దేశంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. విడుదల అయితే మార్కెట్లో గట్టి పోటీ..
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ల మాదిరిగానే, భారత్‌లోనూ లగ్జరీ కారు బ్రాండ్‌లు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం, టాటా మోటార్స్ కంపెనీ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టాటా మోటార్స్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్, టిగోర్ EV, టియాగో EVలను విడుదల చేసి మాస్ మార్కెట్‌లో సింహభాగాన్ని కైవసం చేసుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ టాటా నెక్సాన్. దీంతో దేశంలోనే నంబర్ 1 కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది.

దేశంలో ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసిన తర్వాత, టాటా మోటార్స్ మరో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని చూస్తోంది. స్వదేశీ కార్ బ్రాండ్ 2019 జెనీవా మోటార్ షో మరియు 2020 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ వెర్షన్‌ను ప్రదర్శించినప్పటి నుంచి ఇది భారత్‌లో వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది.
మరోవైపు, ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడిన మారుతి సుజుకి EVX కాన్సెప్ట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇది భారత్‌లో ఆటోమేకర్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ప్రివ్యూగా నిలిచింది. ఈ కొత్త మారుతి ఎలక్ట్రిక్ కారు 2025లో విడుదల కానుంది. మహీంద్రా & మహీంద్రా, BYD, MG మోటార్స్, కియా మరియు హ్యుందాయ్ వంటి కార్ బ్రాండ్‌లు ఇప్పటికే మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి.

కానీ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ రంగంలో అడుగుపెట్టని మారుతి ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును తయారుచేయాలని చేస్తోంది. మారుతీ ఎలక్ట్రిక్ కారు విడుదల తర్వాత పోటీ పెరగడంతో పాటు.. ప్రస్తుతం భారత మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్‌తో నేరుగా పోటీపడనుంది. దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు ఇ కార్లు టాటా ఆల్ట్రోజ్ EV, మారుతి సుజుకి EVX మార్కెట్‌ను సుసంపన్నం చేయనున్నాయి.
టాటా ఆల్ట్రోజ్ EV : ఆటో ఎక్స్‌పో 2020 లో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడిన టాటా ఆల్ట్రోజ్ ఈవీ.. భారత్‌లో అత్యంతగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వెర్షన్‌గా ఉన్న ఈ ఈవీ ICE వెర్షన్ మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. నెక్సాన్, టిగోర్ మరియు టియాగో యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో కనిపించే విధంగా కొన్ని ప్రత్యేక స్టైలింగ్ అంశాలు ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్ EV Ziptron పవర్‌ట్రెయిన్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు శక్తిని పంపుతుంది. ఈ టాటా ఆల్ట్రోజ్ EVలోని లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో రావచ్చు.
మారుతి సుజుకి EVX : 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన మారుతి సుజుకి EVX ఆటోమోటివ్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇది 2025లో మార్కెట్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ టాటా పంచ్ లీగ్‌లో ఉన్నట్లు కనిపించే మైక్రో SUVని ప్రివ్యూ చేసింది.

మారుతి సుజుకి వినియోగదారులకు సరసమైన ధరలో కార్లను అందిస్తుంది. ఆ కోణంలో చూస్తే మారుతి సుజుకి EVX మార్కెట్‌లోకి వస్తే తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కారుగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. EVX 60kwh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కి.మీ ల పరిధిని ఇవ్వనుందని కంపెనీ ప్రకటించింది.


Click it and Unblock the Notifications








