రూ. 57.90 లక్షల '3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసిన BMW: డిజైన్, ఫీచర్స్ & మైలేజ్ వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎండబ్ల్యు భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన '3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్' విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.57.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బిఎండబ్ల్యు ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశీయ మార్కెట్లో BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ అనేది లాంగ్ వీల్ బేస్ కలిగి రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 330Li పెట్రోల్ మరియు 320Ld డీజిల్ వేరియంట్స్. వీటి ధరలు వరుసగా రూ. 57.90 లక్షలు మరియు రూ. 59.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు డిజైన్ పరంగా కానీ, ఫీచర్స్ పరంగా కానీ చాలా ఉత్తమంగా ఉంటాయి.

BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ రీడిజైన్ చేయబడిన హెడ్‌లైట్‌లను పొందుతుంది, కావున ఇవి దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా సన్నగా ఉంటాయి. అంతే కాకుండా ఇది ఇన్వర్టెడ్ L-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఇండికేటర్ల మాదిరిగా పనిచేస్తాయి. దీనితో పాటు రీ-స్కల్ప్టెడ్ కిడ్నీ గ్రిల్స్, రీడిజైన్ చేయబడిన బంపర్ మరియు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు.
3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. ఇది దాని స్టాండర్డ్ 3 సిరీస్ కంటే 110 మిమీ పొడవైన వీల్‌బేస్ పొందుతుంది. కావున ఇది చూడటానికి ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ వలె ఉంటుంది. వీల్‌బేస్ మాత్రమే కాకుండా ఈ ఫేస్‌లిఫ్ట్ పొడవు కూడా 4 మిమీ ఎక్కువగా ఉంటుంది. అయితే సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ లో ఎక్కువ మార్పులు లేదని మనకు తెలుస్తుంది.

BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో గమనించదగ్గ అతి పెద్ద మార్పు ఇదే అని చెప్పవచ్చు. దీనితో పాటు ఇది 12.3 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది వాహనం గురించి కావలసిన సమాచారాన్ని డ్రైవర్ కి అందిస్తుంది. ఇది కొత్త స్టీరింగ్ వీల్ కూడా పొందుతుంది.
కొత్త BMW ఫేస్‌లిఫ్ట్ లో గమనించదగ్గ ఇంకో మార్పు సెంటర్ కన్సోల్‌లో కొత్తగా డిజైన్ చేయబడిన డ్రైవ్ సెలెక్టర్ లివర్. ఇందులోని స్టీరింగ్ వీల్ మంచి పట్టుని అందించేలా రూపొందించబడింది. అంతే కాకుండా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు త్రి జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది. దీనిని టచ్ లేదా వాయిస్ కంట్రోల్ ద్వారా వినియోగించుకోవచ్చు. మొత్తం మీద ఇది అద్భుతమైన ఫీచర్స్ పొందుతుందని చెప్పవచ్చు.

కొత్త BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 190 hp పవర్ మరియు 400 Nm టార్క్ అందిస్తుంది. ఇక 2.0 పెట్రోల్ ఇంజిన్ 258 hp పవర్ మరియు 400 Nm టార్క్ అందిస్తుంది. 330Li లోని పెట్రోల్ ఇంజన్ 6.2సెకన్లలో 0-100 kph వరకు వేగవంతం అవుతుంది. ఇది 15.39 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.
అదే సమయంలో 320 Ld లోని డీజిల్ ఇంజిన్ కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది 19.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీన్ని బట్టి చూస్తే బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ ఉత్తమ మైలేజ్ అందిస్తుందని స్పష్టమవుతోంది. ఈ లగ్జరీ ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ C- క్లాస్ మరియు ఆడి ఏ4 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








