కాంటెస్సా (Contessa) పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. అంబాసిడర్ తిరిగి వస్తుందనడానికి ఇదే ప్రూఫ్!
హిందుస్థాన్ మోటార్స్ (Hindustan Motors).. ఒకప్పుడు ఈ పేరు తెలియవారు లేరు. భారత రోడ్లపై రారాజుగా పిలువబడే అంబాసిడర్ (Ambassdor) కారును తయారు చేసిన ఐకానిక్ కంపెనీ ఇది. అయితే, వ్యాపారంలో నష్టాల బాట పట్టి ఈ కంపెనీ మూతపడిపోయింది. ఆ తర్వాత దీనిని పట్టించుకున్న నాధుడే లేడు. కానీ, గత కొన్ని వారాలుగా హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ పేరు తిరిగి ఎక్కువగా వినిపిస్తోంది. అంబాసిడర్ కారు రీ-ఎంట్రీ ఇవ్వబోతోందని, ఈసారి ఎలక్ట్రిక్ కారు రూపంలో రావచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇవి వట్టి పుకార్లేనా? ఇందులో వాస్తవం ఎంత? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

భారతదేశంలో దివాళా తీసిన హిందుస్థాన్ మోటార్స్ కంపెనీని ఫ్రాన్స్ కి చెందిన ప్యూజో ఆటోమోటివ్ బ్రాండ్ కొనుగోలు చేసింది. ప్యూజో ఇప్పుడు భారతదేశపు ఐకానిక్ కార్ బ్రాండ్ అంబాసిడర్ పేరుకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్యూజో బ్రాండ్ కి భారత్‌లో పెద్దగా గుర్తింపు లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్రెంచ్ కంపెనీ నేరుగా భారతదేశంలో ఏదైనా యూరోపియన్ పేరుతో తమ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెడితే అది అంతగా ప్రజల్లోకి చేరకపోవచ్చు. అందుకే కంపెనీ ఓ కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేస్తోంది.

అదేంటంటే.. భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన ఐకానిక్ అంబాసిడర్ పేరును తమ ఎలక్ట్రిక్ కారు కోసం ఉపయోగించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు హిందుస్థాన్ మోటార్స్ వారి అంబాసిడర్ బ్రాండ్ ను పునరుద్ధరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా, ఇప్పుడు భారతదేశంలో హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్ (Hindustan Motors Limited) ద్వారా కాంటెస్సా (Contessa) అనే పేరు కోసం కొత్తగా ట్రేడ్‌మార్క్ దాఖలు చేయబడింది.

అధికారిక డాక్యుమెంట్ ప్రకారం, ఈ పేరు కోసం మార్చి 16, 2022వ తేదీన హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్ ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది. ఇప్పుడు దాని ఆమోదం కూడా లభించింది. కాంటెస్సా ఒకప్పుడు భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారు. హిందుస్థాన్ అంబాసిడర్ తర్వాత ప్రీమియం సెడాన్ గా విక్రయించబడిన మోడల్ ఇది. దీనిని కండలు తిరిగిన (మజిక్యులర్) కారుగా పిలిచేవారు. తాజా సమాచారం ప్రకారం, కాంటెస్సా మరోసారి మార్కెట్లోకి పునరాగమనం చేయబోతోంది, అయితే ఈసారి దాని రిటర్న్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని సమాచారం.

హిందుస్థాన్ మోటార్స్ వారి కాంటెస్సాలో శక్తివంతమైన వి8 ఇంజన్ లేకపోయినా, అమెరికన్ మజిక్యులర్ కార్లలో కనిపించే విధంగా, ఇది కండరాల కలిగిన కారులాగా మంచి వైఖరిని కలిగి ఉండేది. ఈ లక్షణాలతో కారణంగా, ఇది భారతదేశంలో 'దేశీ మజిల్ కార్' టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాంటెస్సా భారత మార్కెట్లో హిందుస్థాన్ మోటార్స్ ఉత్పత్తి అత్యుత్తమ మోడళ్లలో ఒకటి. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ కంపెనీ తయారు చేసిన కాంటెస్సా ను సాధారణ ప్రజలు అంతగా ఆదరించకపోయినప్పటికీ, ఇది ధనవంతులు మరియు సెలబ్రిటీలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

హిందుస్థాన్ మోటార్స్ తాజాగా కాంటెస్సా పేరును మరోసారి ట్రేడ్ మార్క్ చేయడాన్ని చూస్తుంటే, కంపెనీ ఈ కారును తిరిగి ఎప్పుడైనా మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అయితే, ఇది అదే మునుపటి రూపాన్ని కలిగి ఉంటుందా, పవర్‌ట్రైన్ లో ఎలాంటి మార్పులు ఉంటాయి, కారులో అందించబోయే ఫీచర్లు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే.

భారతదేశంలో హిందుస్థాన్ మోటార్స్ పతనంతో, అంబాసిడర్ మరియు కాంటెస్సా రెండూ కూడా మార్కెట్ నుండి కనుమరుగయ్యాయి. అయితే, గత 2017లో అంబాసిడర్ హక్కులను రూ. 80 కోట్లకు ప్యూజో కొనుగోలు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. కొత్త అంబాసిడర్ పవర్‌ట్రైన్ కు సంబంధించిన డిజైన్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నామని ప్యూజో ఇటీవల వెల్లడించింది. రాబోయే అంబాసిడర్‌లోని అదే పవర్‌ట్రెయిన్‌ను కాంటెస్సాలో కూడా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి, ఈ పవర్‌ట్రైన్ గణాంకాల గురించి ఎటువంటి సమాచారం లేదు.

ప్యూజో మరియు హిందుస్థాన్ మోటార్స్ కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ పవర్‌ట్రైన్ ఆధునిక ప్రమాణాలకు సరిపోయేలా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, ప్యూజో ఈవీ విభాగంలో కూడా విదేశాలలో బలమైన పోర్ట్‌ఫోలియోని కలిగి ఉన్నందున, హిందూస్థాన్ మోటార్స్ యొక్క మజిక్యులక్ కారు కాంటెస్సా ఈవీ రూపంలో కూడా ఇక్కడి మార్కెట్లో విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

హిందుస్థాన్ మోటార్స్ కాంటెస్సా భారతదేశంలో 1984 నుండి 2002 వరకు తయారు చేయబడింది, ఇది వాక్స్‌హాల్ (Vauxhall) కార్లపై ఆధారపడి రూపొందించబడినది. మునుపటి కాంటెస్సా వాక్స్‌హాల్ విక్టర్ ఎఫ్ఈ పై ఆధారపడింది మరియు తదుపరి మోడల్ వాక్స్‌హాల్ విఎక్స్ ఆధారంగా రూపొందించబడింది. ఇది 50 బిహెచ్‌పిని ఉత్పత్తి చేసే చిన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండేది మరియు ఈ ఇంజన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉండేది.

ఆ తర్వాతి కాలంలో హిందూస్థాన్ మోటార్స్ ప్రముఖ ఇంజన్ తయారీ సంస్థ ఇసుజుతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారును తయారు చేసి దానికి కాంటెస్సా క్లాసిక్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత 1990 కాలంలో కాంటెస్సా కారులో మరింత శక్తివంతమైన 2.0 లీటర్ ఇసుజు 4ఎఫ్‌సి1 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ డీజిల్ ఇంజన్ యొక్క టార్క్ స్వభావం కాంటెస్సాను మరింత ప్రాచుర్యం పొందేలా చేసింది. కాగా. కొత్త అంబాసిడర్ లేదా కాంటెస్టా కారును మనం భారత రోడ్లపై చూడాలంటే మరో రెండు మూడేళ్ల సమయం పట్టవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








