పెట్రోల్ ధరలు పెరిగాయని చింతిస్తున్నారా..? అయితే ఇదిగో బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 డీజిల్ కార్లు..
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు రూ.100 పైగానే ఉన్న సంగతి తెలిసినదే. చాలా రాష్ట్రాలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల మధ్య అంతరం దాదాపు రూ.10-20 మధ్యలో ఉంటోంది. ఈ నేపథ్యంలో, చాలా మంది కస్టమర్లు పెట్రోల్ కార్లను కొనాలా లేక డీజిల్ కార్లను కొనాలాని ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి, పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పెట్రోల్ కార్లు అందించే మైలేజ్ మాత్రం డీజిల్ కార్ల కన్నా తక్కువగానే ఉంటుంది.

కాబట్టి, ప్రస్తుత అధిక ఇంధన పరిస్థితుల నేపథ్యంలో, కాస్తంత ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు పెట్రోల్ కార్లకు బదులుగా డీజిల్ కార్లను కొనుగోలు చేయడం మంచిది. భారతదేశంలో కొత్త కాలుష్య ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్ కంపెనీలు కూడా నాణ్యమైన డీజిల్ ఇంజన్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. కాబట్టి, ప్రస్తుత ఆధునిక డీజిల్ ఇంజన్లు మునుపటి కన్నా మెరుగైనవిగా ఉంటాయి. మరి ఈ కథనంలో ప్రస్తుతం భారతదేశంలో లభిస్తున్న టాప్ 5 అత్యంత సరసమైన డీజిల్ కార్లు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ - రూ. 7.22 - 8.51 లక్షలు
కొరియన్ కార్ కంపెనీ అందిస్తున్న చిన్న కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 NIOS) ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత సరసమైన డీజిల్ కారుగా ఉంది. ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇది డీజిల్ ఇంజన్ తో లీటరుకు 25 కిమీ పైగా మైలేజీని అందిస్తూ మంచి అర్బన్ హ్యాచ్‌బ్యాక్ గా ఉంటుంది. ఇదే విభాగంలోని పెట్రోల్ కార్లు సగటున లీటరుకు 17-20 కిమీ మైలేజీని మాత్రమే అందిస్తాయి. కాబట్టి, మైలేజ్ మరియు దీని సరసమైన ధర పరంగా ఇది ఈ జాబితాలో టాప్ 1 స్థానంలో ఉంటుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో Apple CarPlay మరియు Android Autoతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఎమ్ఐడి డిజిటల్ స్పీడోమీటర్, క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది గరిష్టంగా 73.75 బిహెచ్‌పి శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 7.22 లక్షల నుండి రూ. 8.51 లక్షల మధ్యలో ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ - రూ. 7.42 - 10.15 లక్షలు
ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉండేది టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) హ్యాచ్‌బ్యాక్. ప్రస్తుతం, దేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో టాటా ఆల్ట్రోజ్ కూడా ఒకటి. ఇది క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కూడా లీటరు డీజిల్‌కు 25 కిమీ పైగా సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే, టాటా ఆల్ట్రోజ్ కారులో కూడా ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెద్ద 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఈ ఇంజన్ గరిష్టంగా 88.78 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో ఇంకా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులోకి రాలేదు. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో కూడిన టాటా ఆల్ట్రోజ్ ARAI సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటరుకు 25.11 కిమీ మైలేజీనిస్తుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 7.42 లక్షల నుండి రూ. 10.15 లక్షల మధ్యలో ఉన్నాయి.

హ్యుందాయ్ ఆరా - రూ. 7.97 - 9.42 లక్షలు
హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) అనేది ఈ బ్రాండ్ విక్రయిస్తున్న గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ యొక్క కాంపాక్ట్ సెడాన్ వెర్షన్. ఈ సెడాన్ సిల్హౌట్ కారణంగా హ్యుందాయ్ ఆరా గ్రాండ్ ఐ10 నియోస్ కంటే ఎక్కువ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది మరియు దీనిని ఒక గొప్ప ఫ్యామిలీ కారుగా చేస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే, హ్యుందాయ్ ఆరాలో కూడా 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 5.3 ఇంచ్ డిజిటల్ స్పీడోమీటర్, ఎమ్ఐడి, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి మరెన్నో ఫీచర్లు లభిస్తాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే హ్యుందాయ్ ఆరా కూడా అదే 1.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 73.75 బిహెచ్‌పి శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని మైలేజ్ గణాంకాలు కూడా ఇంచు మించు ఐ10 నియోస్ మాదిరిగానే ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే, ఇది హ్యుందాయ్ ఆరా మార్కెట్లో రూ. 7.97 లక్షల నుండి రూ. 9.42 లక్షల మధ్యలో విక్రయించబడుతోంది.

హ్యుందాయ్ ఐ20 - రూ. 8.29 - 10.85 లక్షలు
హ్యుందాయ్ అందిస్తున్న మరొక అద్భుతమైన డీజిల్ కారు హ్యుందాయ్ ఐ20 (Hyundai i20). ఇది గ్రాండ్ ఐ10 నియోస్ కన్నా ప్రీమియంగా, స్టైలిష్ మరియు ఫీచర్-రిచ్‌గా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇది టాటా ఆల్ట్రోజ్‌కి గట్టి పోటీగా ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ ఐ20 కారు దాని మునుపటి మోడళ్ల కంటే కూడా ఎక్కువ స్థలాన్ని మరియు సాంకేతికతను కలిగి ఉంటుంది.

ఈ ప్రీమియం కారులో లభించే ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, రియర్ ఏసి వెంట్స్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో పెద్ద 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఐ20 హ్యాచ్‌బ్యాక్ ARAI సర్టిఫైడ్ చేసిన దాని ప్రకారం, లీటరుకు 25.2 కిమీ మైలేజీనిస్తుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 8.29 లక్షల నుండి రూ. 10.85 లక్షల మధ్యలో ఉన్నాయి.

టాటా నెక్సాన్ - రూ. 8.60 - 13.90 లక్షలు
టాటా మోటార్స్ విక్రయిస్తున్న మరొక శక్తివంతమైన కారు టాటా నెక్సాన్. ఇది దేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ఈ కారులో ఆటో హెడ్‌లైట్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రియర్ ఏసి వెంట్స్, ప్రీమియం 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ (TC), డ్రైవ్ మోడ్‌లు వంటి మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో కూడా లభిస్తుంది. ఇందులోని డీజిల్ వెర్షన్‌లో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తి మరియు 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన టాటా నెక్సాన్ ARAI ధృవీకరించబడిన దాని ప్రకారం లీటరుకు 21.19 కిమీ మైలేజీని అందిస్తుండగా, AMT గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 22.07 కిమీ మైలేజీనిస్తుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 8.60 లక్షల నుండి రూ. 13.90 లక్షల మధ్యలో ఉన్నాయి (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).


Click it and Unblock the Notifications








