భారత్‌లో రెనో డస్టర్ (Renault Duster) పరిస్థితి ఏంటి..? ఇందులో కొత్త మోడల్ వచ్చేనా..?
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న డస్టర్ మోడల్ గురించి ఎస్‌యూవీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత ఎస్‌యూవీ కార్ మార్కెట్లో సంచలనం సృష్టించిన మోడళ్లలో 'రెనో డస్టర్' (Renault Duster) కూడా ఒకటి. యూరోపియన్ డిజైన్ డిఎన్‌ఏతో కార్ ప్రియులను ఆకట్టుకున్న డస్టర్ ఇప్పుడు భారత మార్కెట్ నుండి తొలగిపోతున్న సంగతి తెలిసినదే. రెనో ఈ మోడల్ ను మార్కెట్లో విడుదల చేసి దాదాపు దశాబ్ధం కావస్తున్నప్పటికీ, కంపెనీ ఇందులో ఎలాంటి మేజర్ అప్‌డేట్స్ చేయలేకపోయింది.

ప్రస్తుతం, మార్కెట్లో ఇదే విభాగంలో రెనో డస్టర్ కి పోటీగా లభిస్తున్న అనేక ఇతర ఎస్‌యూవీలు చూడటానికి ఎంతో మోడ్రన్ గా ఉంటూ, ఆధునిక సాంకేతిక ఫీచర్లతో నిండి ఉన్నాయి. పెరిగిన పోటీ కారణంగా భారత మార్కెట్లో రెనో డస్టర్ ను ఆదరించే కస్టమర్లు కరువయ్యారు. దీంతో కంపెనీ ప్రస్తుత తరం రెనో డస్టర్ అమ్మకాలను మరియు తయారీని నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా రెనో తమ డస్టర్ ఎస్‌యూవీని మరింత మోడ్రన్ తీర్చిదిద్దింది.

కొత్త తరం రెనో డస్టర్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించబడింది. అయితే, ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కొత్త తరం రెనో డస్టర్ భారత మార్కెట్లో విడుదలవుతుందా లేదా అనేదే. దీనికి సమాధానం అవుననే వినిపిస్తోంది. కాకపోతే, ఇందుకు కాస్తంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి ఈ కొత్త తరం రెనో డస్టర్ ఎస్‌యూవీ గురించి మాకేం తెలుసో చూద్దాం రండి..!

ఈసారి తగ్గేదే లేదు..! అంతకు మించి..!!
కొత్త తరం డస్టర్ (Renault Duster) విషయంలో ఈసారి తగ్గేదే లేదు అంటోంది రెనో బ్రాండ్. ప్రస్తుత కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా, మార్కెట్ ట్రెండ్ ను అనుసరించి ఆధునిక డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్లతో కంపెనీ ఈ మోడల్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగా కేవలం ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల వలె కాకుండా, పూర్తిగా స్క్రాచ్ నుంచి ఈ కొత్త ఎస్‌యూవీ తయారు చేస్తున్నారు. కొత్తగా రాబోయే రెనో డస్టర్ గతంలోని మోడళ్ల కన్నా ధీటుగా, అంతకు మించి ఉంటుందని చెబుతున్నారు.

పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్ పై తయారీ..!
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నెక్సట్ జనరేషన్ రెనో డస్టర్ (Next Gen Renault Duster) ఎస్‌యూవీని పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్ పై రూపొందించనున్నారు. ఈసారి కొత్త డస్టర్ ను సిఎమ్‌ఎఫ్-బి ఎల్ఎస్ (CMF-B LS) ప్లాట్‌ఫామ్ పై తయారు చేయనున్నారు. ఇది ప్రస్తుతం జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్‌వ్యాగన్ ఉపయోగిస్తున్న MQB A0-IN ప్లాట్‌ఫామ్ ను పోలి ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు ఈ ప్లాట్‌ఫామ్ పై టైగన్, వర్చ్యుస్, స్లావియా మరియు కుషాక్ వంటి మోడళ్లను తయారు చేస్తున్నారు.

అంటే, రెనో కూడా ఈ ప్లాట్‌ఫామ్ ను ఆధారంగా చేసుకొని కేవలం కొత్త తరం డస్టర్ ఎస్‌యూవీని మాత్రమే కాకుండా వివిధ రకాల ఇతర మోడళ్లను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కొత్త CMF-B LS ప్లాట్‌ఫామ్ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు అన్ని ఉద్గార మరియు ప్రపంచ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం కొత్త డస్టర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో కూడా అందించబడుతుందని భావిస్తున్నారు.

కొత్త తరం డస్టర్ లో ఎలాంటి ఫీచర్లు ఉండొచ్చు..?
కొత్త తరం రెనో డస్టర్ కూడా దాని పాత మోడల్ డిజైన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, మరింత ఆధునికతను జోడించుకొని, రగ్గడ్ లుక్‌తో మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో పెద్ద ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, స్క్వేర్డ్ ఆఫ్ ఫెండర్‌లు, ఇంటిగ్రేటెడ్ హెడ్‌లైట్, సరికొత్త గ్రిల్ మరియు మంచి ఆఫ్ రోడర్ స్టాన్స్ వంటి ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు. కేవలం ఎక్స్టీరియర్లలో మాత్రమే కాకుండా, ఇంటీరియర్లలో కూడా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ ఫీచర్లతో పాటుగా మరిన్ని కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లను అలాగే ఆధునిక సేఫ్టీ ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది.

మరి ఇంజన్ ఆప్షన్ ఎలా ఉంటాయ్..?
గతంలో రెనో ఇండియా తమ డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ లతో అందించింది. కొత్త తరం రెనో డస్టర్ లో కూడా ఇవే ఇంజన్లను మరింత రీఫైన్ చేసి ఉపయోగించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, భారతదేశంలో, ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో కూడా అందించబడుతుందని సమాచారం. అలాగే, ఇక్కడి పరిస్థితులు అనుకూలిస్తే, ఇందులో ఓ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

గతంలో మాదిరిగా ఈసారి కూడా 4x4 ఉంటుందా..?
రెనో డస్టర్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలైన కొత్తలో కంపెనీ ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ ను కూడా అందించేది. అయితే, డస్టర్ ను కంపెనీ BS6 అవతార్ లో ప్రవేశపెట్టినప్పుడు ఇందులో అత్యంత ప్రత్యేకమైన ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఫీచర్ ను కంపెనీ తొలగించింది. ఇది ఆఫ్-రోడింగ్ కోరుకునే ఎస్‌యూవీ ఔత్సాహికులను చాలా నిరాశకు గురి చేసింది. అయితే, ఇటీవలి కాలంలో మనదేశంలో కూడా ఆఫ్-రోడ్ మరియు 4x4 వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, రెనో తమ కొత్త తరం డస్టర్ ఎస్‌యూవీలో ఈ ఫీచర్ ను తిరిగి అందించే అవకాశం ఉంది. మరి, ధర పరంగా ఇది ఎంత వరకూ సాధ్యమవుతుందనేది వేచి చూడాలి.

లాంచ్ ఎప్పుడు ఉంటుంది..? పోటీ ఎవరు..?
కొత్త తరం రెనో డస్టర్ యొక్క కాన్సెప్ట్ దశ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే, ఇది వాస్తవ ప్రపంచంలో ఉత్పత్తి దశకు చేరుకోవడానికి మరో ఏడాది నుండి రెండేళ్ల వరకూ సమయం పట్టే అవకాశం ఉంది. అంటే, ఈ సరికొత్త డస్టర్ లాంచ్ 2023-24లో జరిగే అవకాశం ఉంది. రెనో డస్టర్ భారతదేశంలోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పాపులర్ మోడళ్లయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు మారుతి ఎస్-క్రాస్ వంటి కార్లతో పోటీగా నిలిచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








