కారు కొనుగోలు చేస్తున్నారా.. మాన్యువల్ లేదా ఆటోమేటిక్.. ఏది ఎంచుకోవాలి?
కార్లు కొనుగోలు చేయాలనే భావన చాలా మందికి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లలో ఏది కొనుగోలు చేయాలి, ఏ వేరియంట్ ఎంచుకోవాలి.. వంటి ఆలోచనలు కొంత ఒత్తిడికి గురిచేస్తాయి. దీని కోసం చాలా మంది నిపుణులను లేదా కార్ల యాజమానులను సంప్రదిస్తుంటాం. కానీ నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతుంటాం.
ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ లేదా మాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్లలో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నిపుణులు కూడా వివిధ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అయితే మీరు కూడా కారు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండి. ఈ తరహా ఆలోచన, ఒత్తిడి లోనవుతున్నట్లయితే ఈ కథనం మీకోసం.

మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లు రెండింటిలో కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి. అయితే ఈ రెండు టెక్నాలజీల గురించి కొన్ని వాస్తవాలు మీకు తెలియజేస్తాం. ఫలితంగా ఆటోమేటిక్, మాన్యువల్ వేరియంట్లను ఎంచుకొనేందుకు మీకు సహాయపడే అవకాశం ఉంది. మాన్యువల్ ట్రాన్సిమిషన్.. ఆటోమేటిక్ టెక్నాలజీ కంటే ముందు నుంచి అందుబాటులో ఉంది.
ధర మరియు నిర్వహణ వ్యయం తక్కువ : ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్ల కంటే మాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్ల ధర కాస్త తక్కువగా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్సిమిషన్ కార్ల నిర్వహణ కూడా చౌకగా ఉంటుంది. ఫలితంగా మాన్యువల్ కార్లు వల్ల డబ్బు కొద్దిగా ఆదా అవుతుంది.
ఇంధన సామర్థ్యం : కొద్దిగా పాత తరం ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్ల కంటే మాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్ల మైలేజ్ ఎక్కువగా వస్తుంది. సుమారు 15 శాతం ఇంధనం ఆదా అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న అధునాత ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు.. మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ తరహాలోనే సుమారుగా మైలేజ్ ఇస్తున్నాయి.
అధిక ట్రాఫిక్ పరిస్థితుల్లో.. : పట్టణ, నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద మాన్యువల్ ట్రాన్సిమిషన్ గేర్‌బాక్స్ వల్ల కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అదే పనిగా క్లచ్ వినియోగం మరియు గేర్ మార్చేందుకు ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంటుంది.

* ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్: ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఎలాంటి రద్దీ లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయినా ఒత్తిడి లేని డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ కారణంగా ఎక్కువ మంది డ్రైవర్లు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను కలిగిన కార్లపై మొగ్గు చూపవచ్చు.
వినియోగం ఎంతో సులభం: పరిస్థితిని బట్టి కారు గేర్ల మార్చడం పెద్ద కష్టం అనిపించదు. కానీ ఎప్పుడు గేర్లు మార్చాలో తెలిసేందుకు మాత్రం డ్రైవర్‌కు ప్రత్యేక నైపుణ్యం అవసరం. ప్రస్తుతం ఎక్కువ మంది యువతరం డ్రైవర్లు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వాహనాలను ఇష్టపడుతున్నారు.
ఎత్తైన ప్రాంతాల్లో : ఎత్తైన కొండ ప్రాంతాలు లేదా నిటారుగా ఉన్న ప్రదేశాల్లో .. తక్కువ డ్రైవింగ్ అనుభవం ఉన్న వారు.. మాన్యువల్ ట్రాన్సిమిషన్ కార్లను డ్రైవ్ చేయడం కొంచెం కష్టం. అదే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నిటారుగా ఉన్న ప్రాంతాల్లోనైనా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.
ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వ్యవస్థ ఎంతో సంక్లిష్టమైనది. మరియు మాన్యువల్ ట్రాన్సిమిషన్ కంటే ఎక్కువ విడిభాగాలు అవసరం. ఫలితంగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్ల ధర కొంచెం అధికంగా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్ల రిపేర్ కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఎక్కువ వ్యయం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








