ఏప్రిల్ 2022లో విడుదల కానున్న కొత్త కార్లు: ఎర్టిగా/ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్, కొత్త నెక్సాన్ ఈవీ మరెన్నో..
కరోనా మహమ్మారి తర్వాత భారత ఆటోమొబైల్ మార్కెట్ తిరిగి వేగాన్ని పుంజుకుంది. ఇతర దేశాల్లో ఆటోమొబైల్ కంపెనీలు ఇబ్బందులు పడతుంటే, మనదేశంలో ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటికే అనేక కొత్త కార్లు మార్కెట్లో విడుదల కాగా, వచ్చే ఏప్రిల్ 2022 నెలలో కూడా పలు కొత్త కార్లు విడుదల కానున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ కార్ల నుండి ప్రస్తుత మోడళ్ల యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు కూడా ఉండనున్నాయి. అవేంటో చూద్దాం రండి.

మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్
ప్రస్తుతం, భారత ఎమ్‌పివి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga). కంపెనీ, ఇప్పుడు ఈ పాపులర్ మోడల్‌కి ఫేస్‌లిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కొత్త మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ త్వరలోనే కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లతో మార్కెట్లో విడుదల కానుంది. ఎమ్‌పివి విభాగంలో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కియా కారెన్స్ ఎమ్‌పివికి కొత్త ఎర్టిగా గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్త 2022 ఎర్టిగా మోడల్‌లో కాస్మెటిక్ మార్పుల మినహా ఇతర మార్పులు ఉండకపోవచ్చు. ఇది ప్రస్తుత 1.5 లీటర్ ఇంజన్‌తో పాటుగా కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో రావచ్చని సమాచారం.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రానున్న నేపథ్యంలో, అదే మోడల్ ఆధారంగా కంపెనీ తయారు చేస్తున్న స్టైలిష్ ఎమ్‌పివి మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కూడా కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కొత్త గ్రిల్ మరియు కొత్త బంపర్‌లతో కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అప్‌డేటెడ్ మారుతి ఎక్స్ఎల్6 మునుపటిలా కేవలం 6 సీట్లతోనే కాకుండా, కొత్తగా 7 సీట్ల కాన్ఫిగరేషన్ తో కూడా అందుబాటులోకి రావచ్చని అంచనా.

కొత్త టాటా నెక్సాన్ ఈవీ
ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అగ్రగామి టాటా మోటార్స్ (Tata Motors) అందిస్తున్న నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) లో కంపెనీ ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న నెక్సాన్ ఈవీ పూర్తి చార్జ్ పై 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. కాగా, కొత్తగా రానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సమాచారం. ఈ కొత్త కారులో మునుపటి కన్నా దాదాపు 30 శాతం పెద్ద బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించడం ద్వారా కంపెనీ దీని రేంజ్ ను పెంచనుంది.

ఏప్రిల్ నెలలో విడుదల కాబోయే కొత్త 2022 మోడల్ టాటా నెక్సాన్ ఈవీలో పెద్ద 40 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఫలితంగా, ఇందులో ఎక్కువ రేంజ్ ను పొందటం సాధ్యమవుతుంది. ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది 30.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్
స్వీడన్ కార్ బ్రాండ్ వోల్వో (Volvo) కూడా భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ బ్రాండ్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు "వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్" (Volvo XC40 Recharge) ను దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఇది 2021 సంవత్సరంలోనే భారత మార్కెట్లో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కోవిడ్-19 పరిస్థితులు మరియు సెమీకండక్టర్ చిప్ కొరత వంటి కారణాల వలన ఆలస్యమైంది. అయితే, ఇప్పుడు ఇది ఏప్రిల్ 2022లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

భారత మార్కెట్లో విక్రయించబడే వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ పూర్తిగా విదేశాలలో తయారు చేసి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లుగా (CBU) రూట్ లో ఇండియాకు దిగుమతి చేసుకోనుంది. ఫలితంగా, దీని ధర కూడా విదేశాలతో పోల్చుకుంటే, రెట్టింపుగా ఉండే అవకాశం ఉంది. అంచనా ప్రకారం, దీని ధర సుమారు రూ.75 లక్షలు ఉండే అవకాశం ఉంది. స్టాండర్డ్ గ్యాసోలీన్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని ఈ సరికొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును తయారు చేశారు. ఇది పూర్తి చార్జ్ పై 418 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారతదేశంలో తమ రెండవ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈక్యూసి (EQC) అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో విక్రయిస్తున్న మెర్సిడెస్ బెంజ్, ఇప్పుడు ఈక్యూఎస్ (EQS) అనే ఓ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మెర్సిడెస్ బెంజ్ కొంత కాలం క్రితమే తమ EQS EVని సెడాన్ రూపంలో అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. తాజా సమాచారం ప్రకారం, 2022 బీజింగ్ మోటార్ షో ప్రారంభానికి రెండు రోజుల ముందు, ఏప్రిల్ 19 న ఈ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరించబడనుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ సెడాన్ యొక్క ఈవీఏ2 (EVA2) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కొత్త ఈక్యూఎస్ ఎస్‌యూవీని తయారు చేయనుంది. అంటే, ఇది ఎస్‌యూవీ మరియు సెడాన్‌ల యొక్క కలయికతో వస్తున్న క్రాసోవర్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి, ఇది ఎస్‌యూవీ యొక్క ప్రాక్టికాలిటీతో పాటు సెడాన్ యొక్క లగ్జరీని కూడా కలిగి ఉంటుంది. ఈ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీలో రెండవ వరుసలో కూడా ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్లను అందించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








