ఆటో ఎక్స్‌పో 2023: భారత్‌లో అడుగుపెట్టిన కొత్త Lexus RX: అదిరిపోయే లుక్ & అద్భుతమైన ఫీచర్స్
ఎంతో అట్టహాసంగా జరుగుతున్న 2023 ఆటో ఎక్స్‌పోలో లెక్సస్ కంపెనీ తన RX SUV ని ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఈ SUV ని రెండు ట్రిమ్స్ లో అందిస్తుంది. అవి ఒకటి RX 350h లగ్జరీ మరియు RX 500h F స్పోర్ట్ పెర్ఫార్మెన్స్. లెక్సస్ RX గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
లెక్సస్ RX కోసం కంపెనీ 2023 మార్చి లోపు బుకింగ్స్ స్వీకరించే అవకాశం ఉంది. డెలివరీలు కూడా ఈ సంవత్సరంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. కంపెనీ ఈ SUV ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, అయితే ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత మెర్సిడెస్ బెంజ్ GLE, బిఎండబ్ల్యు ఎక్స్5, ఆడి క్యూ7 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

లెక్సస్ RX 350h లగ్జరీ వేరియంట్ 2.5-లీటర్ టర్బో-ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఒక CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిపి 247 hp పవర్ డెలివరీ చేస్తుంది. అదే సమయంలో ఈ వేరియంట్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కేవలం 8.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది.
ఇక రెండవ వేరియంట్ అయిన RX 500h F స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది అధిక పర్ఫామెన్స్ అందించే వెర్షన్. ఈ వెర్షన్ 2.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ 366 hp పవర్ మరియు 460 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబటులో ఉంటుంది. ఇది కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

కొత్త లెక్సస్ RX మంచి డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. లెక్సస్ RX యొక్క రెండు వేరియంట్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కొంత భిన్నంగా ఉంటాయి. స్టాండర్డ్ మోడల్ బంపర్‌లో క్రోమ్ యాక్సెంట్స్ ఉంటాయి. అదే సమయంలో ఎఫ్-స్పోర్ట్ పియానో బ్లాక్ యాక్సెంట్స్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ పరంగా కొత్త లెక్సస్ SUV చాలా ఆధునికంగా ఉంటుంది. కావున ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.
లెక్సస్ RX పరిమాణంలో కూడా వాహన వినియోగదారులకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి. ఈ SUV యొక్క పొడవు మరియు ఎత్తు దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో వీల్‌బేస్ 60 మిమీ, వెడల్పు 25 మిమీ పెరిగింది. కావున ఈ SUV వీల్‌బేస్ ఇప్పుడు 2850 మిమీ వరకు ఉంటుంది, అదే సమయంలో వెడల్పు 1920 మిమీ వరకు ఉంటుంది. రియర్ ట్రాక్ కూడా పెరిగింది.

కొత్త లెక్సస్ RX ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇంటీరియర్ మూడు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి బ్లాక్, బ్రౌన్ సెలియో మరియు సోలిస్ వైట్. ఇందులో విశాలమైన పనోరమిక్ సన్‌రూఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ప్రయాణంలో మంచి లగ్జరీ అనుభూతిని అందించడంలో సహాయపడుతుంది.
లెక్సస్ RX మొత్తం ఎనిమిది కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి నిక్ క్వార్ట్జ్, సోనిక్ క్రోమ్, సోనిక్ ఇరిడియం, గ్రాఫైట్ బ్లాక్, రెడ్ మైకా, సోనిక్ టైటానియం మరియు డీప్ బ్లూ మైకా. ఇందులో డీప్ బ్లూ మైకా అనేది ఇంతకు ముందే అందుబాటులో ఉన్న కలర్ ఆప్సన్. అయితే కంపెనీ ఇప్పుడు కొత్తగా సోనిక్ కాపర్ కలర్ జోడించింది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. లెక్సస్ RX ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.


Click it and Unblock the Notifications








