గత వారం భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు & బైకులు - వాటి వివరాలు
గత వారం భారతీయ మార్కెట్లో విజయదశమి సందర్భంగా కొత్త కార్లు మరియు బైకులు విడుదలయ్యాయి. ఇందులో మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్, హీరో మోటోకార్ప్ యొక్క విడా ఎలక్ట్రిక్ స్కూటర్, కోమకి వెనిస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్, సుజుకి యాక్సిస్ 125 డ్యూయెల్ టోన్ మొదలైనవి ఉన్నాయి.
దేశీయ మార్కెట్లో గత వారంలో విడుదలైన ఈ కొత్త వాహనాలను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్:
మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క కొత్త 'ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్' (XUV300 TurboSport) దేశీయ మార్కెట్లో రూ. 10.35 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ కొత్త కారు W6, W8 మరియు W8(O) అనే మూడు వేరియంట్స్ లో మరియు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్ ఇప్పుడు కొత్త లోగో మరియు అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. ఇందులోని 1.2 లీ త్రీ సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 130 పిఎస్ పవర్ మరియు 230 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కావున ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మంచి పనితీరుని అందిస్తుంది.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్:
హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ గత వారం చివరలో విడుదల చేసింది. ఇది మొత్తం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 'వి1 ప్రో' (V1 Pro) మరియు 'వి1 ప్లస్' (V1 Plus). వీటి ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కొత్త హీరో విడా V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. అదే సమయంలో ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

అదే సమయంలో Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవతం అవుతుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంటాయి.

కొమాకి వెనిస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్:
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ కొమాకి గత వారం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దాని పేరే కొమాకి వెనిస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర భారతీయ మార్కెట్లో రూ.79,000 (ఎక్స్-షోరూమ్). కోమకి వెనిస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ పైన గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LIPO4) బ్యాటరీ ఉంటుంది.

ఇందులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 1.8 నుండి 2 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందని కూడా కంపెనీ తెలిపింది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయల్-టోన్:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లో తన యాక్సెస్ 125 స్కూటర్ ను ఇప్పుడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌తో విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 83,000 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది ఇప్పుడు సాలిడ్ ఐస్ గ్రీన్ / పెరల్ మిరాజ్ కలర్ కాంబినేషన్‌లో అందుబాటులో ఉంటుంది.

యాక్సెస్ 125 స్కూటర్ 124 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. కావున ఇది గరిష్టంగా 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

జావా 42 బాబర్:
దేశీయ విఫణిలో గత వారం విడుదలైన కొత్త బైకులలో ఒకటి జావా 42 బాబర్. దీని ప్రారంభ ధర రూ. 2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్ మరియు జాస్పర్ రెడ్. అయితే కొనుగోలుదారుడు ఎంచుకునే కలర్ ని బట్టి ధరలు కూడా మారుతాయి.

కొత్త జావా 42 బాబర్ బైక్ 334 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ యూనిట్ పొందుతుంది. ఇది 30.64 హెచ్‌పి పవర్ మరియు 32.64 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, కావున మంచి పనితీరుని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








