దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Volkswagen Virtus: ధర & వివరాలు
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) కంపెనీ గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' (Volkswagen Virtus) విడుదల చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఎట్టకేలకు ఈ మిడ్-సైజ్ సెడాన్ ను ఈ రోజు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభ ధర రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ మోడల్ ధర రూ. 17,91,900 (ఎక్స్-షో రూమ్).
కంపెనీ ఈ సెడాన్ కోసం ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి డైనమిక్ లైన్ కాగా, మరొకటి పర్ఫార్మెన్స్ లైన్. ఇవి 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. డైనమిక్ లైన్ వేరియంట్స్ బేజ్ మరియు బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ ఉన్నాయి. అయితే పర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్స్ లోని సీట్లు రెడ్ కలర్ స్టిచ్చింగ్, అల్యూమినియం పెడల్స్ మరియు డ్యాష్‌బోర్డ్‌పై రెడ్ కలర్ వంటివి పొందుతుంది. ఇవి రెండూ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వేరియంట్స్ వారీగా ధరలు ఈ క్రింద చూడవచ్చు.
| Virtus Dynamic Line 1.0 L TSI | |
| Variant | Price |
| Comfortline MT | ₹11,21,900 |
| Highline MT | ₹12,97,900 |
| Topline MT | ₹14,41,900 |
| Highline AT | ₹14,27,900 |
| Topline AT | ₹15,71,900 |
| Virtus Performance Line 1.5 L TSI Evo | |
| Variant | Price |
| GT Plus DSG | ₹17,91,900 |

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అయితే ఈ సెడాన్ ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా కంపెనీలు కలిసి భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చిన నాల్గవ మోడల్. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ ఉత్పత్తిలో కంపెనీ 95 శాతం స్థానికీకరణను పొందుతుంది.

ఈ కొత్త సెడాన్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,561 మిమీ, వెడల్పు 1,752 మిమీ, ఎత్తు 1,507 మిమీ మరియు వీల్‌బేస్ 2,651 మిమీ వరకు ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన వర్టస్ సెడాన్ ను మొత్తం 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఈ సెడాన్ ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్ లతో కూడిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, పెద్ద ఎయిర్ డ్యామ్, సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి వాటితో పాటు వెనుక వైపు వర్టస్ అనే బ్యాడ్జ్ కూడా పొందుతుంది.

ఈ కొత్త సెడాన్ యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 8 ఇంచెస్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు 8-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఇక బూట్ స్పేస్ 521 లీటర్ల వరకు ఉంటుంది. దీనితో పాటు 60:40 స్ప్లిట్ రియర్-సీట్ ఆప్సన్ కూడా పొందుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది.
ఇక 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజన్ ఇంధనాన్ని ఆదా చేయడానికి సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ కొత్త మిడ్ సైజ్ సెడాన్ లో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలైజన్ బ్రేక్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' స్కోడా స్లావియా, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. మొత్తానికి కంపెనీ తన మిడ్ సైజ్ సెడాన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఇక ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి. ఇటీవల మేము ఈ కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' డ్రైవ్ చేసాము. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








