హైడ్రోజన్ కారులో మొదటిసారిగా పార్లమెంట్ చేరుకున్న 'నితిన్ గడ్కరీ': ఈ కారు ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
భారతదేశంలో ఇంధన ధరలు అమాంతంగా పెరుగుతూనే ఉన్నాయి, అంతే కాకుండా రోజురోజుకి ఇంధన వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రత్యామ్నాయ వాహనాలైన ఎలక్ట్రిక్, CNG మరియు హైడ్రోజన్ వాహనాలను వినియోగిచాలని ప్రభుత్వాలు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఇప్పుడు ఇలాంటి వాహనాల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు.

సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారులు మరియు మంత్రులు కూడా ఇలాంటి వాహనాలనే వాడటానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఒక అడుగు ముందుకు వేసిన ఈ రోజు పార్లమెంటుకు మిరాయ్ అనే హైడ్రోజన్ కారుతో చేరుకున్నాడు.

ఈ రోజు నితిన్ గడ్కరీ ప్రయాణించిన ఈ కారు జపాన్‌కు చెందిన టయోటా కంపెనీ యొక్క కారు. ఇది గ్రీన్ హైడ్రోజన్ కారు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనీ ఈ గ్రీన్ హైడ్రోజన్ కార్ల వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకు ముందే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కారులో ప్రయాణిస్తానని కేంద్ర మంత్రి అన్నారు. అన్నట్టుగానే ఈ రోజు ఆ కారులో పార్లమెంట్ చేరుకుని అందరికి ఆదర్శం అయ్యారు.

టయోటా మిరాయ్ పూర్తిగా హైడ్రోజన్‌తో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి కారు. హైడ్రోజన్ బేస్డ్ అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్‌సిఇవి) పరీక్షించేందుకు చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కారును విడుదల చేశారు. అంతే కాకూండా భారత ప్రభుత్వం 3,000 కోట్ల మిషన్‌ను ప్రారంభించింది, త్వరలో భారతదేశం గ్రీన్ హైడ్రోజన్‌ను పంపే దేశంగా మారుతుందని, కార్బన్ వినియోగిస్తున్న చోట గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించబడుతుందని ఆశిస్తున్నారు.

కర్ణాటకలోని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్లాంట్‌లో దీన్ని తయారు చేయనున్నారు. టయోటా మిరాయ్ యొక్క కాన్సెప్ట్ మోడల్ 2020 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. టయోటా మిరాయ్ యొక్క హైడ్రోజన్ ట్యాంక్ కేవలం 5 నిమిషాల్లో పూర్తిగా నింపబడుతుంది. ఫుల్ ట్యాంక్ హైడ్రోజన్‌తో ఇది దాదాపుగా 646 కి.మీ పరిధిని అందిస్తుంది.

టయోటా మిరాయ్ హైడ్రోజన్ కారు ఎలక్ట్రిక్ వాహనాల వలె సున్నా ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. కావున కాలుష్యం ఏ మాత్రం జరిగే అవకాశం లేదు. టయోటా మిరాయ్ సెడాన్ హై ప్రెజర్ హైడ్రోజన్ ఫ్యూయెల్ ట్యాంక్‌తో వస్తుంది. ఈ కారులోని ఇంజిన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తిని విద్యుత్తుగా మారుస్తుంది, ఇది కారులోని ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని ఇస్తుంది. ఈ ప్రతిచర్య కారు యొక్క ఎగ్జాస్ట్ పైపు ద్వారా బయటకు వచ్చే నీటి ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది.

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే వాహనాలు భవిష్యత్తులో ముఖ్యమైన ఎంపికగా మారే అవకాశం ఉంటుంది. కేవలం కార్లు మాత్రమే కాకుండా, బస్సులు, ట్రక్కులు, ఓడలు మరియు రైళ్లు వంటి వాటికి కూడా ఈ టెక్నాలజీ సరిపోతుంది. రానున్న రెండు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, ఆటో రిక్షాల రేట్లు తగ్గుతాయని, దీనికోసం అవసరమైన జింక్ అయాన్, అల్యూమినియం అయాన్, సోడియం అయాన్ బ్యాటరీలను సిద్ధం చేస్తున్నట్లు గడ్కరీ అన్నారు.

భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ ఉంది. దీనికి ప్రధాన కారణం రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు. అంతే కాకూండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపైనా భారీగా రాయితీలను అందిస్తోంది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరుగుతున్న సమయంలో, వాటికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. దేశంలో 10.60 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం అందించారు. అదే సమయంలో దేశంలో 1,742 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

హైవేలపై కూడా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్లను నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు తెలిపారు. ఈ కారణంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అటువంటి 39 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. వీటి ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదిలాగే కొనసాగితే భారతదేశంలో ఇంధన పెట్రోల్ & డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాల వినియోగం భారీగా పెరుగుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications








