మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో ఆల్‌గ్రిప్ సెలక్ట్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తమ సరికొత్త గ్రాండ్ విటారా మిడ్-సైజ్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ ఇటీవలే తమ కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ గ్రాండ్ విటారా యొక్క కొన్ని కీలకమైన ఫీచర్లను కూడా వెల్లడి చేసింది. వాటిలో ఒకటి ఆల్ గ్రిప్ సెలక్ట్ (All Grip Select). మరి ఈ ఫీచర్ విశేషాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సుజుకి తమ గ్లోబల్ మోడళ్లలో ఆల్ గ్రిప్ సెలెక్ట్ అనే ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని అందిస్తోంది, ఇప్పుడు ఇది కొత్త గ్రాంట్ విటారా ఎస్‌యూవీలో కూడా పరిచయం చేయబడింది. ఆల్ గ్రిప్ సెలెక్ట్ టెక్నాలజీ మారుతి సుజుకి గ్రాండ్ విటారా 1.5-లీటర్ పెట్రోల్, మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు ఇది బహుళ టెర్రైన్ మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది. సుజుకి నుండి వచ్చిన ఈ ఆల్-గ్రిప్ టెక్నాలజీ గ్రాండ్ విటారాకు విభిన్నమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను అందిస్తుంది.

కంపెనీ ఈ ఆల్ గ్రిప్ యొక్క మూడు వెర్షన్‌లను అందిస్తుంది, ఇందులో మొదటిది ఆల్ గ్రిప్ ఆటో, రెండవది ఆల్ గ్రిప్ సెలెక్ట్ మరియు మూడవది ఆల్ గ్రిప్ ప్రో. అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయించబడే స్విఫ్ట్ మరియు ఇగ్నిస్ వంటి కార్లలో కనిపించే ఆల్ గ్రిప్ ఆటో ఎలాంటి ట్రాక్షన్ మోడ్‌ను పొందలేదు కానీ జారుడు స్వభావం కలిగిన రోడ్లపై మెరుగైన గ్రిప్ కోసం ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది.

ఎస్-క్రాస్, విటారా వంటి మోడల్‌లకు ఆల్ గ్రిప్ సెలెక్ట్ ఇవ్వబడింది, ఇది ఇప్పుడు భారతదేశంలోని కొత్త గ్రాండ్ విటారాలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో ఆటో, స్నో, లాక్ మరియు స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఆల్ గ్రిప్ ప్రో ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ కోసం రూపొందించబడింది, ఇది మరింత శక్తివంతమైనది. దీన్ని సుజుకి జిమ్నీ ద్వారా భారత్‌కు కూడా తీసుకురావచ్చని సమాచారం.

ఆల్ గ్రిప్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
ఆల్ గ్రిప్ సెలెక్ట్ సాధారణంగా ఆటో మోడ్‌లో ఉంటుంది మరియు మెరుగైన మైలేజ్ కోసం ఫ్రంట్ వీల్ డ్రైవ్‌లో పని చేస్తుంది కానీ అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఆల్ వీల్ డ్రైవ్‌కి మారుతుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆల్ గ్రిప్ వేరియంట్ లీటరుకు 19.38 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని స్పోర్ట్ మోడ్ ఘాట్ రోడ్లపై నడపడానికి ఉపయోగపడుతుంది. ఈ మోడ్ కార్నర్ మరియు యాక్సిలరేటింగ్ సమయంలో ఆల్ వీల్ డ్రైవ్ ను ఉపయోగిస్తుంది.

భారతదేశంలో, ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించబడుతోంది కాబట్టి, ప్రజలు దీన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతారు. స్నో మోడ్ జారే రోడ్లపై నాలుగు చక్రాలను ఉపయోగించి, కారును నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది. లాక్ చేయబడిన మోడ్‌లో, కారు ఎల్లప్పుడూ ఆల్-వీల్ డ్రైవ్‌ను ఉపయోగిస్తుంది మరియు జారుడు స్వభావం కలిగిన లేదా రాతి రోడ్లపై కంట్రోల్ తప్పడానికి అనుమతించదు. ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ని ఉపయోగిస్తుంది మరియు చక్రాలు జారిపోయినప్పుడల్లా ఆటోమేటిక్ గా బ్రేక్‌లను అప్లయ్ చేస్తుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్‌లో ఆల్ వీల్ డ్రైవ్ ఎందుకు అందుబాటులో లేదు?
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్‌లో మాత్రమే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే, ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో మాత్రం అందుబాటులో లేదు, ఎందుకంటే ఈ పవర్‌ట్రైన్ సెటప్ టొయోటా నుండి తీసుకోబడింది. ఈ పవర్‌ట్రైన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో అందించబడింది. ఇది సివిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడిన అదే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ కాంబినేషన్ కారణంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఆల్ గ్రిప్ టెక్నాలజీకి అనుకూలంగా లేనందున కంపెనీ ఇందులో ఆల్ వీల్ డ్రైవ్‌ను అందించడం లేదు.

ఇది 1.5-లీటర్ కె-సిరీస్, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 103.06 బిహెచ్‌పి పవర్ మరియు 136.8 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఐడిల్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ, 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. గ్రాండ్ విటారా మాన్యువల్ లీటరుకు 21.11 కిమీ, ఆటోమేటిక్ లీటరుకు 20.58 కిమీ మరియు ఆల్ గ్రిప్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 19.38 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం దేశవ్యాప్తంగా బుకింగ్ లు కూడా ప్రారంభం అయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు నెక్సా డీలర్‌షిప్ ను సందర్శించి కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే, కంపెనీ ఇంకా ఈ ఎస్‌యూవీ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. టొయోటా విడుదల చేసిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ తో పోల్చుకుంటే, దీని ధర కాస్తంత తక్కువగానే ఉండొచ్చని అంచనా. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








