2022 లో భారత్‌లో నిలిపేయబడిన కార్లు: ఫోక్స్‌వ్యాగన్ పోలో నుంచి మహీంద్రా అల్టురాస్ G4 వరకు..
మొత్తానికి 2022 సంవత్సరం ముగిసింది, 2023 లోకి అడుగు పెట్టసాము. అయితే గత సంవత్సరం (2022) అనేక కొత్త కార్లు మార్కెట్లో విడుదలయ్యాయి, అదే సమయంలో కొన్ని కార్లు నిలిపివేయబడ్డాయి. దేశీయ మార్కెట్లో గత సంవత్సరం నిలిపివేయబడిన కార్లను గురించి ఈ కథనంలో ఇక్కడ తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ పోలో:
భారతీయ మార్కెట్లో నిలిపివేయబడింది కార్ల జాబితాలో ఒకటి ఫోక్స్‌వ్యాగన్ యొక్క పోలో. దేశీయ విఫణిలో గత 12 సంవత్సరాలు మంచి ఆదరణ పొందిన ఈ హ్యాచ్‌బ్యాక్ 2022 లో నిలిపివేయబడింది. ఫోక్స్‌వ్యాగన్ పోలో భారతదేశంలో సుమారు 2.5 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయించినట్లు సమాచారం.

జర్మన్ బ్రాండ్ అయినప్పటికీ భారతదేశంలో అధికంగా విక్రయించబడిన ఉత్పత్తులలో పోలో ఒకటి. ఇది 2010 లో దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు అమితంగా పొందగలిగింది. ఈ కారు ధర మార్కెట్లో రూ. 6.45 లక్షల నుంచి రూ. 10.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేది.

రెనాల్ట్ డస్టర్:
2012 లో భారతీయ మార్కెట్లో విడుదలైన రెనాల్ట్ కంపెనీ యొక్క డస్టర్ మొదటి సంవత్సరంలో దాదాపు 40,000 యూనిట్లకు పైగా విక్రయించబడింది. రెనాల్ట్ డస్టర్ 2014లో AWD వేరియంట్‌ను మరియు 2016లో AMT గేర్‌బాక్స్ ఎంపికతో మిడ్-సైకిల్ అప్‌డేట్‌ను పొందింది.

రెనాల్ట్ డస్టర్ కేవలం కొన్ని సంవత్సరాలలో భారతీయ మార్కెట్లో మంచి మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ గా నిలిచింది. అయితే హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి వాహనాల రాకతో ఈ SUV కున్న డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా ఇది స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ మరియు ఎంజి మోటార్ కంపెనీలకు కూడా ప్రత్యర్థిగా వ్యవహరించవలసి వచ్చింది. అయితే ఈ కారు 2022 లో నిలిపివేయబడింది.

హ్యుందాయ్ శాంత్రో:
సోత్ కొరియా బ్రాండ్ అయిన హ్యుందాయ్ శాంత్రో 2018 లో విజయవంతమైన మోడల్ గా నిలిచింది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలు పొందగలిగింది. కానీ కాలక్రమంలో ఇది దాని మనుగడను చాటుకోవడంలో విఫలమైపోయింది. హ్యుందాయ్ శాంత్రో ధర రూ. 4.90 లక్షల నుండి రూ. 6.42 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి ఎస్-క్రాస్:
దేశీయ మార్కెట్లో 2015 లో విడుదలైన మారుతి సుజుకి ఎస్-క్రాస్ గత 7 సంవత్సరాల్లో 1.69 లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. ప్రారంభంలో ఈ మిడ్-సైజ్ SUV హ్యుందాయ్ క్రెటా మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వడంలో విజయం సాధించింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ 1.3-లీటర్ మరియు 1.6-లీటర్ డీజిల్ ఇంజన్ అనే రెండు ఫియట్-సోర్స్డ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లాంచ్ చేయబడిన ఈ కారు తర్వాత దాని పవర్‌ట్రెయిన్ ఎంపికలను కేవలం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌కి తగ్గించింది. ఎందుకంటే దేశంలో బిఎస్ 6 ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత ఈ డీజిల్ ఇంజిన్ నిలిపివేయబడింది. క్రమంగా ఈ కారు యొక్క ఉత్పత్తి కూడా నిలిపివేయబడింది.

మహీంద్రా అల్టురాస్ G4:
దేశీయ విఫణిలో ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచినా మహీంద్రా ఆల్టురాస్ G4 ప్రస్తుతం నిలిపివేయబడింది. మహీంద్రా ఆల్టురాస్ G4 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 181 bhp పవర్ మరియు 420 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

పైన చెప్పిన 5 కార్లు మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో గత సంవత్సరం హ్యుందాయ్ ఎలంట్రా, డాట్సన్ గో, డాట్సన్ గో+, డాట్సన్ రెడిగో, హ్యుందాయ్ ఐ10 ఎన్‌ఐఓఎస్ డీజిల్, హ్యుందాయ్ ఆరా డీజిల్, టయోటా అర్బన్ క్రూయిజర్ మరియు ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటివి కూడా నిలిపివేయబడ్డాయి. అయితే ఈ సంవత్సరం మరిన్ని కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








