల శక్తిసామర్థ్యాలు దీని సొంతం.

జీప్ కంపాస్ ఆఫ్-రోడింగ్ కోసం అత్యుతమ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌తో కలిగి ఉంటుంది. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ యొక్క సేఫ్టీ కిట్‌లో 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అండర్ బాడీ ప్రొటెక్షన్ ప్లేట్లు, స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ ఉన్నాయి. ఇది శక్తివంతమైన 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేస్తుంది మరియు ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications