రైతులకు గుడ్‌న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ITL నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లాంచ్
ఇంటర్నేషనల్ ట్రాక్టర్ లిమిటెడ్(ITL) భారత్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం SV సిరీస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్, సిరీస్ S, సిరీస్ C, సిరీస్ H, సిరీస్ N ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను లాంచ్ చేసింది. ఇందుకోసం ఈ ట్రాక్టర్ల తయారీకి కంపెనీ రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టింది.
ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ ITL ప్రస్తుతం భారత మార్కెట్లో సోనాలికా ట్రాక్టర్(Sonalika Tractors)లను విడుదల చేసి విక్రయిస్తోంది. అంతే కాకుండా వచ్చే మూడేళ్లలో ఐటీఎల్ కంపెనీ వృద్ధిని రెట్టింపు చేయాలని యోచిస్తోంది. ఐటీఎల్ అంతర్జాతీయంగా కూడా ట్రాక్టర్లను విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14 న గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో 5 కొత్త ట్రాక్టర్లను పరిచయం చేసింది.

కొత్తగా విడుదల చేసిన ట్రాక్టర్లన్నీ ఎలక్ట్రికల్ పవర్‌తో నడిచేవి. ఈ జాబితాలో ఉన్న SV సిరీస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్.. ఆల్ బ్రాండ్ ఎలక్ట్రిక్ మోడల్.. ఇది ITL యొక్క Solies బ్రాండ్ క్రింద అభివృద్ధి చేయబడింది. దీనిని ప్రత్యేకంగా యూరప్, అమెరికా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా లాంటి అంతర్జాతీయ మార్కెట్ కోసం అభివృద్ధి చేశారు.
ఈ SV సిరీస్ ట్రాక్టర్లు అధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. దీనిని కేవలం 3 నుండి 3.5 గంటల్లో 0 నుండి 100 శాతం పూర్తిగా ఛార్జ్ అయ్యేలా రూపొందించారు. సాధారణంగా ఈ తరహా వాహనాలను ఛార్జ్ చేయడానికి 8 నుంచి 9 గంటలు సమయం తీసుకుంటుంది.
ఇంకా సిరీస్ H, సిరీస్ S ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు అంతర్జాతీయ మార్కెట్లో అరంగేట్రం చేశాయి. కానీ C సిరీస్ ట్రాక్టర్ మాత్రం యూరోపియన్ మార్కెట్‌కు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఇంకా సిరీస్ N ట్రాక్టర్లు యూరప్, అమెరికా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాలో మాత్రమే మార్కెట్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల ఉత్పత్తి కోసం ITL దాదాపు రూ. 850 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇందుకోసం కంపెనీ కొత్త ప్లాంట్‌ను నిర్మించనుంది. ఇంకా కొత్త ట్రాక్టర్ల పరిశోధన, అభివృద్ధి పనుల కోసం రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో రైతుల కోసం అద్భుతమైన పనితీరుతో ట్రాక్టర్లను తయారు చేసి విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.
ITL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ మిట్టల్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల లాంచ్‌పై మాట్లాడారు. భారత తయారీ ఖర్చుతో, యూరోపియన్ స్టైలింగ్‌ను జోడిస్తూ, జపాన్ టెక్నాలజీ నాణ్యతతో వాహనాలను తయారు చేసే విజయవంతమైన సూత్రాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఈ ఫార్ములాలో తమ నెట్‌వర్క్‌లోని భాగస్వాములు, నిరంతర శ్రమ కీలకం అని చెప్పారు.
కొత్త సవాళ్లను స్వీకరించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని రాహుల్ మిట్టల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతులకు తమ అంతర్జాతీయ ట్రాక్టర్ల పనితీరుతో వారి జీవితాల్లో కొత్త మార్పును తీసుకురావడమే లక్ష్యంగా పేర్కొన్నారు. తమ కొత్త ఆవిష్కరణలతో దీన్ని సాధ్యమయ్యేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ ఆటోమోటివ్ విప్లవం జరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా చాలా మంది ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు అనుకూలంగా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు స్వస్తి పలుకుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతన్నారు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








