భారత్‌లో విడుదలైన కొత్త BMW 7 సిరీస్: ధర రూ. 1.70 కోట్లు
జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు' తన కొత్త 7 సిరీస్ '740i M స్పోర్ట్' విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఈ లగ్జరీ కారు ధర రూ. 1.70 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశీయ విఫణిలో విడుదలైన సరి కొత్త BMW 7 సిరీస్ మొదట్లో X7 ఫేస్‌లిఫ్ట్‌తో ప్రారభించబడింది. అయితే ఇప్పుడు విడుదలైన ఈ కొత్త మోడల్ బ్రాండ్ యొక్క కొత్త డిజైన్ లాంగ్వేజ్ పొందుతుంది, కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ లగ్జరీ కారు డెలివరీలు మార్చి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డీజిల్ వేరియంట్ రానున్న రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త BMW 7 సిరీస్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇది పూర్తిగా రివైజ్ చేయబడిన ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో స్ప్లిట్ LED హెడ్‌లైట్ సెటప్ మరియు పెద్ద కిడ్నీ గ్రిల్ చుట్టూ ఉండే ఇల్యూమినేటెడ్ లైటింగ్ ఎలిమెంట్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 22-ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. వెనుక క్షితిజ సమాంతర LED టెయిల్-లైట్లు మరియు రీప్రొఫైల్డ్ బంపర్ చూడవచ్చు.
ఇంటీరియర్ కూడా చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు లేటెస్ట్ iDrive 8 సాఫ్ట్‌వేర్‌తో రన్ అయ్యే 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. ముందు సీట్ల మధ్య భాగంలో గేర్ సెలెక్టర్, రోటరీ iDrive కంట్రోలర్ మరియు ఇతర టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ తో కూడిన కంట్రోల్ ప్యానెల్ వంటి వాటితో పాటు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.

బిఎండబ్ల్యు 7 సిరీస్ ఇప్పుడు 31.3 ఇంచెస్ 8K 'సినిమా' స్క్రీన్‌ను పొందుతుంది. ఇది పైన పైకప్పుకి అమర్చబడి పైకే ఫోల్డ్ చేసుకునే విధంగా రూపొందించబడి ఉంటుంది. అంతే కాకుండా వెనుక డోర్ ప్యాడ్‌లపై కూడా 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌లు ఉన్నాయి. దీనితో పాటు సాఫ్ట్ క్లోజింగ్ డోర్లు, LED లైటింగ్ ఎలిమెంట్స్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఆధునిక ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి.
గ్లోబల్ మార్కెట్లో బిఎండబ్ల్యు 7 సిరీస్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లు మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెట్రోల్ వంటి పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ కలిగి ఉంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ కొత్త 7 సిరీస్ ను కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసింది. కావున ఇందులో 3.0-లీటర్, ఇన్‌లైన్-సిక్స్-సిలిండర్ యూనిట్ ఉంటుంది. ఇది 380 hp పవర్ మరియు 520 Nm టార్క్ అందిస్తుంది.
ఈ ఇంజన్ ఇప్పుడు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందింది. అంతే కాకుండా ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ లగ్జరీ లిమోసిన్ కేవలం 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంది. అదే సమయంలో ఇది అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ మరియు ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ డంపర్ వంటి వాటిని స్టాండర్డ్ గా పొందుతుంది.
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 7 సిరీస్ BMW దాని CLAR ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రోపొందించబడినప్పటికి భారీగా అప్డేట్ చేయబడింది. కావున వాహనం వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ లగ్జరీ కారు దేశీయ విఫణిలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, లెక్సస్ ఎల్‌ఎస్ 500 హెచ్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ ఆడి ఎ8 ఎల్ వంటి ఆధునిక లిమోసిన్ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








