కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారత్ NCAP ను ప్రారంభించిన మంత్రి నితిన్ గడ్కరీ.. ప్రయోజనాలివే..
ఇకపై భారతీయ కార్ల తయారీదారులు తమ కార్లను సేఫ్టీ రేటింగ్ కోసం గ్లోబల్ NCAPకి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోనే కార్లలో ప్రయాణికుల భద్రతను నిర్ధారించే భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(భారత్ NCAP)ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంగళవారం భారత్ NCAP లోగో, స్టిక్కర్ ను మంత్రి ఆవిష్కరించారు. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, లాటిన్ అమెరికా వంటి తమ సొంత NCAP దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP)'ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు (ఆగస్టు 22) ఢిల్లీలో ప్రారంభించారు.

భారతదేశంలో రోడ్డు భద్రత మరియు కారు భద్రతను నిర్ధారించే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ NCAP పథకాన్ని ప్రారంభించారు. ఇది 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న వాహనాల కార్లకు సేఫ్టీ రేటింగ్ ఇవ్వనుంది. భారత్ NCAPని అమెరికా, జపాన్ దేశాల గ్లోబల్ NCAP మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించారు.
కార్లను మార్కెట్లోకి విడుదల చేసే ముందు కారు ఫ్రంటల్, సైడ్, పోల్ వైపు క్రాష్ టెస్ట్, సామర్థ్యం ఆధారంగా రేటింగ్ ఇవ్వనున్నారు. కారు ముందు భాగం, కారు సైడ్ ప్రొఫైల్, పోల్ సైడ్ క్రాష్ టెస్ట్ చేస్తారు. భారత్ NCAP టెస్ట్ నిబంధనలు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ ప్రొటోకాల్‌లకు దాదాపు సమానంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపింది.
దీని ప్రకారం 1 - 5 స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. కాగా భారత్ కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాంను 2016లోనే ప్రకటించారు. దీనిని జూన్ 2023లోనే ఆమోదించారు. ఇప్పుడు ఎట్టకేలకు అధికారికంగా అమలులోకి వచ్చింది. దీని వల్ల ఆటోమొబైల్ తయారీసంస్థలకు క్రాష్ టెస్ట్ కోసం అయ్యే ఖర్చు తగ్గుతుంది.
భారత్ NCAP ను ప్రారంభించిన కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అనంతరం దీనిపై మాట్లాడారు. ప్రజలకు నాణ్యత, భద్రత, కాలుష్యంపై అవగాహన పెరిగిందని.. వాటికి సంబంధించి ఏవైనా కొత్త విధివిధానాలు అమలు చేస్తే పాటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
'మార్కెట్‌లో మెరుగైన డిజైన్‌లు, మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన మోడళ్లను తయారు చేసే కంపెనీల వాటా క్రమేణా పెరుగుతోంది. భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 ఆటోమొబైల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో, మన ఆటోమొబైల్ పరిశ్రమను స్వావలంబన చేయడంలో భారత్ NCAP కీలకమైనది.' అని ఆయన పేర్కొన్నారు.
గతంలో కార్ల సేఫ్టీ పరీక్షలకు క్రాష్ టెస్ట్ కోసం దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు విదేశాల్లో రూ. 2.50 కోట్లు ఖర్చు చేసేవని మంత్రి అన్నారు. ప్రస్తుత విధానంతో రూ. 60 లక్షల్లో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఇప్పటికే భారత్ NCAP విధానం ద్వారా పరీక్షించేందుకు దేశీయ కార్ల తయారీ సంస్థలు 30కి పైగా కార్లను అందించినట్లు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభమైన తర్వాత పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు సైతం భద్రతా పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇస్తామని వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతాన్ని తగ్గించడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన కార్లను అందించడమే భారత్ NCAP లక్ష్యమని చెప్పారు.
ఈ క్రాష్ టెస్టులో ఐదు భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కారు డిజైన్ చేశారాలేదా.. కారులో ప్రయాణించే పెద్దలకు ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.. పిల్లల భద్రతకు ఇస్తున్న ఫీచర్లు ఏంటి.. పాదచారులను ఢీకొన్నప్పుడు వారిపై ఎంతమేర ప్రభావం ఉంటుంది. ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు.. వంటి అంశాలను పరీక్షిస్తారు.
BNCAP కింద, మోటారు వాహనాల తయారీదారులు లేదా దిగుమతిదారులు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీకి ఫారమ్ 70-Aలో దరఖాస్తును సమర్పించాలి. ప్రముఖ కార్ల తయారీదారులు టయోటా, మారుతీ సుజుకి మరియు మహీంద్రా ఈ కార్ల భద్రతా ప్రమాణాలను పరీక్షించడానికి దేశీయ పరిశ్రమకు NCAP ఒక సాహసోపేతమైన చర్యగా పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications








